కంప్యూటర్ హార్డ్‌వేర్

వికీపీడియా నుండి
(కంప్యూటరు హార్డువేరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెర్సనల్ కంప్యూటర్ భాగాలను విడదీసినట్లు చూపే చిత్రం(exploded view):
  1. స్కానర్
  2. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సిపియు) (మైక్రోప్రాసెసర్)
  3. ప్రైమరీ స్టోరేజి (రాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్))
  4. ఎక్స్‌పాన్షన్ కార్డులు (గ్రాఫిక్ కార్డులు వంటివి)
  5. పవర్ సప్లై
  6. ఆప్టికల్ డిస్క్ డ్రైవ్
  7. సెకండరీ స్టోరేజి (హార్డు డిస్కు)
  8. మదర్ బోర్డు
  9. స్పీకర్లు
  10. మానిటర్
  11. సిస్టమ్ సాఫ్టువేరు
  12. అప్లికేషన్ సాఫ్టువేరు
  13. కీబోర్డు
  14. మౌస్
  15. బయటి హార్డ్ డిస్క్ డ్రైవ్
  16. ప్రింటర్

హార్డ్‌వేర్‌ అనే మాటకి కంప్యూటర్ పరిభాషలో ఒక ప్రత్యేకమైన అర్ధం ఉంది. చేతితో ముట్టుకోడానికిగాని, పట్టుకోడానికికాని వీలైన భాగాలన్నీ స్థూలకాయం (hardware) నిర్వచనంలో ఇముడుతాయి. ఉదాహరణకి, బల్ల మీద ఇమిడే సొంత కంప్యూటరు (desk-top personal computer) కొనగానే మన చేతులతో తడిమి చూడడానికి వీలైనవి ముఖ్యంగా మూడు: (1) కంప్యూటర్‌ యొక్క అంతర్భాగాలన్నిటిని కప్పుతూ పైకి కనిపించే రేకు పెట్టె లాంటిది ఒకటి, (2) మనం రాసేవి, చూసేవి కనపడడానికి వీలుగా ఒక గాజు తెర (దీన్నే monitor అంటారు), దానితోపాటు టైపు చెయ్యడానికి వీలైన ఒక మీటల ఫలకము (దీనినే keyboard Archived 2021-07-22 at the Wayback Machine అంటారు), వగైరా, (3) వీటన్నిటిని అనుసంధించడానికి తీగలు. ఇవీ బయటకి కనిపించే స్థూలకాయం యొక్క ముఖ్య భాగాలు.

కంప్యూటర్ హార్డ్‌వేర్ అనునది కంప్యూటరుకు సంబంధించిన ఒక భౌతిక విభాగం. ఒక కంప్యూటరు లోని విడి భాగాలు, వాటిని కలిపే సాంకేతిక పరికరాల సముదాయమే హార్డ్‌వేర్. ఐతే ఇది కంప్యూటరు సాఫ్ట్‌వేర్కు పూర్తిగా భిన్నం. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అనేది హార్డ్‌వేర్ లోనే అంతర్గతంగా పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ లోనే మరో రకం ఫర్మ్ వేర్. వీటిని ఎప్పటికప్పుడు మార్చవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇవి రీడ్-ఓన్లీ మెమోరీ (ROM) లాంటి హార్డ్‌వేర్ భాగాల లోనే నిక్షిప్తం చేయబడతాయి.


కొన్ని మినహా చాలా వరకు కంప్యూటరు హార్డ్‌వేర్ సాధారణ ప్రజలు చూసి ఉండరు. ఎందుకంటే అవన్నీ సీపీయూ అని పిలువబడే ఒక క్యాబినెట్ లో ఉంటాయి.

తెలుగు పేర్లు

[మార్చు]
ఒక పర్సనల్ కంప్యూటర్‌లో ముఖ్య భాగాలు.
పర్సనల్ కంప్యూటర్ లోపల ఇలా కనిపిస్తుంది.

హార్డ్‌వేర్‌ కి, సాఫ్‌ట్‌వేర్‌కి ఇంతవరకు మంచి తెలుగు పేరు ఎవ్వరూ పెట్టలేకపోయారు. ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలు:

