అబ్రహాం బరాక్ సేలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్రహాం బరాక్ సేలం
జననం1882
మరణం1967(1967-00-00) (వయసు 84–85)
ఇతర పేర్లుయూదు గాంధీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మేషుచ్రారిమ్‌పై చూపుతున్న వివక్షపై పోరాటం

అబ్రహం బరాక్ సేలం (1882-1967) ఒక భారతీయ జాతీయవాది, జియోనిస్ట్, న్యాయవాది, రాజకీయవేత్త. ఇరవయ్యవ శతాబ్దంలో కొచ్చిన్ కు చెందిన యూదు ప్రముఖులలో ఒకరు. మేషుచ్రారిమ్ వారసుడు. కొచ్చిన్ యూదుల్లో న్యాయవాది అయిన తొట్టతొలి వ్యక్తి. అతను ఎర్నాకుళంలో ప్రాక్టీస్ చేసాడు. చివరికి అతను తన ప్రజలపై యూదుల పట్ల చూపుతున్న వివక్షపై అతడు సత్యాగ్రహ పద్ధతిలో పోరాడాడు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో, భారతీయ జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, తరువాత అతను జియోనిజం వైపు ఆకర్షితుడయ్యాడు. 1930 వ దశకంలో పాలస్తీనాను సందర్శించిన తరువాత, 1955 నాటికి చాలా మంది కొచ్చిన్ యూదులు ఇజ్రాయెల్‌కు వలస వెళ్ళేందుకు తోడ్పడ్డాడు. తాను మాత్రం శేష జీవితమంతా కొచ్చి లోనే గడిపాడు.

తొలి జీవితం

[మార్చు]

సేలం 1882 లో కొచ్చిన్ ( కొచ్చిన్ రాజ్యం ) లో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. కొచ్చి అప్పుడు బ్రిటిష్ భారతదేశంలో ఒక సంస్థానంగా ఉండేది. అతని కుటుంబాన్ని మేషుచ్రారిమ్‌గా పరిగణిస్తారు. యజమానులే స్వచ్ఛందంగా విడుదల చేసిన బానిసలని ఆ హీబ్రూ పదానికి అర్థం. కొన్నిసార్లు తటస్థంగా వాడినప్పటికీ, కొన్నిసార్లు అవమానకరమైన ఉద్దేశ్యంతో వినియోగిస్తారు. స్పెయిన్ నుండి యూదులు బహిష్కరించబడిన తరువాత 16 వ శతాబ్దం నుండి ఈ పరదేశి [విదేశీ] యూదులు కొచ్చిన్ వచ్చారు. మెషుచ్రారిమ్‌ లంటూ కొచ్చి యూదు సమాజంలో వారిపై వివక్ష చూపారు. కొచ్చిన్ లోని పరదేశి సినగాగ్‌లో (యూదు దేవాలయం) వారిని తక్కువ స్థాయి వ్యక్తులుగా చూసారు. వారి మధ్య సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఈ పరదేశి ("శ్వేత జాతి"), యూదులు, స్థానిక మలబారి యూదులు శతాబ్దాలుగా తమ మధ్య గల జాతి భేదాలను కొనసాగించాయి. ఇవి చారిత్రికంగా శరీరపు రంగులో గల తేడాతో ముడిపడి ఉన్నాయి.

తల్లి సంరక్షణలో పెరిగిన సేలం, ఎర్నాకుళంలోని మహారాజా కళాశాలలో చదివాడు. చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ సంపాదించాడు. అతడు, మేషుచ్రారిమ్‌లలో మొట్ట మొదటి యూనివర్సిటీ గ్రాడ్యుయేటు. [1] చెన్నైలో ఉన్నప్పుడే న్యాయశాస్త్ర పట్టా కూడా సంపాదించాడు. కొచ్చిన్ యూదుల్లో అతడు మొట్ట మొదటి న్యాయవాది. [2] అతను ఎర్నాకుళంలోని కొచ్చిన్ చీఫ్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసాడు.

క్రియాశీలత

[మార్చు]

మలబారి యూదులకు ఏడు ప్రార్థనా స్థలాలు ఉన్నాయి; శ్వేతజాతి యూదులకు పరదేసి సినగాగ్ అనే ఒక సినగాగ్ ఉంది. అపవిత్రులని భావించే వారికి అందులో నిషేధం ఉంది. సమకాలీన చరిత్రకారుడు ఎడ్నా ఫెర్నాండెజ్ దీనిని "శ్వేత స్వచ్ఛతకు కంచుకోట" అని అన్నాడు. [3] శ్వేత జాతి యూదులు తమ సామాజిక సమూహం లోని వ్యక్తులనే పెళ్ళి (ఎండోగామస్ ) చేసుకునేవారు. వాళ్ళు మెషుచర్రిం లను, మలబారీ యూదులనూ చేసుకునేవారు కాదు. మలబారీ యూదులు కూడా ఇలాగే ఇతర సమూహాల వక్తులను పెళ్ళి చేసుకునేవారు కాదు. మేషుచ్రారిమ్‌లు సినగాగ్ వెనుక గాని, బయట గానీ కూర్చోవలసి వచ్చేది. ఇది, ఆ కాలంలో దిగువ కులాల పట్ల భారతీయ వివక్షను పోలి ఉండేది. ఇదే వివక్ష కొన్నిసార్లు భారతదేశంలోని క్రైస్తవ చర్చిలలో కూడా ఉండేది.

