ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీటిని వేడిచేసి, నీటిఆవిరిగా మార్చి, నీటి ఆవిరితో మొక్కల నుండి ఆవశ్యక నూనెలను ఆవిరిగా మార్చి సంగ్రహించెదరు.

నీటి అవిరి ద్వారా స్వేదన క్రియ[మార్చు]

ఆవశ్యక నూనెలు తక్కువ ఉష్ణోగ్రత వద్దనే బాష్పీకరణ చెందు స్వభావం వున్నందున, నీటి ఆవిరి గుప్తొష్ణం (steam vapor latent heat) ద్వారా మొక్కలలోని ఆవశ్యక నూనెలను బాష్పిఅకరించి, బాష్పీకరణ వాయురూపంలో వున్న ఆవశ్యకనూనెలను కండెన్సరులో ద్రవీకరించి సేకరించెదరు.[1]

నీటి ఆవిరి ద్వారా స్వేదన క్రియ-పరికరాలు
Distilation Santal, Alambic.jpg

స్వేదన క్రియ కై వినియోగించు పరికర సముదాయం[మార్చు]

1. స్వేదన పాత్ర (distiller)

2. పొయ్యి (furnace)

3. కండెన్సరు (condenser)

4. నీరు/ఆవశ్యకనూనె సపరెటరు (water/essential oil auto separator)

5,6. ఆవశ్యక నూనె, హైడ్రొసొల్ సేకరణ/సంగ్రహణ పాత్రలు ( products collecting vessels)

స్వేదనపాత్ర[మార్చు]

మందమైన చదునుపాటి అడుగుభాగం కలిగి వుండి స్తుపాకారంగా వుండును. పైభాగం అర్ధ దీర్ఘ అండాకారంగా లేదా శంఖాకారంగా వుండి ఒక ఆవిరి గొట్టానికి (Vapor duct) ఒక చివర కలుపబడి వుండును. ఈ ఆవిరి గొట్టం రెండో చివర ఒక కండెన్సరుకు కలుపబడివుండును. స్వేదన పాత్ర క్రిందిభాగంలో కొంత ఎత్తులో రంధ్రాలున్న లోహ పలకం (perforated metal plate) వుండును.ఈ రంధ్రాలున్న లోహఫలకం మీద ఆవశ్యక నూనె తీయవలసిన మొక్క భాగాలను వుంచెదరు. స్వేదన పాత్ర అడుగు భాగంలో నీరును తీసికొనెదరు. స్వేదన పాత్రను స్టెయిన్లెస్ స్టీల్ 316 మిశ్రమలోహంతో తయారు చేయుదురు. స్వేదన పాత్రలోని నీటిని వేడి చేసినప్పుడు, నీరు ఆవిరిగా మారి నీటి మట్టం తగ్గినప్పుడు తగినంత నీరు చేర్చుటకు నీటి గొట్టం కలుపబడి వుండును. స్వేదన పాత్రలో మొక్కలను నింపుటకు ఒక మూత వుండును. మొక్కల భాగాలను తగు ఎత్తు వరకు నింపిన తరువాత, ఈ మూతను బోల్టుల ద్వారా గట్టిగా బిగించెదరు.

పొయ్యి(Furnace)[మార్చు]

పొయ్యిలో ఇంధనాన్ని దహించడం వలన ఉత్పత్తి అగు ఉష్ణ శక్తితో స్వేదన పాత్రలోని నీటిని వేడిచేసి/మరగించి నీటి ఆవిరిని ఉత్పత్తి చేయుదురు. కార్బను, హైడ్రొజను వంటి మూలకాలు ఆక్సిజనుతో సంయోగం చెందినప్పుడు వాటి సంయోగ పదార్థాలు, ఉష్ణశక్తి వెలువడును.

C+2O=CO2+e

2H+O=H2O+e

e అనగా శక్తి. ఇక్కడ శక్తి ఉష్ణ రూపంలో వెలువడును.

