Jump to content

ఉబ్బు సిరలు

వికీపీడియా నుండి
(ఉబ్బు సిరలు ( వేరికోస్ వీన్స్ ) నుండి దారిమార్పు చెందింది)

ఉబ్బి, బాగా సాగి, మెలికలు తిరిగి ఉండే సిరలును ఉబ్బుసిరలు (వేరికోస్ వీన్స్) అని అంటారు. సిరలలో రక్త ప్రవాహానికి అడ్డులున్నా, సిరల కవాటాలు సరిగ్గా పనిచేయక రక్తం తిరోగమనంగా ప్రవహించినా సిరలు సాగి, ఉబ్బి మెలికలు తిరుగుతాయి. ఉబ్బుసిరలు చర్మం కింద ఉన్నపుడు అవి మనకు కనిపిస్తాయి. ఇవి శరీరం లోపల అన్నవాహిక, జీర్ణాశయం వంటి అవయవాల్లో కూడా కలుగవచ్చు. సాధారణంగా వీటిని కాలి సిరలులో చూస్తాం. వాటి వలన ఏ బాధా కలుగకపోవచ్చు. కొందరిలో పీకు, అలసట, నొప్పులు కలుగవచ్చు[1].

కాలిలో ఉబ్బుసిరలు

సిరలు

[మార్చు]

హృదయం నుంచి రక్తం వివిధ అవయవాల కణజాలానికి ధమనుల ద్వారా అందించబడుతుంది. ధమనులు సూక్ష్మ ధమనులుగా శాఖలు చెంది కణజాలంలో రక్తకేశనాళికలుగా చీలికలవుతాయి. కేశనాళికలలోని రక్తం నుంచి ప్రాణవాయువు, పోషక పదార్థాలు కణజాలానికి చేరి, కణజాలం నుంచి బొగ్గుపులుసు వాయువు, వ్యర్థ పదార్థాలు రక్తంలోనికి ప్రవేశిస్తాయి. సూక్ష్మ రక్తనాళికలు కలయికచే సిరలు ఏర్పడుతాయి. సిరల పాయలు కలిసి పెద్ద సిరలు ఏర్పడి తుదకు ఊర్ధ్వబృహత్సిర, అధోబృహత్సిరల ద్వారా రక్తాన్ని హృదయంలో కుడి కర్ణికకు తిరిగి చేరుస్తాయి.

సిరల నిర్మాణం

[మార్చు]

సిరల గోడలలో మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో పీచుకణజాలం (కొల్లజెన్), సాగుకణజాలం (ఎలాష్టిన్) ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరాలు ఉంటాయి. లోపొరలో పూతకణాలు మూలాధారపు పొరను (బేస్ మెంట్) అంటిపెట్టుకొని ఉంటాయి. సిరల బయటపొర, మధ్య పొరల మందం ధమనుల పొరల మందం కంటె బాగా తక్కువ.

రక్త ప్రసరణ

[మార్చు]

గుండె ఎడమ జఠరికలో రక్తపీడనం అత్యధికంగా ఉండి ధమనులు, సిరలు చివరకు కుడి కర్ణికకు వచ్చేసరికి ఆ పీడనం క్రమంగా తగ్గుతుంది. ఎడమ జఠరిక ముడుచుకున్నప్పుడు ధమనులలో పీడనం పెరిగి అలలుగా రక్తం ముందుకు ప్రవహిస్తుంది. పీడన వ్యత్యాసం వలన రక్తం సిరలలోనికి ఆపై కుడి కర్ణికకు చేరుతుంది. వికసించుకున్నపుడు కుడికర్ణికలో పీడనం బాగా తగ్గుతుంది. అందువలన కుడికర్ణిక బృహత్సిరలనుంచి రక్తాన్ని గ్రహించగలుతుంది.

సిరల విభజన

[మార్చు]

బాహ్యసిరలు

[మార్చు]

ఇవి చర్మము క్రింద, కండర ఆచ్ఛాదంకు పైన ఉంటాయి.

నిమ్నసిరలు

[మార్చు]

ఇవి కండర ఆచ్ఛాదంకు లోపల ఉంటాయి.

ఛిద్రసిరలు (పెర్ఫొరేటర్ వీన్స్)

[మార్చు]

బాహ్యసిరలను, నిమ్నసిరలతో కలిపే సంధాన సిరలు. ఇవి కండర ఆచ్ఛాదంను చొచ్చుకొని లోపలకు ప్రవేశిస్తాయి. అందువలన వీటికా పేరు వచ్చింది. సాధారణ స్థితులలో రక్తం బాహ్యసిరలనుంచి నిమ్నసిరలలోనికి ఛిద్ర సిరల ద్వారా ప్రవహిస్తుంది. సిరలలో ఉండే ద్విపత్రకవాటాలు తిరోగమన ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఈ కవాటాలు సరిగా పనిచేయనపుడు రక్తం నిమ్నసిరల నుంచి బాహ్యసిరలలోనికి ప్రవహించవచ్చు. కాలి సిరలులో ఉబ్బు సిరలు ఎక్కువగా చూస్తాము.