సేలం కొంతకాలం పాటు సినగాగ్‌ను బహిష్కరించి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అతను సత్యాగ్రహాన్ని (లేదా అహింసాత్మక నిరసన) సమాజంలోని వివక్షను ఎదుర్కోవడానికి సాధనంగా ఉపయోగించాడు. ఈ కారణంగా కొంతమంది అతడిని "యూదు గాంధీ " అని అన్నారు. [4] 1930 ల మధ్య నాటికి, పాత నిషేధాలు చాలావరకు అంతరించాయని మాండెల్‌బామ్ రాసాడు. ఇది భారతీయ సమాజంలో వస్తున్న విస్తృతమైన మార్పులను ప్రతిబింబిస్తుంది. [5]

సేలం 1925 నుండి 1931 వరకూ, మళ్లీ 1939 నుండి 1945 వరకూ కొచ్చిన్ సంస్థానంలో శాసన మండలిలో పనిచేశారు. కేరళలో ప్రారంభమైన కార్మిక సంఘ ఉద్యమానికి అతడు మద్దతుగా నిలిచాడు. అతడు చురుకైన భారతీయ జాతీయవాది, 1929 చివరలో అతను భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సెషన్‌కు హాజరయ్యాడు. బ్రిటిషు వారి నుండి పూర్తి స్వాతంత్ర్యం సాధించాలని ఆ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. [2]

1933 లో పాలస్తీనాను సందర్శించిన తర్వాత, సేలం జియోనిస్ట్ వాదానికి ఆకర్షితుడయ్యాడు. భారత స్వాతంత్ర్యం తరువాత, అతను కొచ్చిన్ యూదులలో ఇజ్రాయెల్‌కు వలస పోవడాన్ని (అలియా) ప్రోత్సహించాడు. 1953 లో అతను, వలస వెళ్లాలనుకునే భారతీయ యూదుల తరపున చర్చలు జరపడానికి ఇజ్రాయెల్‌ సందర్శించాడు. ఇది కొచ్చిన్ యూదుల మధ్య విభేదాలను తగ్గించడానికి కూడా సహాయపడింది. [6] వలస వెళ్ళిన తర్వాత వారందరూ ఇజ్రాయెల్‌లో విదేశీయులుగా పరిగణించబడ్డారు. అక్కడి సమాజంలో కలిసిపోవడానికి అనేకమంది ఇబ్బంది పడ్డారు.

1955 నాటికి కొచ్చిన్ లోని పురాతన యూదు సమాజంలో ఎక్కువమంది ఇజ్రాయెల్‌కు వెళ్లినప్పటికీ (తెల్లజాతి యూదుల్లో అనేక మంది ఉత్తర అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళారు), సేలం మాత్రం 1967 లో మరణించే వరకు కొచ్చిన్‌లోనే నివసించాడు. అతడిని కొచ్చిన్‌లోని జ్యూ టౌన్‌లోని శ్వేతజాతి యూదుల స్మశానవాటికలో ఖననం చేశారు.

గౌరవాలు

[మార్చు]
  • కొచ్చిలోని శ్వేత యూదుల శ్మశానవాటిక పక్కనే ఉన్న రహదారికి సేలం పేరు పెట్టారు. [2]
  • మేషుచ్రారిమ్‌లపై వివక్షకు వ్యతిరేకంగా సేలం జరిపిన పోరాటంపై నాథన్ కట్జ్, ఎల్లెన్ గోల్డ్‌బెర్గ్ లు "జెవిష్ అపార్థైడ్ అండ్ ఎ జెవిష్ గాంధీ" పేరిట పుస్తకం రాసారు. [7]

మూలాలు

[మార్చు]
  1. Katz 2000:67
  2. 2.0 2.1 2.2 T. V. R. Shenoy, "The Jewish Gandhi and Barack Obama", Rediff, 8 September 2008
  3. Fernandes 2008:155
  4. "A Kochi dream died in Mumbai", Indian Express, 13 December 2008
  5. Fernandes 2008:164
  6. Chiriyankandath 2008:21
  7. Katz, Nathan; Goldberg, Ellen S. (1988). "Jewish "Apartheid" and a Jewish Gandhi". Jewish Social Studies. 50 (3/4): 147–176. ISSN 0021-6704.

ఆకరాలు

[మార్చు]
  • జేమ్స్ చిరియంకండత్ (2008). "జాతీయవాదం, మతం, సంఘం: AB సేలం, గుర్తింపు రాజకీయాలు కొచ్చిన్ యూదు సమాజ అదృశ్యం", జర్నల్ ఆఫ్ గ్లోబల్ హిస్టరీ, 3, pp 21–42, doi:10.1017/S1740022808002428
  • ఎడ్నా ఫెర్నాండెజ్. కేరళ చివరి యూదులు . పోర్టోబెల్లో బుక్స్, 2008.
  • Katz, Nathan (2000). Who are the Jews of India?. Berkeley, CA: University of California Press.