కుప్పిలి పద్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుప్పిలి పద్మ ప్రముఖ తెలుగు రచయిత్రి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

కుప్పిలి పద్మ రచయిత్రి,  కాలమిస్టు, మీడియా ప్రొఫెషనల్ ..... పదేళ్ళ సుదీర్ఘ కాలం ‘వార్త’ దినపత్రికలో నడిచిన వీక్లీ కాలమ్ ‘మైదానం’ రచయిత్రిగా కుప్పిలి పద్మ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని సమకాలీన జీవితంపై విభిన్న కోణాల్లో చేసే వ్యాఖ్యానాలు తెలుగు పాఠకులకు సుపరిచితమే. తెలుగు పక్షపత్రిక ‘ప్రజాతంత్ర’లో  మహిళా పేజీ ‘మిసిసిపి’కి సంపాదకురాలిగా పనిచేశారు. నాలుగు కథా సంకలనాలకూ సంపాదకురాలిగా బాధ్యతలు నిర్వహించారు.  

పాఠశాల విద్యార్ధిగా వున్నప్పటి నుంచే కథలు రాసే వొక రచయిత్రిగా కుప్పిలి పద్మ పేరు 90ల మధ్యకాలంలో నలుగురి దృష్టికీ వెళ్ళింది.100కు పైగా కథలు రాశారు. ఇవి తొమ్మిది కథా సంపుటాలుగా వచ్చాయి. వీటితో పాటు మూడు నవలలూ, సృజనాత్మక వచనం రెండు సంపుటాలుగా  వెలువడ్డాయి. ఆమె కథలు "Salabhanjika and other stories’ గా ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యాయి. ఆమె కవితలు ‘నెమలీకలు పూసే కాలం’,'మోహనదీ తీరమ్మీద నీలి పడవ 'సంకలనంగా ప్రచురితమయ్యాయి.  

తన తొలి కథా సంపుటం'మనసుకో దాహం'నుంచి ఇటీవలి 'పొగ మంచు అడివి’ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంస్కరణల పర్యవసానాలపై ఆమె రచనలు చేశారు. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలు, బహిరంగ ప్రదేశాల్లో స్త్రీలపై పెరుగుతున్న హింస, ముఖ్యంగా నిత్యజీవితంలో స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక  హింసపై  ప్రత్యేక దృష్టి ఆమె రచనల్లో కనిపిస్తుంది. ప్రధానంగా కౌమార దశలోని ఊగిసలాటలు, వినిమయతత్వం, ప్రపంచీకరణ, సింగిల్ ఉమన్ ఎదుర్కొనే సవాళ్ళు, పనిస్థలంలోని సమస్యలను ఆమె కథలు చర్చిస్తాయి. ఆమె స్త్రీ పాత్రలు బలమైన వ్యక్తిత్వంతో వివిధ ముసుగుల్లో ఉండే  పితృస్వామ్య విలువలను ఎదుర్కొంటాయి. అదే సమయంలో తమ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేస్తూ ఎదురయ్యే సవాళ్ళు, అనివార్యతలు, ఒత్తిడులు, ఊగిసలాటలను భరించి  ధైర్యంగా పర్యవసానాలను ఎదుర్కొంటాయి.  ప్రకృతి సౌందర్యాన్నీ, జీవితంలో దాని పాత్రనూ  అత్యంత కవితాత్మకంగా చిత్రించటం ఆమె రచనల ప్రత్యేకత. తన రచనల్లో సంభాషణలను క్లుప్తంగా, సూటిగా, పదునుగా, కళాత్మకంగా, వ్యంగ్యపూరితంగా చెప్పడం ఆమె ప్రత్యేకత. 

సరికొత్త తరం (millennials)  ఎదుర్కొనే సవాళ్ళనూ, అంశాలనూ తెలుగులో చర్చించే, వ్యాఖ్యానించే  పరిణతి చెందిన స్త్రీవాద స్వరం ఆమెది. ఇది ఇతర భాషల్లోని రచయితలు కూడా ఆమె రచనల ప్రతిభను గుర్తించేలా చేసింది. ఆమె కథలెన్నో ఇంగ్లీషు లోకి అనువాదమయ్యాయి. 

భారతీయ భాషల్లోని ఉత్తమ కాల్పనిక కథలను ఏటా సంకలనాలుగా తెచ్చే ‘కథ’ అనే ఢిల్లీకి చెందిన సాహిత్య సంస్థ ‘మసిగుడ్డ’ కథను ఇంగ్లీషులోకి అనువదించి  ప్రచురించింది. మసిగుడ్డ కథ ఒడియా, మలయాళంలోకి అనువదించారు.‘గోడ’ కథను ఇండియన్ లిటరేచర్ మంత్లీ జర్నల్లో అనువదించారు. ‘అజేయ’ కథ కన్నడ, ఇంగ్లీష్ భాషలోకి  అనువాదమయింది.‘మమత’,‘నిర్ణయం’,‘యిన్ స్టెంట్ లైఫ్’ కథలు అనువాద రూపంలో వివిధ కథాసంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ‘సెకెండ్ హస్బెండ్’ కన్నడంలోకి, మలయాళంలోకి అనువదించారు.