ఉబ్బుసిరలు

వ్యాధి రావటానికి కారణాలు, విధానం

[మార్చు]

ఉబ్బుసిరలు జన్యుపరంగా రావచ్చు. ఉబ్బుసిరలు పురుషులలో కంటె స్త్రీలలో హెచ్చుగా కలుగుతాయి. ఇవి స్థూలకాయం కలవారిలోను, గర్భిణీ స్త్రీలలోను ఎక్కువగా కలుగుతాయి. కటివలయంలో పెరుగుదలల వలన శ్రోణిసిరలపై ఒత్తిడి పెరిగితే ఉబ్బుసిరలు కలుగవచ్చు. బాహ్యసిరలలో తాప ప్రక్రియ కలిగి కవాటాలు చెడిపోతే తిరోగమన రక్తప్రవాహం వలన సిరలు ఉబ్బుతాయి. సిరలు వ్యాకోచం చెందినపుడు కవాటాల సామర్థ్యత తగ్గుతుంది. ఛిద్రసిరల కవాటాలు పనిచేయకపోతే నిమ్నసిరల నుంచి రక్తం బాహ్య సిరలలోనికి ప్రవహించి వాటిని వ్యాకోచింప జేస్తాయి.

రక్తంలో హోమోసిష్టిన్ ప్రమాణాలు పెరిగితే సిరల గోడలలోని సాగుకణజాలం, పీచుపదార్థం ధ్వంసమై సిరలు ఉబ్బగలవు.

వయస్సు పెరిగిన వారిలోను, వ్యాయామం తక్కువైన వారిలోను, స్థూలకాయం కలవారిలోను, దినంలో ఎక్కువగా నిలబడి ఉండేవారిలోను ఉబ్బుసిరలు ఎక్కువగా కలుగుతాయి.

కొన్ని కుటుంబాల్లో ఇవి ఎక్కువగా కనుపిస్తాయి. జన్యుపరంగా ఉబ్బుసిరలు సంక్రమించవచ్చు.

గర్భిణీ స్త్రీలలో ఇవి కలిగే అవకాశాలు ఎక్కువ. ఎష్ట్రజొన్ వినాళరసం ప్రభావం, కటివలయంలో శ్రోణి సిరలపై ఒత్తిడి ఇందుకు కారణం.

పుట్టుకతో ధమనీ సిర సంధానాలు ( ఆర్టీరియో వీనస్ ఫిష్టులా ) ఉన్నవారిలో ధమనుల రక్తం సిరలలోనికి నేరుగా ప్రవహించడం వలన ఉబ్బుసిరలు కలుగుతాయి.[2]

వ్యాధిలక్షణాలు

[మార్చు]

ఉబ్బుసిరలు కంటికి కనిపిస్తాయి. ఉబ్బుసిరలు వ్యాకోచం చెంది, సాగి, పొడవయి, మెలికలు తిరిగి ఉంటాయి[1]. సులభంగా అణచబడుతాయి. వీటి వలన కాళ్ళలో పీకు, బరువు, లాగుతున్నట్లు నొప్పి కలుగవచ్చు. చీలమండ, పాదాలలో పొంగు, వాపు కలుగవచ్చు. చర్మంలో గోధుమ వర్ణకం కనిపించవచ్చు. చీలమండ పైభాగంలో చర్మం క్రింద కొవ్వుతోను,పీచుకణజాలంతోను గట్టిపడి (లైపోడెర్మటో స్క్లీరోసిస్) చుట్టూ నొక్కినట్లు కనిపించవచ్చును. చర్మంలో తెల్లని మచ్చలు కలుగవచ్చు.

ఉపద్రవాలు

[మార్చు]

ఉబ్బుసిరల వలన కొన్ని ఉపద్రవాలు కలుగవచ్చు.

నిశ్చలన చర్మతాపం

[మార్చు]

ఉబ్బు సిరలలో రక్తం స్తంభంగా నిలవడం వలన కేశనాళికలలో పీడనం పెరిగి కణజాలంలో ద్రవసాంద్రత పెరుగుతుంది. ఎఱ్ఱ రక్తకణాలు కూడా కణజాలంలో చేరి వాటి నుంచి వెలువడే రక్తవర్ణకం ( హీమోగ్లోబిన్ ) హీమోసిడరిన్ గా నిక్షిప్తమవుతుంది. చర్మానికి అద్దే కొన్ని లేపనాలు వికటించి తాపం కలిగించవచ్చు. ఈ కారణాలు అన్నీ చర్మతాపం కలిగించగలవు.

