Jump to content

ఆకురాలు కాలం

వికీపీడియా నుండి
మోడువారిన చెట్టు కొమ్మలు

శరదృతువు, ఉత్తర అమెరికా ఆంగ్లంలో ఫాల్ అని కూడా పిలుస్తారు.[1] భూమిపై ఉన్న నాలుగు సమశీతోష్ణ ఋతువులలో ఒకటి. ఉష్ణమండల ప్రాంతాలకు వెలుపల, శరదృతువు వేసవి నుండి శీతాకాలానికి మారడాన్ని సూచిస్తుంది, ఇది సెప్టెంబరు (ఉత్తరార్ధగోళం) లేదా మార్చి (దక్షిణార్ధగోళం)లో ప్రారంభమవుతుంది. శరదృతువులో పగటి సమయం తగ్గి, ఉష్ణోగ్రత గణనీయంగా చల్లబడుతుంది. ఈ ఋతువు గడిచేకొద్దీ పగటి సమయం తగ్గి, రాత్రి సమయం పెరుగుతుంది, ఇది డిసెంబరు (ఉత్తరార్ధగోళం), జూన్ (దక్షిణార్ధగోళం)లో వచ్చే శీతాకాలపు అయనాంతం వరకు కొనసాగుతుంది. సమశీతోష్ణ వాతావరణాలలో చెట్ల ఆకులు రాలడానికి సిద్ధమవుతున్నప్పుడు వాటి ఆకుల రంగులో వచ్చే అద్భుతమైన మార్పు దీని ప్రధాన లక్షణాలలో ఒకటి.

కారణం

[మార్చు]

ఉష్ణమండలంలో ఉన్న ఆంధ్రదేశంలో చెట్లు ఆకులు రాల్చడం అంతగా కనిపించదుకాని, సమశీతల దేశాలలోను, శీతల మండలాలలోను చలికాలం వచ్చే సరికి కొన్ని చెట్లు ఆకులన్నిటిని పూర్తిగా రాల్చేసి మోడులలా బోడిగా కనిపిస్తాయి. మన దేశంలో కులూ లోయ లోను, కాశ్మీరు లోను ఈ విశేషం చూడవచ్చు. శీతల దేశాలలో కూడా అన్ని చెట్లూ ఆకులని రాల్చవు. పైను, ఫర్‌ మొదలైన చెట్ల ఆకులు సన్నగా సూదులలా ఉంటాయి; ఇవి ఆకులని రాల్చవు. ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. కాని వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లన్నీ చలికాలంలో ఆకులని రాల్చుతాయి. ఈ ప్రవర్తనకి చాల కారణాలు చూపించవచ్చు.

మొదటి కారణం. ఆకులు వెడల్పుగా ఉన్న చెట్టు వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వైశాల్యం ఉన్న చెట్టు ఎక్కువ వేడిని నష్టపోతుంది. ఈ విషయాన్నే మరొక విధంగా చెప్పాలంటే, ఎక్కువ వైశాల్యంగా ఉన్న చెట్టుకి ఎక్కువ చలి వేస్తుంది. మనకి చలి వేసినప్పుడు మన వైశాల్యం తగ్గించడానికి ముడుచుకుని కూర్చుంటాం. అలాగే చలి కాలంలో చెట్లు తమ వైశాల్యాన్ని తగ్గించడానికి ఆకులని రాల్చివేస్తాయి.

రెండవ కారణం. ఆకులు ఆహారపదార్ధాలని తయారుచేసే కర్మాగారాల్లాంటివి. వేసవి కాలంలో ఎండ మెండుగా ఉన్న రోజులలో ఆ సూర్యరస్మిని పీల్చుకోడానికి ఎక్కువ వైశాల్యం ఉన్న ఆకులు కావాలి. శీతాకాలం వచ్చేసరికి ఎండ తగ్గిపోతుంది కనుక ఆకులకి సరిపడా సూర్యరస్మి తగలదు. కనుక అవి పూర్వంలా పని చెయ్యలేవు. పని చెయ్యని ఆకులతో నాకేం పని అని చెట్టు ఆ ఆకులని రాల్చేస్తుంది.

ఆకురాలుకాలం (తెలుగు కవితా సంపుటి)

[మార్చు]

ఈ ఆకురాలుకాలం ఋతువు పేరు మీద మహెజబీన్‌ 1977లో పత్రికల్లో ప్రచురించబడిన విడి కవితలు ‘ఆకురాలు కాలం’ గ్రంథరూపంలో వెలువరించారు. పుస్తకంగా రాక ముందు నుంచే పత్రికల్లో విడి కవితలు వస్తున్న కాలం నుంచే అవి విశేష పాఠకాదరణ పొంది గ్రంథరూపంలో వెలువడిన తరువాత విరివిగా అమ్ముడుపోయిన కవితా సంపుటి. మహెజబీన్‌ తన కవిత్వంలో తెలుగు నేల మీద జరిగిన ఉద్యమాల వాడి, వేడి, స్త్రీ హృదయంలో చెలరేగిన అలల పరంపర, సామాజిక సమస్యల మీద ఆమె అక్షరాలు చేసే సవ్వడి, ప్రేమ సముద్రపు లోతుపాతులు అన్నీ కలగలిపి పొందుపరిచింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Fall Definition & Meaning". dictionary.com. ఒరిజినల్ నుండి 6 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది.
  2. శ్రీధర్‌, వెల్దండి (2024-05-27). "మళ్ళీ 'ఆకురాలుకాలం'". ABN ఆంధ్రజ్యోతి. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-04-05.