Jump to content

అల్లాడి మహదేవయ్య

వికీపీడియా నుండి

"డాక్టర్ అల్లాడి మహాదేవయ్య గారు 1897లో జన్మించాడు. మహాదేవయ్య తండ్రి నారాయణయ్య రెవెన్యూ శాఖలో ఉద్యోగి, తరచు బదలీలు అయ్యేవి. మహాదేవయ్య తల్లి చెంచులక్షమ్మ ఆయన చిన్న తనంలోనే పోయింది. మహాదేవయ్య బంధువుల ఇళ్ళలో ఉండి హైస్కూలు చదువు సాగించి, బాల్యంనుంచీ స్వతంత్రంగా బ్రదకడం అలవాటుచేసుకొని, మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో, వైద్యకళాశాలలో చదివి 1920 తొలి సంవత్సరాలలో ఎంబిబియస్. డిగ్రీ పొందాడు.

డాక్టర్ మహాదేవయ్య బక్కపలచగా, పొడవుగా ఉండేవాడు. గంభీరమైన రూపం, ఆయన అంతర్ముఖుడు. మద్రాసు వైఎంసిఎ హాస్టలు రోజులనుచి మహాదేవయ్య ఆత్మీయ మిత్రుడు, మైసూరు ముఖ్యమంత్రిగా చేసిన కె.సి.రెడ్డి జీవితాంతం తన ఆత్మీయ మిత్రుడు. నెల్లూరులో అయా రంగాలలో ప్రసిద్ధులయిన అనేకమంది ఆయన పేషంట్లు మాత్రమే కాక, మిత్రులుకూడా. మహాదేవయ్య అన్న రామబ్రహ్మం మైసూరులో చదువుకొని నెల్లూరులో న్యాయవాదవృత్తిలో ప్రవేశించాడు. అన్న చిన్న వయసులోనే చనిపోయినా అన్నదమ్ముల కుటుంబాలు అవిభక్తంగా జీవించాయి. మహాదేవయ్యకు సోదరీమణులంటే చాలా ప్రేమ. మహాదేవయ్యకు పిల్లనిచ్చిన మామ మామిడిపూడి వెంకటరంగయ్య. వెంకటరంగయ్య పెద్ద తమ్ముడు రామకృష్ణయ్య నెల్లూరులో న్యాయవాది. చిన్న తమ్ముళ్ళు అల్లాడి వాసుదేవన్, సదాశివన్ నెల్లూరు లోనే ఉండేవారు. ఈ కుటుంబాలన్నీ పరస్పరం సహకరించుకొంటూ ఆత్మీయంగా జీవించాయి.

