Jump to content

వ్యవసాయ నీటిపారుదల ఉపకరణాలు

వికీపీడియా నుండి
(ఏతము నుండి దారిమార్పు చెందింది)

గతకాలములో పంట పొలాలకు నీటిని పారించేందుకు కొన్ని సాధనాలుండేవి. అందులో ముఖ్యమైనవి ఏతం, గూడ, కపిలి/ మోట. ఇతర పరికరాలు: కారెం, గుల్ల, పంపు, సైపను, గిలక, దోకెన, ఏతాళం. తక్కువ లోతు నుండి నీటిని మిట్ట ప్రాంతానికి పారించడానికి ఏతాన్ని వాడతారు.

తొక్కుడు ఏతము
ఏతపు చక్రం సహాయంతో నీటిని తోడి పొలాలకు పంపుతున్న రైతు.

దీనికి కావలసినవి:

[మార్చు]
  • ఒక బలమైన పలవకర్ర (అనగా ఆంగ్ల అక్షరం వై (Y) ఆకారంలో ఉండే దుంగ అని అర్థము). ఏతానికి వాడే పలవకర్రను పలవమాను అంటారు.
  • పొడవైన మరో కర్ర. (సుమారు 20 అడుగుల సన్నని, పొడవైన వెదురు బొంగు). ఈ కర్రను సిడి (సిడె) లేదా ఏతపుమ్రాను అంటారు.
  • ఒక పెద్ద బాన. దీన్నే ఏతం బాన అంటారు.

పని చేసే విధానం

[మార్చు]

పలవమానును రెండు కొసలు పైకి వుండేటట్టు మిట్ట ప్రాంతంలో భూమిలో పాతాలి. పై కొసలకు రంధ్రాలు చేసి, మరో గట్టి కర్రముక్కను ఇరుసు లాగా ఆ రంధ్రాల్లో పెట్టి, ఆ ఇరుసుకు పొడవాటి కర్రను (సిడిని) అనుసంధానించాలి. సిడికి మెరక ప్రాంతం వైపున కొసన సుమారు 20 కిలోల రాయిని బంధించాలి. రెండో కొసన మరో కర్ర లేదా తాడు సాయంతో ఒక బానను అమర్చాలి. ఇలా సిడినీ బాననూ కలిపే తాడును వారిణ/వారిణె అంటారు. ఆరాయి ఉన్న వైపున దాని బరువుకు సిడి భూమిపై ఆని వుంటుంది. బాన వున్న వైపున సిడి యొక్క రెండో కొన ఆకాశంలో పైకి లేసి వుంటుంది. ఒక వ్యక్తి చేతిలో పొడవాటి వెదురు బొంగును చేతబూని ఆధారంగా భూమికి ఆనిస్తూ భూమిపై ఆని వున్న కొనపై నిలబడి పైకి నడుస్తాడు. అతని బరువుకు సిడి బానవున్న వైపు కిందికి దిగుతుంది. అది పల్లపు ప్రాంతం. అక్కడే నీటి గుంట ఉంటుంది. ఆ గుంటకు అడ్డంగా ఒక దుంగను వేసి దానిపై ఒక మనిషి నిలబడి కిందికి దిగుతున్న బానను పట్టుకొని నీటిలో ముంచి పైకి లేపుతాడు. అదే సమయంలో పైనున్న వ్యక్తి తన చేతనున్న కర్ర ఊతంతో సిడి మీద రెండో కొసవైపు నడుస్తాడు. అతని బరువుకు నీటితో నిండిన బాన పైకి లేస్తుంది. అదే సమయంలో కిందనున్న వ్యక్తి బానలోనున్న నీళ్లను మిట్టన కుమ్మరిస్తాడు. ఈ విధంగా సిడి మీదనున్న వ్యక్తి గారడి వాడి లాగ అటూ ఇటూ నడుస్తుంటే నీటితో నిండి పైకి వచ్చిన బానను కిందనున్న వ్యక్తి పైన కుమ్మరిస్తాడు. ఇలా నిరంతరాయంగా చేయటం వలన పల్లంలోనున్న నీటిని పైకి తోడి పొలాలకు పారించగలుగుతారు. ఈ విధానంలో 10 అడుగుల లోతు లోపల ఉన్న నీటినే తోడగలరు. ఒక్క బానలో 20–30 లీటర్ల నీరు పడుతుంది.

గూడా, దాని భాగాలూ

దీనికి కావలసినవి

[మార్చు]

సుమారు 10–20 లీటర్ల నీరు పట్టే శంకాకారపు పాత్ర; దీన్నే గూడ అంటారు. 4 సన్నని దారాలు (పగ్గం). దీనికి ఇద్దరు మనుషులు కావాలి. గూడను డబ్బా రేకుతో గాని, వెదురు బద్దలతో గానీ చేసి తారు పూస్తారు.

పని చేసే విధానం

[మార్చు]

గూడకు రెండు వైపుల రెండు తాడులను కట్టి ఇద్దరు మనుషులు గట్టుమీద నిలబడి చెరో రెండు తాళ్ళను పట్టుకొని వంగుతూ గూడను పల్లంలోనున్న నీటిగుంట లోనికి విసురుతూ నీటితో నిండిన గూడను ఒడుపుగా పైకి లేపుతూ మిట్ట ప్రాంతంలో నీటిని కుమ్మరించాలి. ఈ విధంగా పలుమార్లు వంగుతూ, గూడను విసురుతూ పైకి లేస్తూ, పల్లంలో వున్న నీరు మిట్టకు చేర్చి, పొలాలకు పారిస్తారు. గూడాణూ వేయడానికి చిన్నపాటి ఒడుపు (నేర్పరితనము) కావాలి, లేకుంటే అది ఎంతమాత్రం సాధ్యం కాదు.

తోడికోడళ్ళు సినిమాలో ఆడుతు పాడుతు పనిచేస్తుంటే పాటలో గూడ వాడకం చూడవచ్చు

గుల్ల

[మార్చు]

గుల్ల అనేది ఇనుప రేకుతో చేసిన పరికరం. దీనితో పొలాలకు నీళ్ళుతోడుతారు.

కారెం

[మార్చు]
కారెమూ, దాని భాగాలూ

ఒక తాటిచెట్టు కాండాన్ని లోపల డొల్లగా కోరితే తయారయ్యే పడవలాంటి ఆకారాన్ని దోనె లేదా దోసె అంటారు. ఈ దోనెను ఇంకో అడ్డకర్రపై నిలిపి మీటగా మారుస్తారు. ఈ అడ్డకర్రను మల అంటారు. అలా మలపై దోనెను మీటుతూ మళ్ళకు నీళ్ళు తోడేవారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]