Jump to content

ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్తు

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య పరిషత్తు నుండి దారిమార్పు చెందింది)
Andhra Sahitya Parishat, Kakinada
ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ

తొలి కోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు నిక్కించి, మెడసాచి, నిక్కమున్సూచి కొక్కొరో కుర్రని కూయక మున్న...తెలుగు సాహిత్యంలో తెలంగాణ పద గుంపనాన్ని పలికించిన తొలికవి పాల్కుర్కి సోమనాధుడిని ఉద్దేశించి రాసిన ఈ పద్యం తెలంగాణలో తెలుగు అక్షరాలు వెదజల్లిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అక్షరాల వర్తిస్తుంది. 1707లో ఔరంగజేబు మరణం తర్వాత 1724లో అజాంజాహి వంశస్థులు హైద్రాబాద్ రాజ్యానికి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. రెండు వందల ఏళ్ల పైబడి నైజాం రాజులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. ప్రపంచంలో ఎక్కడైనా పాలకుల భాషనే బలవంతంగా ప్రజలపై రుద్దారు. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఇక్కడి నైజాం ప్రభుత్వానికి ఉర్దూ అధికార భాష. కనుక ప్రభుత్వ వ్యవహారాలన్ని ఉర్దూలోనే జరిగేవి. తెలుగు భాష ప్రజల వ్యవహారంలో మాత్రమే ఉండేది. తెలుగులో చదువుకోవటానికి, రాయటానికి అవకాశాలు లేని రోజులవి.మొదట తెలంగాణలో భాష కోసమే యాతన మొదలైంది. మాట కోసమే పెనుగులాట ప్రారంభమైంది. ఒకవైపు నైజాం ప్రభుత్వం నిర్లక్ష్యం, మరోవైపు మహారాష్ర్టల అవహేళన కలిసి తెలంగాణ ప్రజల యాసకు, భాషకు ఉనికిలేకుండా చేశారు. ఈ సమయంలోనే హైద్రాబాద్ కేంద్రంగా శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషా నిలయం (1901) ఏర్పడింది. కొమపూరాజు వెంకట లక్ష్మణరావు పంతులు ఈ సంస్థకు జీవం పోసి తెలుగు భాషను ప్రచారం చేయడానికి పూనుకున్నాడు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను కూడా స్థాపించి తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడ్డారు. వీటితో పాటు రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం (1904, వరంగల్) ఏర్పడి ఈ మూడు సంస్థల ప్రభావంతో తెలంగాణ విద్యావంతులలో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం రాజకీయపరమైనది కాదని మాడపాటి లాంటి వారికి ఉండేది. కాని నిరంకుశ రాజుకు వ్యతిరేకంగా వచ్చే ఏ స్పందనైనా రాజకీయ పరమైనదేననేది చరిత్ర రుజువు చేసింది. నిజాం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉర్దూ భాషను బలవంతంగా ప్రజలనెత్తిన రుద్దాడు. ప్రజలు అక్షరాస్యులై చైతన్యం వేత్తన పదవికి భయమని నిజాం భావించాడు. ప్రజలను సాంఘికంగా, ఆర్థికంగా అణచి ఉంచడం, వెట్టిచాకిరి చేయించుకోవడం ఇవన్నీ సారాంశంలో రాజకీయ అంశాలే. కనుక ప్రజల నిరసన కూడా రాజకీయంగానే ఉంటుంది. ఇది ఆచరణలో రుజువైంది. భాష ఒక ఆధిపత్య సాధనం. అది రాజ్యం చేతిలో ఉంటుంది. ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్పందించడం కూడా రాజకీయమే.

