Jump to content

అమలానందుడు

వికీపీడియా నుండి

అమలానందుడు సా.శ. 13 వ శతాబ్దానికి చెందిన దక్షిణ భారతదేశపు సంస్కృత పండితుడు. దేవగిరిని పాలించిన యాదవరాజు మహాదేవుని (1260-1271) కాలానికి చెందినవాడు. శంకరాచార్యుని అనంతరం వేదాంతాన్ని తమ రచనలతో పరిపుష్టం చేసిన వారిలో ప్రముఖుడు. ఇతను రాసిన గ్రంథాలలో 'వేదాంత కల్పతరు' ముఖ్యమైనది.

తాత్విక చింతన

[మార్చు]

శేతశ్వతారోపనిషత్‌లో పేర్కొన యాదృచ్ఛికవాదాన్ని శంకరుడు వివరించాడు. అమలానందుడు ఈ సిద్ధాంతాన్ని వివరిస్తూ యాదృచ్ఛిక ఘటనలు (accidental effects) అనేవి అనుకోకుండా, కారణరహితంగా, కాకతాళీయంగా సంభవించవని, అవి కొన్ని నియమిత కారణాలకు లోబడే ఏ క్షణంలోనైనా సంభవిస్తాయని తెలిపాడు. ఈ ఉపనిషత్‌లోనే స్వభావం (nature) ను జగత్తుకు (world) కారణంగా చెప్పబడింది. శంకరుడు దీనిని విభిన్న పదార్ధాలలో స్వాభావిక శక్తులుగా వివరించాడు. అమలానందుడు దీనిని విపులీకరిస్తూ పదార్ధం ఉన్నంతవరకూ స్వభావం కూడా ఉంటుందని తెలిపాడు. అతని ప్రకారం పదార్ధం తన ఉనికిని కోల్పోతే స్వభావం కూడా అంతరిస్తుంది. ఇవి రెండూ ఒకదానిపై ఒకటి అనివార్యంగా ఆధారపడిన అంశాలు. ఉదాహరణకు శ్వాస అనేది జీవించి వున్న శరీరం యొక్క స్వభావం. ఈ స్వభావం (శ్వాస) అనేది పదార్ధం వున్నంతకాలం (శరీరం జీవించినంతకాలం) ఉనికిలో వుంటుంది. శరీరం మరణించినపుడు అంటే పదార్ధం ఉనికిలో లేనపుడు, శ్వాస (స్వభావం) కూడా వుండదు.[1]

రచనలు

[మార్చు]

ఇతని రచనలలో భాష స్వచ్ఛంగా, భావం ఆలోచనలు రేకెత్తించేవిధంగా పదునుగా వుంటుంది.[2]

  • వేదాంత కల్పతరు: శంకరాచార్యుని బ్రహ్మసూత్రభాష్యంపై వ్యాఖ్యానిస్తూ వాచస్పతి మిశ్ర (సా.శ. 9 వ శతాబ్దం) 'భామతి' రాసాడు. ఈ భామతి గ్రంథంపై వ్యాఖ్యానంగా అమలానందుడు 'వేదాంత కల్పతరు' అనే టీకా గ్రంథాన్ని రాసాడు. సా.శ. 16 వ శతాబ్దంలో ప్రసిద్ధ దార్శనికుడు అప్పయ్య దీక్షితులు అమలానందుని 'వేదాంత కల్పతరు' గ్రంథంపై వ్యాఖ్యానంగా 'కల్పతరు పరిమళ' అనే టీకా గ్రంథాన్ని రాయడం జరిగింది.[3][4]
  • శాస్త్ర దర్పణ: బ్రహ్మసూత్రాలకు వివరణాత్మకమైనది.
  • పంచపాదికా దర్పణ: ఇది శంకరుని ప్రముఖ శిష్యుడు అయిన పద్మపాదుని 'పంచపాదిక' పై రాయబడిన వ్యాఖ్య.

మూలాలు

[మార్చు]
  1. Jadunath Sinha. Outlines of Indian Philosophy. Pilgrim Books. pp. 61, 62.
  2. Ganga Ram Garg. Encyclopaedia of the Hindu World. Concept Publishing Company. p. 357.
  3. Surendranath Dasgupta. History of Indian Philosophy. Motilal Banarsidass. p. 418.
  4. Amresh Datta. Encyclopaedia of Undian Literature Vol.1. Sahitya Akademi. pp. 217–218.