Jump to content

అంబాలాల్ సారాభాయి

వికీపీడియా నుండి
అంబాలాల్ సారాభాయి
జననం(1890-02-23)1890 ఫిబ్రవరి 23
మరణం1967 జూలై 13(1967-07-13) (వయసు 77)
బంధువులుసారాభాయి కుటుంబం

అంబాలాల్ సారాభాయి (ఆంగ్లం: Ambalal Sarabhai) (1890 ఫిబ్రవరి 23 - 1967 జూలై 13) భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, సంస్థల వ్యవస్థాపకుడు, మహాత్మాగాంధీకి గట్టి మద్దతుదారు, సంస్కృతిలో విభిన్నమైన ఆసక్తులు కలిగిన వ్యక్తి. ఇతడు కాలికో మిల్స్ చైర్మన్, ప్రమోటర్, సారాభాయ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు. అతను భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు.

నేపథ్యం, ప్రారంభ జీవితం

[మార్చు]

అంబాలాల్ ఖాన్‌పూర్‌లోని చంద్ర-సూరజ్ మహేల్‌లో సారాభాయ్ మగన్‌భాయ్ : గోదావారిబా దంపతులకు జన్మించారు. ఇతడు అంబాజీమాత దయాభిక్షగా జన్మించాడని గోదావరీబా దృఢమైన నమ్మకం, అందుకే అతనికి 'అంబాలాల్' అని పేరు పెట్టారు.

తల్లిదండ్రుల మరణం తర్వాత మామ చిమన్ భాయ్ ముగ్గురు పిల్లలను (అనసూయ, అంబాలాల్, కాంత) జాగ్రత్తగా చూసుకున్నాడు. అంబాలాల్ 1907 లో గుజరాత్ కాలేజీలో చేరిన కొద్దికాలానికే అతని మామ చిమన్ భాయ్ ఆకస్మిక మరణం కారణంగా కాలికో, జూబ్లీ మిల్స్ యొక్క నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. అతడు 1910 లో అతను శ్రీ హరిలాల్ గోసాలియా కుమార్తెయైన రేవాను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం ఆమె పేరును సరళాదేవి సారాభాయ్ అని మార్చారు. అతను తరువాత కుర్రమ్‌చంద్ ప్రేమ్‌చంద్ ని పెధి (కుటుంబ వ్యాపారం) డైరెక్టర్‌గా చేరాడు. అంబాలాల్ కు సరళాదేవిద్వారా ఎనిమిది మంది పిల్లలు కలిగారు. వీరిపేర్లు వరుసగా: మృదుల (1911-1974), భారతి (1912-1986), సుహ్రిద్ (1913-1942), లీనా (1915-2012), గౌతమ్ (1917-1995), విక్రమ్ (1919-1971), గీత (1921-2011), గీరా (1923-2021). అతని కుటుంబం "మెడిసి ఆఫ్ అహ్మదాబాద్" అని పేరుపొందింది.

వ్యాపారం

[మార్చు]
కుమార్తె గీతా సారాభాయి తో అంబాలాల్, 1952

1922 లో, సారాభాయ్ ఇంగ్లాండ్ నుండి అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి, వస్త్రాల తయారీ పరిశ్రమలో అనేక ఆవిష్కరణలకు దారితీసే ఆధునిక సాంకేతిక పద్ధతులను, విభిన్నమైన ఆలోచనలను పరిచయం చేశాడు. భారతదేశంలో ఈ ఆధునిక సాంకేతికతలను స్వీకరించిన మొట్టమొదటి మిల్లుగా కాలికో మిల్లు నిలిచింది.

1931 లో, అతను కృష్ణ ఆయిల్ మిల్లులను కొని స్వస్తిక్ ఆయిల్ మిల్స్‌గా పేరు మార్చాడు, ఇవి ఇంగ్లండు నుండి తెచ్చిన ఆధునిక సాంకేతికతల సహాయంతో వేరుశెనగ, నువ్వుల నూనె తయారీని ప్రారంభించింది. తరువాత, ఈ ఆయిల్ మిల్స్ కూడా డిటర్జెంట్ సబ్బులు, సువాసనభరితమైన ఆముదం నూనె తయారీని ప్రారంభించింది. 1943 లో సారాభాయ్ బరోడాలో సారాభాయ్ కెమికల్స్ ప్రారంభించాడు. దీనిని అతని కుమారుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నిర్వహించారు . తరువాత ఇతడు న్యూయార్క్ లోని స్క్విబ్ & కంపెనీ తో సహకారం పెంపొందించాడు, జర్మన్ కంపెనీ మెర్క్ సహకారంతో సారాభాయ్ మెర్క్ లిమిటెడ్ ను, స్విస్ కంపెనీ జెఆర్ గీగీ సహకారంతో సుహ్రిద్ గీగీ లిమిటెడ్‌ను ప్రారంభించాడు.

