Jump to content

అల్పజీవి

వికీపీడియా నుండి

అల్పజీవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి రచన. దీని తొలి ముద్రణ: 1955 లో జరిగింది. రావిశాస్త్రికి విశేషమైన పేరు తెచ్చిన ఆయన తొలి నవల. జేమ్స్ జాయిస్, శ్రీశ్రీ ‘కోనేటి రావు’ పాత్రల ప్రభావంతో తాను ఈ నవల రాశానని రావిశాస్త్రి చెప్పుకున్నాడు. రచనలో విశేషమైన వేగం ఆ రోజుల్లో కొత్త కావడం వల్ల కూడా దీనికి ఆదరణ లభించింది. కథ కంటే కథనమే ముఖ్యం.

పాత్రలు

[మార్చు]

ఈ నవలలో ప్రధాన కథానాయకుడు సుబ్బయ్య భయస్థుడు, పిరికివాడు. తన జీవితంలో ఎదురయ్యే అనేక ఒడిదుడూకులను తన వ్యక్తిత్వమే కారణమని తెల్సుకొని తన వ్యక్తిత్వాన్ని పెంపుదించుకుంటు ఎలా వెళ్ళాతాడో రావిశాస్త్రి చిత్రీకరించాడు.[1]

సుబ్బయ్య కొంచెం పిరికివాడు. గుమస్తా కావడం వల్ల పిరికివాడయ్యాడా పిరికివాడు కావడం వల్లే గుమస్తా అయ్యాడా చెప్పలేం కాని మొత్తం మీద పిరికివాడు. భయపడతాడు. పెళ్లాన్ని అసేయ్ ఒసేయ్ అనడానికి భయపడతాడు. ఆఫీసులో తనని ఏడిపించిన హెడ్ క్లర్క్‌ని- ఏరా ఒళ్లు కొవ్వెక్కిందా అని ఎదిరించడానికి భయపడతాడు. కుదర్దు... ఇంతే ఇస్తా అని కూరగాయలవాడితో దెబ్బలాడ్డానికి భయపడతాడు. పిల్లల మీద చేయెత్తడానికి భయపడతాడు. లోకం మీద నోరెత్తడానికీ భయపడతాడు. అధికారం అంటే భయం. పోలీసులంటే భయం. కోర్టులంటే భయం. హాస్పిటల్స్ అన్నా భయమే. చక్కగా ఒక గుల్ల కావాలి సుబ్బయ్యకి. పొద్దున తొమ్మిదింటికి ఆఫీసుకు వెళ్లడం.

గొడ్డులా చాకిరీ చేయడం. సాయంత్రం ఇంటికి తిరిగి రావడం. నిద్ర పోవడం. మళ్లీ తిరిగి ఆఫీసుకు వెళ్లడం. నెల తిరిగే సరికల్లా వచ్చిన నాలుగు డబ్బుల్తో వెచ్చాలు తెచ్చుకోవడం. గుట్టుగా సంసారం నెట్టుకురావడం. చిన్న చిన్న అవస్థలు వస్తే ఇబ్బంది పడటం. పెద్ద పెద్ద అవస్థలే దాపురిస్తే గుటుక్కుమనడం. ఒక సేఫ్ రొటీన్ జీవితం. ఇది కావాలి సుబ్బయ్యకి. దీనికి భిన్నంగా ఏది జరిగినా భయపడతాడు. హడలెత్తి పోతాడు. ఆఫీసులో బిల్స్ క్లియర్ చేసే పని అతనిది.

బావమరిది ఇది గమనించాడు. ఎవరి బిల్సు క్లియర్ చేయాలో వాడి దగ్గర ఐదు వందలు అడిగి తనకు ఇమ్మన్నాడు. ఇలా చేయొచ్చా? కూడదు. కాని సుబ్బయ్యకు వేరే దారి లేదు. అడుగుతున్నది బావమరిది. అడగమన్నది కట్టుకున్న భార్య. చెప్పిన పని చేయకపోతే చేతగాని వాడంటారు. సుబ్బయ్య ఐదువందలు కాంట్రాక్టర్‌ని అడిగేశాడు. చేబదులు అన్నట్టుగా అడిగాడు. కాని అది లంచం. అతడు చేబదులే అన్నట్టుగా ఇచ్చాడు. కాని అది దక్షిణ. ఇచ్చిన ఐదు వందలు బావమరిదికి అందింది. కాని, ఆ వెంటనే సెక్షన్ కూడా మారిపోయింది. మరి? తను కాకుండా వేరెవరైనా తింటుంటే హెడ్ క్లర్క్ ఊరుకుంటాడా? మార్చాడు. దక్షిణ అని ముట్టజెప్పినవాడు ఇప్పుడు కాబూలీవాలా అయ్యాడు. తన బిల్స్ క్లియర్ చేయకుండా అప్పనంగా ఐదు వందలు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? కాని ఐదు వందలు! జీతం వందో నూటేభయ్యో ఉన్నప్పుడు ఇంటి అద్దె ఐదూ పదీ రూపాయలు ఉన్నప్పుడు పావలాకి బేడకి కావలసిన వస్తువులు దొరుకుతున్నప్పుడు ఐదువందలంటే ఎంత పెద్ద మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? సుబ్బయ్య భయపడిపోయాడు. ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్మార్గుడు. పుచ్చుకున్న బావమరిది అవకాశవాది. తానేమో పిరికివాడు. ఎలా... ఎలా... ఎలా. సుబ్బయ్య వెర్రెత్తిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఎక్కడికని పారిపోగలడు?

ఒక ఐదు వందల మొత్తం! అతడి జీవితంలోని ప్రశాంతతను అంతా సర్వనాశనం చేసేసింది. కాదు... అతడిలోని పిరికితనమే అతణ్ణి సర్వనాశనం చేసేసింది. ధైర్యంగా ఎప్పుడైనా ఉన్నాడా తను. ధైర్యంగా దేన్నయినా ఎదిరించాడా తను. ధైర్యంగా ఇది తప్పు అని వాదించాడా తను. ధైర్యం చేసి దీనిని సరి చేయాలి అని రంగంలో దిగాడా తను? లేదే. ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. గుమస్తా కాకపోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి....

సుబ్బయ్య కూడా అలాంటి గుమాస్తానే. ఒరే కాంట్రాక్టర్ వెధవా... నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వనురా అని చెప్పడం చేతగాని గుమాస్తా. చచ్చు మనిషి. చచ్చిన మనిషి. అయితే అప్పుడప్పుడు కొంత వెలుతురు వస్తుంది. కొంత మార్చ ప్రయత్నిస్తుంది. సుబ్బయ్య జీవితంలో కూడా అలాంటి వెలుతురు వచ్చింది. ఒక స్నేహితురాలు పరిచయమైంది. ఆమె అతణ్ణి ఆదరించింది. ఊరడించింది. పవిటతో నుదుటి చెమట తుడిచి కొంచెం ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పింది. కాని ధైర్యంగా ఉండటానికి సుబ్బయ్యకు ధైర్యం కావాల్సి వచ్చింది. అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అతడే కాదు దేశంలోని గుమస్తాలందరూ ఆ ధైర్యాన్ని ఇంకా అందుకోవలసి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. అక్కిరాజు, రమాపతి రావు (1975). తెలుగు నవల. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. pp. 27–28. Retrieved 1 June 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=అల్పజీవి&oldid=3848262" నుండి వెలికితీశారు