ఓ ఓవర్సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.[2]

అమృత వర్షిణి అనే పుస్తక ప్రచురణతో సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన పద్మ యిప్పటికి అనేక కథలు రాశారు.

కథా ప్రక్రియలోనే కాకుండా కాలమిస్టుగా కూడా పద్మ సుపరిచితురాలు.

చాసో ట్రస్టు ప్రతియేటా అందించే ప్రతిష్ఠాత్మక చాగంటి సోమయాజులు చాసో సాహితీ పురస్కారం, 2009లో కుప్పిలి పద్మ అందుకొన్నారు.

కుప్పిలి పద్మ కథాసంపుటాల ఆవిష్కరణ సభ నవంబరు 26, 2015న హైదరాబాదు, పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగినది[3]

పుస్తకాలు

[మార్చు]

కథా సంపుటాలు:

  • మనసుకో దాహం - 1994
  • ముక్త - 1997
  • సాలభంజిక - 2001
  • మంచుపూలవాన - 2008
  • వాన చెప్పిన రహస్యం - 2014
  • ద లాస్ అఫ్ యిన్నోసెన్స్ -2015
  • కుప్పిలి పద్మ కథలు - 2017
  • మంత్రనగరి సరిహద్దుల్లో... - 2018
  • పొగ మంచు అడివి - 2019
  • నవలలు:
  • ----
  • పడగ నీడలో
  • గుల్మొహర్ అవెన్యు..
  • అహల్య
  • మహిత
  • మహి
  • ప్రేమలేఖలు:
  • ----
  • అమృత వర్షిణి - 1993
  • మ్యూజింగ్స్
  • ---
  • శీతవేళ రానీయకు - 1999
  • కవిత్వం:
  • ---
  • నెమలీకలు పూసే కాలం 2017

పురస్కారాలు

[మార్చు]
  • సినారె పురస్కారం (2023)[4][5]
  • ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి సీతాదేవి  అవార్డు  (2017)
  • ఉత్తమ రచయిత్రిగా సాహితీ మాణిక్యం  అవార్డు (2016)
  • ఉత్తమ రచయిత్రిగా  దాట్ల  నారాయణ రాజు సాహితీ పురస్కారం (2015)
  • ఉత్తమ కథానికా రచయిత్రిగా  చాసో అవార్డు   (2008)
  • తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి అవార్డు
  • ఉత్తమ రచయిత్రి- అబ్బూరి వరద రాజేశ్వరరావు ట్రస్ట్ అవార్డు (2002)
  • ఉత్తమ రచయిత్రిగా తెన్నేటి హేమలత అవార్డు , వంశీ ఇంటర్నేషనల్ అవార్డు లు  (2004)
  • సాలభంజిక కధానికకు మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ, తిరుపతి  నుంచి  కథాకోకిల పురస్కారం  (2001-2002)
  • సాలభంజిక కథానికకు ఉత్తమ కథా రచయిత్రిగా  రంగవల్లి మెమోరియల్ ట్రస్ట్ అవార్డు     (2001)
  • భాషా నైపుణ్యాలు, కృషికి సంబంధించి ‘తెలుగు వైభవం’లో భాగంగా తెలుగు అధికార భాషాసంఘం చేత ప్రత్యేక గుర్తింపు  (2004)   
  • ఢిల్లీ తెలుగు అకాడమీలోని  ఆంధ్ర అసోసియేషన్ అవార్డు  (1995)
  • పద్మ మోహన అవార్డు  (1993)
  • ప్రతిష్ఠాత్మకమైన చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి 16వ సాహితీ పురస్కారారం.[6]

మూలాలు

[మార్చు]
  1. http://kathanilayam.com/writer
  2. http://kathanilayam.com/writer/635
  3. http://www.andhrajyothy.com/artical?SID=175623[permanent dead link]
  4. Namasthe Telangana (26 January 2023). "కుప్పిలి పద్మకు సినారె పురస్కారం". Retrieved 26 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. Eenadu (26 January 2023). "కుప్పిలి పద్మకు సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం". Retrieved 26 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  6. http://telugu.oneindia.com/news/2009/12/31/chaganti-somayajulu-award-kuppili-padma-311209.html

ఇతర లింకులు

[మార్చు]