పరీక్షిత్తు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహాభారతంలో ధర్మరాజు మనవడు, పాండవుల వారసుడూ అయిన పరీక్షిత్తు జీవనాన్ని గురించిన ఐతిహ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించిన గ్రంథమిది.

రచన నేపథ్యం

[మార్చు]

మహాభారత ఇతివృత్తం నుంచి స్వీకరించిన ఇతివృత్తాన్ని తన హేతువుతో, చరిత్ర జ్ఞానంతోనూ పరిశీలించి పరీక్షిత్తు అనే ఈ గ్రంథాన్ని పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి రచించారు. 1932లో రచించిన ఈ గ్రంథం అదే ఏడాది ద్వితీయ ముద్రణ పొందడం విశేషం. ఆలయ నిర్మాత, నిరతాన్నదాత, సంగీతకారుడు, పౌరాణికుడు, జ్యోతిష్కుడు ఐన తన తండ్రి వెంకయ్యకు, దానశీలి, సద్గుణ సంపన్నురాలైన తన తల్లి రామాంబకు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు రచయిత సుబ్రహ్మణ్యశాస్త్రి.[1]

రచయిత

[మార్చు]

పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బహు గ్రంథకర్త. ఆయన పురాణేతిహాసాలకు హేతువుతో నిష్కర్ష చేసుకుంటు చరిత్ర కోణం నుంచి రాయడంలో సుప్రసిద్ధులు. 1928లో మహాభారత చరిత్రము అనే పేరుతో ఆయన వెలువరించిన గ్రంథం సంచలనాలకు కారణమైంది. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది. మహాభారతానికి చారిత్రిక, హేతు దృష్టితో చేసిన వ్యాఖ్యానమైన ఈ గ్రంథాన్ని ఖండించేందుకు పండిత సభలు కూడా జరిగాయి. మహాభారతాన్ని వచనంలోకి అనువదించిన శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి దీన్ని ఖండిస్తూ శ్రీ మహాభారత చరిత్ర నిరాకరణము అనే గ్రంథాన్ని రచించారు. ఆపైన వారిరువురు పత్రికా ముఖంగా చేసుకున్న వ్యక్తిగత నిందలు కోర్టుకెక్కి తుదకు ఇద్దరికీ చెరి రూ.20ల జరిమానా వేశారు కోర్టు వారు.[2]

విషయ సంగ్రహం

[మార్చు]

మహాభారతంలో పాండవుల వారసుడైన పరీక్షిత్తు జీవితం గురించి ఈ కథలో అధ్యాయాలుగా వివరించారు. పరీక్షిత్తు జననానికి పూర్వరంగం, పరీక్షిత్తు జననం, ధర్మరాజు అశ్వమేధ యాగం, ఆపైన సంఘటనలు, పరీక్షిత్తు బాల్యం, మహాభారత యుద్ధం, పాండవుల పాలన, వారి మహాప్రస్థానం, పరీక్షిత్తు పాలన మొదలైన విషయాలు అధ్యాయాలుగా ఉన్నాయి. మహాభారతంలో పాండవుల వారసునిగా, భాగవతంలో భాగవత శ్రోతగా పరీక్షిత్తు ప్రవర్తిల్లుతాడు. ఇలాంటి పాత్ర జీవితక్రమాన్ని సామాజిక శాస్త్రం, శాస్త్రీయ దృక్కోణాలలో రచించడం విశేషం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పరీక్షిత్తు:పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి:అంకితం:పేజీ.1:1932
  2. సాహితీ కలహ భోజనాలు!:మువ్వల సుబ్బరామయ్య:సరసభారతి-ఉయ్యూరు జాలపత్రిక:2013