డాక్టర్ అల్లాడి మహాదేవయ్య మొదట్లో నెల్లూరు పెద్ద పోస్టాఫీసు ఎదురుగా, ఆచారివీధిలో వైద్యవృత్తి ప్రారంభించి, తర్వాత సుబేదారుపేటలోని సొంత ఇంట్లో నలభై ఏళ్ళు క్లినిక్ నిర్వహించాడు.  పేదలని, ధనవంతులనీ తేడా చూపేవాడు కాదు. చాలా తక్కువ ఫీజు తీసుకొనేవాడు. అవసరం లేకుండా మందులు రాయడని పేరు తెచ్చుకొన్నాడు. రోగులు సంతోషంగా వైద్యం చేయించుకొనేవారు. ఆయన మద్రాసులో సుప్రసిద్ధ డాక్టర్ ఏ.యల్.మొదలియార్ వద్ద స్త్రీలవైద్యులుగా(obstetrics) శిక్షణపొంది, నెల్లూరు సెయింట్ జోసెఫ్ జూబిలీ స్రీల, శిశువైద్యశాలలో (సూపర్నెంట్) వైద్యుడుగా 40 ఏళ్ళ పైగా పనిచేశాడు. నెల్లూరు బిషప్.కు, విదేశీ మిషనరీలకు, కేథలిక్ కన్యాగురుకుల వాసానికి( seminary)ఆయన వైద్యుడు. ఆక్రమంలో వారిద్వారా ఇంగ్లాండులో ప్రచురించబడిన వైద్య గ్రంథాలు ఆయనకు అందుతూండేవి. ఇంగ్లాండు నుంచి ప్రచురించబడే The Practitioner వైద్య జర్నల్.కు ఆయన యావజ్జీవితం చందాదారుడు. 
మహదేవయ్య మితభాషి, చాలా హుందాగా,రోగులతో చక్కగా మాట్లాడుతూ నమ్మకం  కలిగించేవాడని పేషంట్లు గుర్తుచేసుకొంటారు. ఆయన హాస్యస్ఫూర్తి, ఉదారదృక్పథం, స్త్రీవిద్యపట్ల అభిమానం, వల్లనే భార్య అన్నపూర్ణమ్మ 'హరిజన' బాలికల హాస్టలు నిర్వహించడం వంటి సమాజహిత కార్యక్రమాలకు పూనుకోగలిగింది. పెద్ద ఉమ్మడి కుటుంబం అయినా పిల్లలందరికీ ఉన్నతవిద్య చెప్పించాడు. అప్పు చెయ్యవద్దనీ, అప్పు ఇస్తే తిరిగి చెల్లించమని వత్తిడి చేయవద్దని, కోపంలో ఉన్న సమయంలో ఎవరికీ జాబు రాయవద్దదని ఆయన పిల్లకు సలహా ఇచ్చేవాడు.
అల్లాడి మహదేవయ్యకు క్రికెట్ చాలా ఇష్టం. ఆ క్రీడను గురించి ఆయనకు అద్భుతమైన విజ్ఞానం ఉండేది. నెల్లూరులో రేడియో పెట్టుకున్న మొదటి కుటుంబాలలో ఆయనదొకటి. బిబిసి వార్తలు, రాజకీయాలు, ప్రపంచ పరిణామాలు క్రమం తప్పకుండా వినేవాడు. సాయంత్రం కాగానే గదిలో ఆయన మిత్రులందరూ చేరేవారు. 

వృత్తిలో సమయపాలన, క్రమశిక్షణ, సునిశితంగా వ్యవహరించడం, మందులు రాయడంలో సంయమనం, నిత్య అధ్యయనశీలత ఆయనలోని సుగుణాలని ఎరిగిన వారు గుర్తుచేసుకుంటారు. ఎన్నో ఏళ్ళయిన తర్వాత కూడా ఆయనను ఎరిగిన పేషంట్లు కృతజ్ఞతతో, ప్రేమానురాగాలతో జ్ఞాపకం చేసుకొంటారు.

1968 మార్చి5న సెయింట్ జోసెఫ్ జూబ్లీ మహిళా శిశువైద్యశాలలో డ్యూటీ చేస్తూ ఆకస్మికంగా హార్ట్ అటాక్ వచ్చి ఆ సాయంత్రమే ఆయన వెళ్ళిపోయాడు. వృత్తిలో సమయపాలన, క్రమశిక్షణ, సున్నితంగా వ్యవహరించడం, మందులు రాయడంలో సంయమనం, నిత్య అధ్యయనం ఆయనలో సుగుణాలని ఎరిగినవారు గుర్తుచేసుకుంటారు. మహాదేవయ్య సంతానం అందరూ చదువుకొని ప్రయోజకులయ్యారు. కుమార్తె డాక్టర్ లక్ష్మి నెల్లూరు సెంయింట్ జోసెఫ్ జూబిలీ మహిళల, శిశువైద్యశాలలో వైద్యురాలయ్యారు. మహాదేవయ్య కుమారులు డాక్టర్ అల్లాడి వెంకటేష్ గొప్ప డాక్టర్ గా పేరుతెచ్చుకొన్నాడు. మరొక కుమారుడు రాజేంద్ర కేంద్ర ప్రభుత్వంలో చీఫ్ ఇంజినీరుగా చేశాడు. అల్లుడు ఒంగోలు ఆనందం గొప్ప ఆడిటరు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివు కౌన్సీలు సభ్యుడుగా చేశాడు.

మూలాలు: 1.జమీన్ రైతు వారపత్రిక, 08-3-1068, 5వపుట,

         2.విక్రమ సింహపూరి మండల సర్వస్వం, సంపాదకులు: ఎన్.ఎస్.కె, నెల్లూరు జిల్లాపరిషద్ ప్రచురణ, 1964.