చర్మతాపం కలిగిన వారికి దురద, నొప్పి కలుగుతాయి. చర్మంలో వాపు, ఎర్రదనం, గోధుమరంగు కలుగుతాయి. చర్మపు మందం తగ్గుతుంది. చర్మంలో పగుళ్ళు , పుళ్ళు కలుగవచ్చు. ఆపై సూక్ష్మాంగజీవుల ఆక్రమణ వలన చర్మంలోను, చర్మం క్రింద కణజాలంలోను తాపప్రక్రియ కలుగవచ్చును.

నిశ్చలన చర్మతాపం ఉబ్బుసిర పుళ్ళకు ( వేరికోస్ వీనస్ అల్సర్స్ ) దారితీయవచ్చు.

సిరలలో తాపం

[మార్చు]

ఉబ్బుసిరలలో తాపం కలుగవచ్చు. అప్పుడు ఆ సిరలలో రక్తం గడ్డకట్టి సిరలు గట్టిగా నులకతాళ్ళలా తగులుతాయి. ఈ రక్తపుగడ్డలు సిరలకే అంటిపెట్టుకొని క్రమంగా తంతీకరణం చెందుతాయి. తాపం కలిగిన సిరలు తాకుతే నొప్పి పుడుతాయి.

రక్తస్రావం

[మార్చు]

ఉబ్బుసిరల నుంచి చిన్న చిన్న గాయాలకు రక్తస్రావం జరిగే అవకాశం ఉంది.

కర్కట వ్రణాలు

[మార్చు]

మానుదల లేని దీర్ఘకాలపు ఉబ్బుసిర వ్రణాలలో కర్కట వ్రణాలు (కార్సినోమాలు, సార్కోమాలు) పొడచూపవచ్చు.

రక్తపు గడ్డలు

[మార్చు]

ఉబ్బుసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడవచ్చు. అసాధారణంగా యీ రక్తపుగడ్డలు నిమ్నసిరలకు వ్యాపించవచ్చు. ఈ రక్తపు గడ్డలు కుడి కర్ణిక, కుడి జఠరికల ద్వారా , పుపుసధమనికి చేరితే అపాయకరం.

పరీక్షలు

[మార్చు]

ఉబ్బుసిరలు ఉన్న వ్యక్తిని పడుకోబెట్టి ఆ కాలును ఎత్తిపెట్టి సిరలు సంకోచించాక మొలక్రింద దృశ్యసిర ఊరుసిరతో సంధానమయే చోటను, ఛిద్రసిరల స్థానాల వద్దను పట్టీలు బిగించి, వ్యక్తిని నిలుచో బెట్టి పట్టీలు ఒక్కక్కటి తీసి నిమ్నసిరల నుంచి బాహ్యసిరల లోనికి ప్రవాహం తిరోగమనం ఎచ్చట చెందుతున్నదో నిర్ణయించవచ్చు.

సిరల చిత్రీకరణ

[మార్చు]

ఇదివరలో ఊర్ధ్వపాద సిరచాపంలోనికి సూది ద్వారా వ్యత్యాస పదార్థాలను (కాంట్రాస్ఠ్ లను) ఎక్కించి ఎక్స్ - రే లతో సిరలను చిత్రీకరించేవారు. ఇప్పుడీ పరీక్షలు అరుదు, అనవసరం.

శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ

[మార్చు]

ఈ దినములలో శ్రవణాతీతధ్వని (అల్ట్రాసౌండ్) సాధనాలతో కాళ్ళలోని దృశ్యసిరలను (సెఫినస్ వీన్స్), నిమ్నసిరలను చిత్రీకరించవచ్చు. రక్తప్రవాహం తిరోగమనం చెందే స్థానాలను కూడా నిర్ణయించవచ్చు.

చికిత్సలు

[మార్చు]

కాళ్ళు ఎత్తులో పెట్టుట

[మార్చు]

కాళ్ళు హృదయం కంటె ఎత్తుగా ఉంచుట వలన సిరలలో రక్తం స్తంభంగా నిలిచిపోవడం, సాంద్రత తగ్గుతుంది. పాదాలలోను, చీలమండలలోను పొంగు, వాపు తగ్గుతాయి. తాపప్రక్రియ కూడా తగ్గుతుంది.

వ్యాయామం

[మార్చు]

నడక, వ్యాయామం సిరలలో సాంద్రతను తగ్గిస్తాయి. కండరాల బిగుతును పెంచుతాయి .

