Jump to content

అడై

వికీపీడియా నుండి

అడై ఇది తమిళ వంటకం. అయినా గానీ ఆకలికి తమిళం ఏంటీ, బెంగాలీ ఏంటీ. ఏదయినా ఒకటే. మంచి రుచికరమైన, పోషకాలతో కూడిన వంటకం అయితే చాలు. ఇందులో అన్ని పప్పులు కలిసి ఉంటాయి. మంచి పోషక విలువలు ఉంటాయి. ఇందులో కారం ఉప్పూ కలిసే ఉంటాయి కాబట్టి నంచుకోవడానికి ఏమీ లేకుండా కూడా దీనిని తినవచ్చు. కావాలంటే చట్నీ లేదా సాంబారుతో తినవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: పెసర్లు లేదా పెసరపప్పు 1 కప్పు శనగలు లేదా శనగ పప్పు 1 కప్పు కందులు లేదా కంది పప్పు 1 కప్పు మినుములు లేదా మిప పప్పు 2 టీస్పూన్లు బియ్యం 2 కప్పులు తయారు చేసే విధానం: పైన తెలిపిన పదార్థాలను అన్నింటినీ ఒక గిన్నెలో తీసుకుని కడిగి నానబెట్టుకోవాలి. 2 గంటలు నాననివ్వాలి. తర్వాత మిక్సీలో కొంచెం కరివేపాకు, ఆరు పచ్చిమిరప కాయలు ఆరు ఎండు మిరప కాయలు (కారం ఎక్కువ కావాలంటే మరిన్ని చేర్చండి) వేసి నానబెట్టిన పప్పులను కూడా వేసి కొంచెం రవ్వ రవ్వగా ఉండేట్టు కొద్దిగా నీటిని చేరుస్తూ రుబ్బుకోవాలి. దోసె పిండి లాగా వదులుగా ఉండకూడదు, చపాతి పిండి లాగా గట్టిగానూ ఉండకూడదు. రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి దీనిని 2 గంటల పాటు పులియనివ్వండి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పెనం వేడి అయిన తర్వాత కొద్దిగా నూనె రాసి దానిపై ఈ రుబ్బుకున్న పిండిని దోశ లాగా పోసుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల నివ్వండి. అల్లం వెల్లుల్లి తినే వారు రుబ్బేటపుడు దానిలో చేర్చుకోవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=అడై&oldid=2883548" నుండి వెలికితీశారు