1921 నవంబరు 12 అర్థరాత్రి. వివేకవర్థనీ హైస్కూల్‌లో హైద్రాబాద్ ‘హిందూ సంఘ సంస్కార సభ’ జరిగింది. దంఢోపంత్ కార్వే ఈ సభకు అధ్యక్షత వహించాడు. ఆంధ్ర, మహారాష్ర్ట, కర్ణాటక ప్రముఖులను సభకు ఆహ్వానించారు. ఎవరి భాషలో వాళ్లు మాట్లాడవచ్చని అన్నారు. అందరు వారి వారి మాతృభాషలో మాట్లాడారు. ఈ సభలో మాడపాటి హనుమంతరావు, ఆలంపల్లి వెంకట రామారా (సీనియర్ న్యాయవాది) పాల్గొన్నారు. వీళ్లిద్దరు తెలుగులో మాట్లాడినప్పుడు సభలో ఉన్న వాళ్లు విసుక్కున్నారు. నవ్వారు. వీపులు చూయించారు. చప్పట్లు కొట్టారు. ఈ రకంగా అవమానించారు. తెలంగాణ వాళ్లు దీనిని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి రంగారావు (సీనియర్ వకీల్) ఇంట్లో సమావేశమయ్యారు. తెలుగు భాష రక్షణ కోసం ఒక సంస్థను పెట్టి ఆత్మగౌరవం కాపాడుకోవాలని నిర్ణయించారు. ‘ఆంధ్ర జనసంఘం’ను ఏర్పాటు చేశారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం, తెలుగు భాషను రక్షించడమనే ఆశయాలతో ఈ సంస్థ తన కృషిని ప్రారంభించింది. భాష, సంస్కృతి రక్షణ కోసం ప్రారంభమైన ఈ సంస్థ, దీని సభ్యులు సంస్థ పరిధిని విస్తృతపర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. సురవరం ప్రతాపడ్డి అధ్యక్షతన ప్రథమాంధ్ర మహాసభలు మెదక్ జిల్లా జోగిపేటలో జరిగాయి. ప్రభుత్వం మొదట్లో అనుమతిని నిరాకరించింది. తర్వాత చాలా షరతులతో అనుమతించింది. ఈ సభలలో చాలా మంది యువకులు సైకిళ్ల మీద గ్రామాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ వచ్చి పాల్గొన్నారు. ఈ సభ చరివూతలో మైలురాయిగా నిలిచిపోయింది. ఆంధ్ర మహాసభ వెట్టిచాకిరి, జమిందారుల దోపిడీ, జాగీర్‌దారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టింది. రాజకీయంగా జరిగిన పరిణామాలలో భాగంగా రాజకీయ డిమాండ్‌ను ఎజెండా మీదికి తెచ్చింది. ఈ క్రమంలోనే 1943 మే 23, 24వ తేదీలలో పదవ ఆంధ్ర మహాసభ హైద్రాబాద్‌లో జరిగింది. అప్పటికే 1942లోనే ఓరుగల్లులో ఆంధ్ర మహాసభ తొమ్మిదవ సభలు జరిగి అందులో కొందరు యువకులు సాహిత్యాభిమానులను సమావేశపర్చి సాహిత్య సంస్థ ఏర్పాటుపై చర్చించారు. కనుక 1943లో జరిగిన సభలలో దీనిపట్ల ఒక స్పష్టత వచ్చి మే 26న రెడ్డి హాస్టల్‌లో సమావేశమయ్యారు. అన్ని విషయాలు చర్చించి సాహిత్య సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘హైవూదాబాద్ ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ను ‘నిజాం రాష్ర్ట ఆంధ్ర సారస్వత పరిషత్తు’గా పేరుమార్చారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపడ్డి, బూర్గుల రామకృష్ణారావు, గడియారం రామకృష్ణ శర్మ మరికొందరు సభ్యులుగా ఒక ఉపసంఘం ఏర్పడి దీనికి స్థిరరూపం కల్పించారు. లోకనంది శంకర నారాయణరావు మొదటి అధ్యక్షులుగా కార్యవర్గం ఏర్పడింది. గోల్కొండ పత్రికా కార్యాలయమే దీనికి కార్యాలయంగా ఉండేది.

మాతృభాషాభిమానం పెంచుట, పాఠ్యవూపణాళిక తయారుచేసి పరీక్షలు జరుపుట, ఉత్తమ గ్రంథాలకు పారితోషకం ఇవ్వటం మొదలైన కార్యవూకమాలను ఈ సంస్థ చేపట్టింది. ఇతరవృత్తులలో జీవిస్తున్న వయోజనులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు సులభంగా రాసేటట్లు పరీక్షలు నిర్వహించారు.ఉర్దూభాష అమలులో మాతృభాషను దేశీయులకు అందించటంలో ఈ సంస్థ విశేష కృషి చేసింది. ఇందుకోసం మొదటిసారిగా 1945 అక్టోబరు4,5,6తేదీలలో ప్రాథమిక, ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. గ్రామాలలో రాత్రి పాఠశాలలు, పరిషత్తు పరీక్ష కేంద్రాలు ఉండేవి. కనుక పరిషత్తు కార్యకర్తలను పోలీసులు అనుమానంతో చూస్తూ అనేక ఇబ్బందులకు గురిచేసేవారు. 1944 డిసెంబర్ 29-30 తేదీలలో ఓరుగల్లు కోటలో కవి సమ్మేళనం జరుగుతుంటే కొందరు దుండగులు దాడిచేశారు. స్థానిక పరిషత్తు కార్యకర్తలు దుండగులను ఎదుర్కొని నిర్విఘ్నంగా సమ్మేళనం నిర్వహించారు. ఇట్లా పరిషత్తు కృషి వల్ల ప్రజలలో చైతన్యం వచ్చింది. దీనిని జీర్ణించుకోలేని ప్రభుత్వం పరిషత్తు కార్యకర్తలపై దాడులు చేసింది. ఫలితంగా కార్యవూకమాలు ఆగిపోయి కొంత స్తబ్ధత ఏర్పడింది. ఈ సంస్థ కార్యవూకమాలకు ప్రచారాన్ని కల్పించిన గోల్కొండ, తెలంగాణ, మీజాన్ పత్రికలపై కూడా అనేక ఆంక్షలు విధించారు. ఇదేకాలంలో కొనసాగిన రైైతాంగ సాయుధ పోరాటం కూడా పరిషత్తుపై రాజ్యం కన్నెర్ర చేయడం కారణం కావచ్చు. సాయుధ పోరాటం ఫలితంగా పోలీసు చర్య అనంతరం నైజాం హైద్రాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న భారత్ యూనియన్‌లో కలిపేసాడు. దాదాపు 16 నెలల అజ్ఞాత వాసం తర్వాత పరిషత్తు 1949లో ‘నిజాం రాష్ర్టం’ అనుపదం తొలగించి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 ఆగస్టులో ఈ సంస్థ పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు.