పొయ్యిలో ఇంధనంగా కలప (wood), బొగ్గు, కర్రబొగ్గు (charcoal), ఫర్నెష్ ఆయిల్, గ్యాస్ లేదా వ్యవసాయ ఉత్పత్తి వ్యర్ధ్యాలైన (Agro waste) వరిపొట్టు, వేరుశనగ పొట్టు లాంటి వాటిని వినియోగించెదరు. పొయ్యిని రిఫ్రాక్టరి ఇటుకలతో నిర్మించెదరు. రిఫ్రాక్టరి ఇటుకలలో అల్యుమిన అధికశాతంలో వుండటం వలన దహన చర్యా సమయంలో ఏర్పడు ఆధిక ఉష్ణాన్ని తట్టుకో గల్గును. ఏర్పడిన వేడి వాయువులు (కార్బను డయాక్సైడ్+నీరు+నైట్రిజను తదితరాలు) స్వేదన పాత్రలోని నీటిని మరగించిన తరువాత వాతావరణంలోనికి వెళ్ళుటకు ఒక పొగ గొట్టం (Chimney) పొయ్యికి అమర్చబడి వుండును.

కండెన్సరు[మార్చు]

కండెన్సరులో స్వేదన పాత్ర నుండి వచ్చు నీటి, ఆవశ్యక నూనెల ఆవిరులను ద్రవరూపంలోకి మార్చు ప్రక్రియ జరుగును. కండెన్సరులు 2, 3 రకాలలో లభించును. ఒక రకం కండెన్సరు యొక్క వెలుపలి లోహ తొడుగు (outer shell) స్తుపాకారంగా వుండి, దాని లోపల స్టెయిన్లెస్ స్టిల్ లోహ గొట్టాలు వరుసగా అమర్చబడి వుండును. స్టిల్ గొట్టాలలో ఒక వైపునుండి నీరు లోపలికి వెళ్లి, రెండో వైపునుండి బయటకు ప్రవహించును. వేడి ఆవిరులు షెల్ లోపలి వైపున వున్న స్టీల్ గొట్టాల ఉపరితాలాన్ని తాకినప్పుడు, గొట్టాలలో ప్రవహిస్తున్న చల్లని నీటి వలన ఆవిరి వాయువులు చల్లబడి ద్రవరూపంలోకి మారును.కొన్ని కండెన్సరులలో లోపలి స్టిల్ గొట్టాలు వర్తులాకారంగా వరుసగా (spiral coils) లోహ తొడుగు (shell) లో చుట్టబడి వుండును. ఈ రకం కండెన్సరులో గొట్టాలద్వారా ఆవిరులు ప్రవహించగా, తొడుగు (షెల్) లో ఆవిరులను చల్లబరచు నీరు ప్రవహించును.

ఆవశ్యకనూనె/నీరు ఆటొ సపరెటరు[మార్చు]

కండెన్సరులో ద్రవరూపంలోకి మారిన నీరు+ఆవశ్యక నూనెల మిశ్రమాన్ని ఈ సపరెటరులో వేరుచెయ్యడం జరుగును. ఆవశ్యక నూనెలు నీటి కన్న తక్కువ సాంద్రత కలిగి వుండుట వలన నీటి మీద తేలును., జలవికర్షణ స్వభావం కారణంగా నీటిలో కరగదు. ఆటో సపరెటరులో అడుగుభాగంలో నీరు, నీటి మీద ఆవశ్యకనూనె వేరు వేరు మట్టాలుగా ఏర్పడును. ఈ సపరెటరులో ఒక సైపన్ గొట్టం వుండును. ఈ గొట్టం ఎత్తువరకు నీరు నిల్వవుండి, అంతకు మించి వచ్చు నీరు బయటకు ప్రవహించును. ఇలా సైపన్ గొట్టం ద్వారా వచ్చు నీటిని మరొక నిల్వ పాత్రలలో నింపెదరు. ఈ నీటిని 'హైడ్రొసొల్' అంటారు. సపరెటరులో నీటిపై భాగంన తేలుతున్న ఆవశ్యకనూనె మరో గొట్టం ద్వారా మరో నిల్వపాత్రలోకి వెళ్ళును. హైడ్రొసోల్ నీటిలో ఆవశ్యకనూనెలోని కొన్ని సువాసన పదార్థాలు కరగటం వలన హైడ్రొసొల్ నీరు సువాసన యుతంగా వుండును. ఈ హైడ్రొసోల్ నీటిని పన్నీరుగా, ఇళ్ళ ఫ్లొరింగ్ ను వాష్ చేయుటకు, ఎయిర్ కూలరులో వాసనకై వినియోగిస్తారు. ఆవశ్యకనూనెను బాటిల్లలో నింపి సీల్ చేయుదురు.[1]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Steam distillation of essential oil manufacture". essentialoils.co.za. Archived from the original on 2018-02-27. Retrieved 2018-09-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)