ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2010-11
ప్రభుత్వము ప్రతి సంవత్సరం బడ్జెట్ తయారు చేస్తుంది. ఆర్థికశాఖను నిర్వహిస్తూ 2010-11 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను శాసనసభ ఆమోదానికి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కె.రోశయ్య, రాష్ట్ర అదనపు వనరుల సమీకరణకై తన దృష్టిని మద్యం వైపునకు మళ్ళించాడు. [1]వ్యాపార వర్గాలు చెల్లించే అమ్మకపు పన్ను ఆదాయంపై కొంత కనికరం చూపించాడు. అయితే, మొత్తమ్మీద పన్నులను చెల్లించే వర్గాలపై ఆయన పూర్తిగా జాలి చూపాడు. రాష్ట్రానికి లభించే ఆదాయ వనరుల్లో అత్యధిక భాగం పన్నుల రూపంలో లభిస్తుంది. మొత్తం రాబడిలో రాష్ట్ర పన్నుల వాటా 2007-08 ఆర్థిక సంవత్సరంలో 56.54 శాతం (రు.40,664 కోట్లు) కాగా, నూతన ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని 51.85 శాతానికి (రు.46,999) తగ్గించారు. గత ఆర్థిక సంవత్సర రాబడితో పోలిస్తే ఈ బడ్జెట్‌లో దీని శాతం తక్కువ. పన్నుల రూపంలో గత సంవత్సరం కన్నా ఈ బడ్జెట్‌లో రు.6,335 కోట్లను అదనంగా ఆయన ప్రతిపాదించారు. ఇందుకుగాను అమ్మకపు పన్ను రూపంలో గడచిన సంవత్సరం రు.5,834 కోట్లు ప్రతిపాదించగా, ఈ సంవత్సరం ప్రతిపాదించిన మొత్తం రు.4,153 కోట్లు మాత్రమే. అదే ఆబ్కారీ పన్ను విషయంలో గడచిన ఆర్థిక సంవత్సరంలో రు.6,260 కోట్లు ప్రతిపాదించి కొత్త సంవత్సరానికి రు.7,512 కోట్లకు పెంపుదల చేశారు. ఒక్క ఆబ్కారీ పన్నుల ద్వారానే రు.1,252 కోట్ల అదనపు భారం మద్యం ప్రియులపై మోపారు. ఈ మొత్తం గడచిన సంవత్సరం రు.508 కోట్లు మాత్రమే.
- నీటిపారుదలకు తగ్గిన నిధులు
2010-11 నూతన వార్షిక ప్రణాళిక మొత్తం రు.36,727.97 కోట్లలో సింహభాగం రు.15 వేల కోట్లు (40.84 శాతం) నీటిపారుదల రంగానికి ముఖ్యమంత్రి రోశయ్య ప్రతిపాదించినప్పటికీ ఈ మొత్తం డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిననాడు (2009-10) ప్రతిపాదించిన రు.17,800 కోట్లు (48.59శాతం) కన్నా తక్కువ. సామాజిక సర్వీసులకు ఈ బడ్జెట్‌లో రోశయ్య గతంకన్నా ప్రాధాన్యతను కల్పించారు. వ్యవసాయ ఆధారిత రంగాలకు కూడా ఆయన గత బడ్జెట్‌లకన్నా ఎక్కువ శాతం ఈ బడ్జెట్‌లో కేటాయించాడు. వైద్య, ఆరోగ్య రంగాలపై బడ్జెట్‌లో శీతకన్ను పడింది.
- ద్రవ్య లోటు
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 2003-04 నాటికి రాష్ట్రం స్వీకరించిన అప్పు రు.58,770.25 కోట్లు కాగా, 2010-11 నాటికి ఈ మొత్తం రెట్టింపై రు.1,22,830.20 కోట్లకు చేరింది. ఈ అప్పుకు వడ్డీ తదితరాల చెల్లింపుగా నూతన బడ్జెట్‌లో రు.10,738.27 కోట్లను ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. మొత్తం రాష్ట్ర రాబడిలో ఈ చెల్లింపు 11.85 శాతం. అయితే, ఇది గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన 12.06 కన్నా తక్కువ. ఆర్థికమంత్రిగా, ముఖ్యమంత్రిగా వరుసగా బడ్జెట్‌లో రెవెన్యూ మిగులును చూపిస్తున్న రోశయ్య ద్రవ్యలోటును మాత్రం అంతగా పూడ్చలేకపోతున్నాడు. 2008-09లో 12,405 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు 2009-10కి రు.14,282 కోట్లకు పెరిగింది. నూతన బడ్జెట్‌లో ఈ లోటు రు.12,982 కోట్లుగా ఉండగలదని అంచనా.
వనరులు
[మార్చు]- ↑ "AP budget 2010-11". Archived from the original on 2012-02-21. Retrieved 2012-02-18.