సారాభాయిలు కలకత్తా కేంద్రంగా పనిచేస్తున్న స్టాండర్డ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరు సిన్బయోటిక్స్ లిమిటెడ్‌తో కూడా సంబంధం కలిగివున్నారు. సారాభాయ్ కెమికల్స్ సంస్థ స్ట్రెప్టోమైసిన్, పెన్సిలిన్, విటమిన్లు, యాంటీబయాటిక్‌లను తయారు చేసేది.

అంబాలాల్ సారాభాయ్ 1919 లో బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. 1935 జనవరి 3 తేదీన ఎఫ్.ఇ. దిన్షా పదవీకాలం తర్వాత అంబాలాల్ ఛైర్మన్ అయ్యాడు. అతను బ్యాంక్ ఆఫ్ ఇండియాతో నలభై ఐదు సంవత్సరాలకు పైగా గౌరవ సలహాదారుగా సంబంధం కలిగి ఉన్నాడు. 1910 లో ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులోనే ప్రభుత్వం ద్వారా అహ్మదాబాద్ పురపాలకసంఘం సభ్యుడిగా నియమించబడ్డారు.

భారతదేశ స్వాతంత్ర్యంలో పాత్ర

[మార్చు]

1927 లో, ఇతడు వల్లభాయ్ కి చెందిన జాతీయవాద రాష్ట్రీయ పక్షం తో పోటీ పడటానికి స్వతంత్ర పార్టీ (స్వతంత్ర) ను స్థాపించాడు. సారాభాయ్, వల్లభాయ్ ల మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా, 1929 లో సారాభాయ్ రాజీనామా చేశారు.

గాంధీ భారతదేశంలో ఏదైనా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కూడా, సారాభాయ్ 1916 నుండి మహాత్మా గాంధీకి, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి బలమైన మద్దతుదారు. గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమం సారాభాయ్ ఇచ్చిన ఉదార విరాళంతో పునరుద్ధరించబడింది.

1947 లో, సారాభాయ్ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ అయ్యారు.

దాతృత్వం

[మార్చు]

ఇతడు స్థాపించిన అంబాలాల్ సారాభాయ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ వడోదరలో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తోంది. అంబాలాల్ సారాభాయ్ ఫౌండేషన్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ & వెల్ఫేర్, అంబాలాల్ సారాభాయ్ ట్రస్ట్ ఇతడు స్థాపించిన మరొక రెండు ప్రధాన ధార్మిక ట్రస్టులు. ఇప్పుడు ఈ రెండింటిని అంబాలాల్ వారసులు చూసుకుంటున్నారు. ఈ ట్రస్టులన్నీ కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ లోనే కాక కొన్ని ఇతర నగరాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, ధార్మిక దవాఖానాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

మూలాలు

[మార్చు]
  • Basu Aparna, As Times Change. Sarabhai Foundation, 2018. p 115, 123, 124
  • M. V. Kamath & V. B. Kher, The Story of Militant But Non-Violent Trade Unionism. Navajivan Trust. 1993. p 37
  • Edwin Mortimer Standing, Indian Twilight. Bharati Sarabhai Charity Trust. 1967.
  • Howard Spodek, Ahmedabad: Shock City of Twentieth-Century India. Orient Blackswan Private Limited. 2012. p 37, 38, 39, 40, 121-139.
  • Erikson, Erik H. Gandhi’s Truth: On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited. 1970. p 296-303.
  • Amrita Shah, Vikram Sarabhai: A Life. Penguin Books. 2016. p 6-13, 27, 29, 40, 45, 54, 66, 77-78, 91, 93, 99-100, 102, 104, 141, 164, 210.
  • Kenneth L. Gillion. Ahmedabad: A Study In Indian Urban History. University of California Press Berkeley and Los Angeles. 1968. p 86,87, 170
  • Dwijendra Tripathi and Makarand Mehta. Business Houses in Western India: A Study in Entrepreneurial Response 1850- 1956. Manohar Publications. 1990. p 92
  • Tirthanker Roy. A Business History of India: Enterprise and the Emergence of Capitalism from 1700. Cambridge University Press. 2018. p 146, 171, 192
  • Amrita Shah. Ahmedabad: A City in the World. Bloomsbury Publishing India. 2015
  • Kalia,Ravi. Gandhinagar: building national identity in postcolonial India. University of South Carolina. 2004. p 43-45, 50, 51, 53.