ఉపమాలంకారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉపమాలంకారం ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం. ఇది అర్థాలంకారాల్లో ఒకటి. ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది. దీనిని ఆంగ్లంలో simile (en) అంటారు.[1]

లక్షణం[మార్చు]

లక్షణం: ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః

వివరణ: ఉపమానానికి, ఉపమేయానికి సామ్యరూపమైన సౌదర్యాన్ని చెప్పడం "ఉపమా" అలంకారం అవుతుంది.

సాంకేతిక పదాలు[మార్చు]

ఉపమాలంకారాన్ని అర్థంచేసుకునేందుకు ఉపకరించే సాంకేతిక పదాలు, వాటి అర్థాలు ఇవి:;[2] ఉపమానం : దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం

ఉపమేయం : దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
సమానధర్మం : ఉపమానానికి, ఉపమేయానికి మధ్యనున్న పోలిక
ఉపమావాచకం : ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చడానికి వాడే పదం

ఉదాహరణ[మార్చు]

రఘువంశంలో కాళిదాసు రాసిన శ్లోకం క్రిందనీయబడినది.

వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే

జగతఃపితరౌ వందే, పార్వతీపరమేశ్వరౌ ||

ఈ శ్లోకంలో ఉపమాలంకారం ఉపయోగించబడినది. ఈ శ్లోకం అర్థం : పదాలను (వాక్కులు), అర్థాలను నాకు ప్రసాదించమని - వాక్కు, అర్థం వలె కలిసి ఉండే పార్వతీపరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను.

ఇందులో

ఉపమేయం: పార్వతీపరమేశ్వరులు

ఉపమానం: వాక్కు, అర్థం

సమానధర్మం: కలిసి ఉండటం.

ఉపమావాచకం: ఇవ (సంస్కృతంలో), వలె ( తెలుగు అనువాదంలో)

ఇక్కడ వాగర్థాలకు, పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం.

ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. అప్పుడు దాన్ని లుప్తోపమాలంకారము అంటాము. లుప్తోపమాలంకారములను మనం చలనచిత్ర గీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.

ఉదాహరణలు[మార్చు]

పూర్ణోపమాలంకారము

  • ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఇక్కడ వలె అనునది ఉపమావాచకం. ముఖము ఉపమేయం. చంద్రబింబం ఉపమానం.
  • ఆమె కన్నులు కలువ రేకుల వలెనున్నవి

లుప్తోపమాలంకారము

ఆమె చిగురుంకేలు నంటుకొంటివి.

చిగురువలె మెత్తని, కేలు (చేయి అని అర్థము) ఇందులో​వలె, అను ఉపమావాచకము లేదు. మెత్తని అను సమానధర్మము లేదు. చిగురు అను ఉపమానము, కేలు అను ఉపమేయము. ఈ రెండే కలవు

మూలాలు[మార్చు]

  1. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/అలంకార విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-18.
  2. పి., సందీప్ (11 జూలై 2010). "ఉపమాలంకారము (Simile)". మనోనేత్రం. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 22 October 2015.