  • తెలుగులో యంత్రం, తంత్రం అని రెండు మాటలు ఉన్నాయి. హార్డ్‌వేర్‌= యంత్రం అనీ, సాఫ్‌ట్‌వేర్‌ = తంత్రం అనీ అర్ధం చెప్పుకోవచ్చు.
  • హిందీలో 'ఖానా' అనే ఉత్తర ప్రత్యయం ఉంది. దీని అర్ధం 'దొరికే చోటు' అని. కనుక 'దవాఖానా' అంటే మందుల కొట్టు. ఇదే ఒరవడిలో హార్డ్‌వేర్‌ = యంతర్‌ఖానా, సాఫ్‌ట్‌వేర్‌ = తంతర్‌ఖానా అని తెలుగు పేర్లు పెట్టవచ్చు.
  • తెలుగులో సామాను, సామగ్రి అని రెండు మాటలు ఉన్నాయి. ఇంగ్లీషులోని 'ware' కి ఈ రెండూ సమానార్ధకాలు. కనుక హార్డ్‌వేర్‌ = యంత్రపు సామాను = యంత్రమాను, సాఫ్‌ట్‌వేర్‌ = తంత్రపు సామాను = తంత్రమాను అని తెలుగు పేర్లు పెట్టవచ్చు.
  • మరొక ధోరణిలో ఆలోచించవచ్చు. కంటికి కనిపించేది బోదె. బోదెకి ఒక వ్యక్తిత్వం ఇచ్చేది మేధ. కనుక హార్డ్‌వేర్‌ = బోదె, సాఫ్‌ట్‌వేర్‌ = మేధ.
  • ఇదే ధోరణిలో హార్డ్‌వేర్‌ = స్థూలకాయం అనీ సాఫ్‌ట్‌వేర్‌ = సూక్ష్మకాయం అనీ ప్రయత్నించవచ్చు

ముఖ్య భాగాలు

[మార్చు]

పెట్టె మూత జాగ్రత్తగా తీసి, తెలిసీ తెలియకుండా దేనినీ ముట్టుకోకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దిగువ వర్ణించిన భాగాలుకనిపిస్తాయి. మన శరీరపు చర్మాన్ని ఒలిచి లోపలికి తొంగి చూస్తే గుండె, మెదడు మొదలైన అవయవాలలాగే, ఈ పెట్టెలో ఎన్నో ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

  • మైక్రోప్రోసెసర్‌ (microprocessor): అంటే అతి సూక్ష్మ మైన కంప్యూటరు అని అర్ధం. పూర్వం గదంతా ఆక్రమించేసిన కంప్యూటరు ఇప్పుడు వేలి గోరంత మేర ఆక్రమిస్తుంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. దీనిని మన మెదడుతో పోల్చవచ్చు. నిజానికి ఇదీ అసలైన సిసలైన కంప్యూటరు. పైకి చూడడానికి చిన్న పలక ముక్కలా, చిన్న చిల్ల పెంకులా ఉంటుంది కాని దీని కట్టడి అధ్యయనం చెయ్యడానికి చాల దీక్ష ఉండాలి.
  • కొట్టు (store)ని మెమరీ (memory) అని కూడ అంటారు. దీనిలో దత్తాంశాలు (data), ఆదేశాలు (commands) దాచుతాం. ఇందులో రెండు రకాలు. ఒకటి రాం (ROM = Read Only Memory), రెండోది రేం (RAM = Random Access Memory). ROM అచ్చు పుస్తకం లాంటిది. దీనిలో ఉన్న దత్తాంశాలని కంప్యూటరు చదవ గలదు కానీ, చెరిపేసి కొత్తవి రాయ లేదు. RAM పలక లాంటది. దీంట్లో దత్తాంశాలని రాయనూ వచ్చు, రాసి ఉంటే చదవనూ వచ్చు, ఉన్న వాటిని చెరిపేసి కొత్తవి రాయనూ వచ్చు. చిన్న ఉపమానం. మనం పుట్టినప్పుడు మన లలాట ఫలకం మీద బ్రహ్మదేవుడు రాసినదాని ప్రకారం మన జీవితం నడుస్తుందని మనం అనుకుంటాం కదా. ఈ లలాట లిఖితం ROM లాంటిది. అదే ఎవరైనా వారింటికి దారి చెప్పినప్పుడు కాని, వారి టెలిఫోను నంబరు చెప్పినప్పుడు కాని అది మనం మెదడులో దాచుకుంటాం. అవసరం తీరిపోయిన తర్వాత అది చెరిపేసి (మరచిపోయి), ఆ స్థానంలో మరొక విషయం “రాసుకుంటాం”. కనుక ఇది RAM లాంటిది అన్నమాట.


  • తీగల కట్ట (bus): పై రెండింటి తర్వాత చెప్పుకోదగ్గది తీగలు. ఈ తీగల కట్టలనే ఇంగ్లీషులో bus అంటారు. వీటిని మనం పట్టాలు లేదా పటకాలు అందాం. ఊళ్ళ మధ్య ప్రయాణం చెయ్యడానికి రైలు పట్టాలు ఉపయోగపడ్డట్లే రేకు పెట్టెలో ఉన్న మైక్రోప్రోసెసర్‌ ని, రామ్‌ నీ రేమ్‌ నీ కలపడానికే కాకుండా, పెట్టె బయట ఉన్న గాజు తెరనీ, మీటల ఫలకాన్నీ కలపడానికీ, ఇంకా అనేక కార్యాలకి ఈ తీగల రహదారిని వాడతారు.