మొదటి నుంచి ఈ సంస్థ ఒక విశ్వవిద్యాలయం స్థాయిలో సాహిత్య కృషిని చేస్తుంది. నిర్థిష్టంగా 1965 నుంచి ఈ సంస్థ ఒక ప్రాచ్య కళాశాలను, (స్నాతకోత్తర స్థాయిలో) ఒక తెలుగు పండిత కళాశాలను (1964) నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరగడానికి, ప్రాచ్య విద్యకు గుర్తింపు కోసం సంస్థ ఎంతో కృషి చేసింది. పోలీసు చర్య తర్వాత నెహ్రూ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరిషత్తు ప్రతిఘటించి కాపాడింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు (తెలంగాణ సారస్వత పరిషత్తు)కు జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణడ్డి అధ్యక్షుడిగా పనిచేశాడు. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు చేసిన విశేష కృషి వల్ల పరిషత్తుకు స్థిరత్వం వచ్చింది. దానిని కొనసాగించి సొంత భూమి, భవనాలను కల్పించడంలో నారాయణడ్డి కృషి చేశాడు. నిరంతరం సాహిత్య, సాంస్కృతిక సభలు నిర్వహించడంలో సంస్థ ముందంజలో ఉంది. వివిధ కవుల సంస్మరణ ప్రసంగాలు నిర్వహించడంతోపాటు, ‘పరిణతవాణి’ అనే విశేష కార్యవూకమాన్ని పరిషత్తు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 65 మంది కవి పండితుల ‘స్వగతం’ పరిషత్తు వేదికపై ఆవిష్కృతమయింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని మొదటి సమావేశం నిర్వహించిన ఘనత పరిషత్తుకే దక్కింది.

20 వేల పుస్తకాలతో ప్రాచ్యకళాశాల లైబ్రరీ, లక్ష పుస్తకాలు, భారతి, గోల్కొండ, కృష్ణ పత్రిక, ఆంధ్ర పత్రిక (పాత ప్రతులు) తో నిండి ఉన్న పరిషత్తు గ్రంథాలయం ఉంది. మంచి పఠణాలయం ఉంది. పరిషత్తు అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది ఎస్.పి హాల్. ఈ హాల్ 70వ దశకంలో తెలుగునేల మీద జరిగిన అనేక సాహిత్య, రాజకీయ మార్పులకు సాక్ష్యంగా ఉంది. దిగంబర, విప్లవ, స్త్రీవాద ఉద్యమాల సభలతోపాటు మహాభారత ఉపన్యాసాలు ఈ వేదిక మీది నుంచే వేలాదిమంది శ్రోతలు విన్నారు. సాహిత్యంలో దిగ్గజాల వంటి వారందరు ఈ సంస్థ వేదిక నుంచే తమ గొంతులు వినిపించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ), రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) అనే రెండు విద్యార్థి సంఘాలు ఈ మట్టిసాక్షిగా ఏర్పడ్డాయి. ప్రతి చారివూతక మార్పుకు ఎస్.పి హాల్ మూగసాక్షి. ఆబిడ్స్‌లోని జీపీఓకు అతి దగ్గరలో ఉన్న బొగ్గులకుంట చౌరస్తాలో విశాలమైన పార్కింగ్ వసతి కలిగి నాలుగు గంటలకు వేయి రూపాయలకే 300 మందితో సమావేశాలు నిర్వహించుకునే ఎయిర్ కండిషన్డ్ హాల్ ఉంది.