సాగు మేజోళ్ళు

[మార్చు]

తగిన పీడనం గల మేజోళ్ళు మొలవరకు గాని మోకాళ్ళ వరకు కాని ధరిస్తే అవి సిరలలో రక్తప్రవాహానికి తోడ్పడుతాయి. సిరలలో సాంద్రతను తగ్గిస్తాయి. కాళ్ళు, చీలమండలం, పాదాలలో పొంగును, వాపును తగ్గిస్తాయి. కణజాలంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలో తాప ప్రక్రియను తగ్గిస్తాయి. ఉబ్బుసిర వ్రణాల మానుదలకు తోడ్పడుతాయి. దూరధమని వ్యాధి ( పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ ) గలవారు సాగు మేజోళ్ళు వాడకూడదు.

సవిరామ వాయుపీడన సాధనాలు

[మార్చు]

సవిరామ వాయుపీడన సాధనాలు సిరలలో రక్తప్రసరణను మెరుగుపఱచడానికి ఉపయోగపడుతాయి. ఇవి కాలి కండరాలపై ఆగి ఆగి ఒత్తిడి పెట్టి నెత్తురు ముందుకు పాఱునట్లు చేస్తాయి. కాళ్ళ పొంగులను, వాపులను తగ్గిస్తాయి. ఉబ్బుసిర వ్రణాలు మానడానికి తోడ్పడుతాయి.

ఉబ్బుసిరల విధ్వంసం

[మార్చు]

తంతీకరణం (స్క్లీరోసిస్)

[మార్చు]

ఉబ్బుసిరలలో తంతీకరణ రసాయనాలతో (స్క్లీరోజింగ్ ఏజెంట్స్) తాపప్రక్రియ కలుగజేసి, వాటిని ధ్వంసం చేసి, పీచుకణజాలంతో గట్టిపరచవచ్చు[3]. పోలిడోకానోల్, సోడియం టెట్రాడెకైల్ సల్ఫేట్, స్క్లీరోడెక్స్, అతిసాంద్ర లవణద్రావణం, గ్లిసరెన్, క్రోమియం గ్లిసరెన్ల మిశ్రమాలు తంతీకరణకు వాడబడే వివిధ రసాయనికాలు. ఈ రసాయనికాలను బొగ్గుపులుసు వాయువుతో గాని, వాతావరణపు గాలితో గాని మిశ్రీకరించి నురగగా చేసి కూడా ఉబ్బుసిరలలోనికి సూదిద్వారా ఎక్కించవచ్చు. అపుడు తక్కువ రసాయనం సిరలో ఎక్కువ ఉపరితలంపై పనిచేసే అవకాశం ఉంది.

సిరాంతర విధ్వంసం (ఎండోవీనస్ ఎబ్లేషన్)

[మార్చు]

శీతల శలాకలతోను, ఉష్ణ శలాకలతోను, విద్యుచ్ఛక్తి శలాకలతోను సిరాంతర విధ్వంస (ఎండోవీనస్ ఎబ్లేషన్) ప్రక్రియతో ఉబ్బుసిరలను ధ్వంసం చేయవచ్చు[4].

ఉబ్బు సిరలను లేసర్ కాంతికిరణ ప్రసరణంతోను, ఆవిరిని ప్రసరింపజేసి కూడా ధ్వంసం చేయవచ్చు. శ్రవణాతీతధ్వని సాధనాలు శలాకలను సిరలలోనికి చేర్చడానికి ఉపయోగపడుతాయి. ధ్వంసమయిన సిరలు పీచుకణజాలంతో గట్టిపడుతాయి.

ఈ పద్ధతుల తర్వాత ఉబ్బుసిరలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అపుడు వాటికి మరలా చికిత్స అవసరం.[4]

శస్త్రచికిత్స

[మార్చు]

శస్త్రచికిత్సతో ఉబ్బుసిరలను ప్రత్యేక సాధనాలతో ఊడపీకవచ్చును. కాని మిగిలిన చికిత్సల్లో వలె కొత్త ఉబ్బుసిరలు తిరిగి వచ్చే అవకాశం ఉంది[1].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Varicose Veins - Cardiovascular Disorders". Merck Manuals Professional Edition (in కెనడియన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-17.
  2. Jayroe, Hannah; Foley, Katie (2023), "Arteriovenous Fistula", StatPearls, Treasure Island (FL): StatPearls Publishing, PMID 32644639, retrieved 2023-05-17
  3. "Overview | Ultrasound-guided foam sclerotherapy for varicose veins | Guidance | NICE". www.nice.org.uk. 2013-02-23. Retrieved 2023-05-17.
  4. 4.0 4.1 "Recommendations | Varicose veins: diagnosis and management | Guidance | NICE". www.nice.org.uk. 2013-07-24. Retrieved 2023-05-17.