  • విద్యుత్‌ సరఫరా (Power Supply): కంప్యూటరుకి కావలసిన విద్యుత్తు అంతా ఈ పెట్టె సరఫరా చేస్తుంది. ఈ పెట్టెలో ముఖ్యంగా ఒక transformer ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వోల్టేజిని అవసరం మేరకి తగ్గించి మిగిలిన భాగాలకి సరఫరా చెయ్యడమే ఈ పెట్టె చేసే పని.


  • Hard Drive: పైకి కనిపించదు కానీ, లోపలకి చూడగలిగితే ఇది ఒక దొంతిగా అమర్చిన గ్రామఫోను పళ్ళేల మాదిరి ఉంటుంది. గ్రామఫోను రికార్డుల మీద మనం పాటలు “రాసుకుని” అవసరం వచ్చినప్పుడు తిరిగి పాడించుకుని ఎలా వింటామో అలాగే ఈ పళ్ళేలమీద దత్తాంశాలు రాసుకుని అవసరం వెంబడి తిరిగి "చదువుకుని" వాడుకోవచ్చు. నిత్యం అవసరమైన అంశాలని అన్నింటిని దీని మీద రాసి దాచుకుంటాం.


  • Floppy Drive: ఈ రోజులలో దీని వాడకం బాగా తగ్గి పోయింది. దీనికీ hard drive కీ ఒకే ఒక చిన్న తేడా. దీంట్లో పళ్ళేలని మనం బయటకి తీసి మనతో పట్టుకు పోయి, మరో కంప్యూటర్‌లో దోపి వాడుకోవచ్చు. ఒక కంప్యూటర్‌ నుండి మరొక కంప్యూటర్‌కి దత్తాంశాలు రవాణా చెయ్యటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. దీనిలో వాడే పళ్ళేలు పల్చగా, ఒంచితే ఒంగే రకంగా ఉంటాయి కనుక వాటిని floppy disks అంటారు.


  • CD-ROM Drive: ఇక్కడ CD అంటే compact disk అని అర్ధం. సినిమాలు చూచుటకు,గేములు లోడ్ చేయుటకు ఉపయోగపడును. బజారులో కొనుక్కున్న software లోడ్ చేయుటకు ఉపయోగపడును. ఈ పళ్ళేలలో ఉరమరగా 650 MB వరకు దత్తాంశాలు దాచవచ్చు.


  • CD-ROM/ DVD Drive: ఇక్కడ DVD అంటే digital versatile disk అని అర్ధం. ఈ పళ్ళేలలో 8-16 GB వరకు దత్తాంశాలు దాచవచ్చు.


  • Ports: నదులమీద, సముద్రం మీద రేవులు చేసే పని ఏమిటి? జలభాగం మీది రహదారులని భూభాగం మీది రహదారులతో కలపడం. అదే విధంగా కంప్యూటరు లోపలి రహదారులని బయటి మార్గాలతో అనుసంధించడానికి వాడే సాధనాలే పోర్టులు. వీటిని తెలుగులో రేవులు అని అనొచ్చు. గోడ మీద విద్యుత్ ప్లగ్‌ చేసే పని కూడా ఇదే – ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణాలని బయటి నుండి సరఫరా అయే విద్యుత్తుతో కలపడానికి ప్లగ్‌ వాడతాం. అదే విధంగా కంప్యూటర్‌ని బయట ఉన్న ప్రింటర్‌తో, మీటల ఫలకంతో, మోడెమ్‌ తో, ఇంటర్‌నెట్‌ తో, కలపడానికి ఈ రేవులని వాడతారు. వీటిలో ముఖ్యమైనవి కొన్ని --
(1) మీటల ఫలకాన్ని (keyboard) తగిలించే రేవు
(2) గాజుతెర (monitor) కి బొమ్మల (video) వాకేతాలని (signal) తగిలించే రేవు
(3) చుంచు (mouse) ని తగిలించే రేవు
(4) Universal Serial Bus (USB)
(5) ప్రింటర్‌ని తగిలించటానికి సమాతర రేవు (Parallel Port)
(6) Sound cards
(7) మోడెమ్‌ తగిలించటానికి
  • BIOS: లేదా Basic Input/Output System. కంప్యూటర్‌ యొక్క స్థూలకాయానికీ, సూక్ష్మ కాయానికీ మధ్య ఉండే మధ్యవర్తి లాంటిది. సూక్ష్మ కాయంలో ముఖ్యాతి ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System) లేదా (O.S.) ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటే ఏయే ఉత్తర్వులు ఏయే సూక్ష్మ కాయపు భాగాన్ని చేరాలో ఈ BIOS పర్యవేక్షణలో జరుగుతాయి.
  • అమాంబాపతులు: పైన చెప్పిన ముఖ్య భాగాలేకాకుండా కంప్యూటర్‌లో ఇంకా ఎన్నో చిన్న చిన్న అంతర్భాగాలు ఉంటాయి.

వనరులు

[మార్చు]
  • Ron White, How Computers Work, Que: MacMillan Computer Publishing, Indianapolis, IN, USA, 1999