Jump to content

ఉరి వార్డ్ నుండి

వికీపీడియా నుండి

“ఉరివార్డు నుండి” సుధా భరద్వాజ, తెలుగు అనువాదం:ఉషారాణి, ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ.


సుధా భరద్వాజ గారి తల్లి కృష్ణ దేశం కోసం మహానబిలనోస్ గారి పిలుపుమేరకు అమెరికా వదిలి మాతృభూమికి వచ్చేశారు. కూతురు సుధా గారు 21 ఏళ్లకే అమెరికా పౌరసత్వం వదిలేసి ఇండియాకు వచ్చారు. కాన్పూరు ఐఐటిలో ఐదేళ్ళ డిగ్రీ చదివి, చత్తీస్ ఘడ్ గని కార్మికుల కోసం మూడు దశాబ్దాల తరబడి పనిచేశారు. అక్కడి గిరిజనులే ప్రపంచంగా పనిచేస్తూ, "బీమాకొరెగావ్" కేసులో జైలు శిక్ష అనుభవించారు. భవిష్యత్తు పట్ల గొప్ప భరోసా, కొండతం ధైర్యం కల ఈ వీర వనిత ‘ఉరి వార్డు నుండి’ మొదటి భాగం స్వంతంగా ఆమె చెప్పిన జీవిత కథ పుస్తకం.

జైలు అనుభవాలు స్వీయాత్మకంగా వుంటాయి. “ఉరివార్డు నుండి” ఈ ధోరణికి పూర్తిగా భిన్నంగా, తోటి నిరుపేద మహిళా ఖైదీల గురించీ, చూసింది చూసినట్టుగా వ్యాఖ్యానం లేకుండా చేసిన కథనం. ఇది దాదాపు ఏభయికి పైగా మహిళల వ్యథార్థ జీవితాల దృశ్య మాలిక. ఒక ఉద్యమకారిణిగా, సుధా గారికి స్పష్టమయిన ప్రాపంచిక దృక్పథం, ు నిరుపేద మహిళల పట్ల గాఢమయిన ప్రేమానురాగాలున్నాయి. ఆమె సామాజిక ఆచరణ, ఈ ఆర్ద్రత లేకపోతే ఇలాంటి రచన చేయడం సాధ్యంకాదు.

జైల్లో సుధా భరద్వాజ చుట్టూ రకరకాల స్త్రీలు, కొందరు వచ్చి బాలింతలు, వారితోపాటు పసిపిల్లలు. వీరు చేసినవి చిన్నచిన్న నేరాలు. చాలా భాగం తెలియక చేసినవి. కొన్ని చేయక తప్పక చేసినవి. కొన్ని నెత్తిన పడ్డవి. ఒక పచ్చి బాలింతను, బిడ్డను కని వారం రోజులు కూడా తిరక్క ముందే మొగుడు తాగొచ్చి కోరిక తీర్చమన్నాడు. కాదంటే ఏడేళ్ల కూతురుని పంపమన్నాడు.ఆమె బాది వాడిని చంపింది. ఇదీ ఆమె చేసిన ‘హత్యా’ నేరం. కొన్ని అత్తలతో గొడవలు. సంసారపు సమస్యలతో ముడివడ్డవి. దాదాపు అందరూ మొదటి సారి జైలుకొచ్చిన వారు. వీళ్ళల్లో ఒక్కరూ కరుడుగట్టిన నేరస్తులు లేరు, క్రిమినల్స్ లేరు, ఉగ్రవాదులు లేరు. రౌడీషీటర్లు లేరు. అంతా బండ చాకిరీ చేసి సంసారాల్ని ఈదుతున్న వారు.తాగుబోతు మొగుళ్ళతో బతుకంతా ఏగుతున్న వాళ్ళు. తమకంటూ ఏ న్యాయమూ లేని ప్రపంచంలో “లౌక్యంగా” నెట్టుకు రావడం తెలీక జైల్లోకి చేరిన వాళ్ళు.

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ఇలాంటి వాళ్ళ కోసమేనా జైళ్లు వుండేది? వీరి కోసమేనా పోలీసులు, లాయర్లు, కోర్టులు, కారాగారాల ఇంత పెద్ద వ్యవస్థ వుండేది? నిజానికి వీళ్లే ఈ వ్యవస్థకంతా బతుకుతెరువు. వీళ్ళే లేకుంటే వీటికి పూటే గడవదన్పిస్తుంది!

ఈ నిర్భాగ్య మహిళలకు బయట ప్రపంచమూ, జైలు ప్రపంచమూ కొంచెం అటూ ఇటూ రెండూ ఒకటి గానే వుంటాయి. ఒక్కోసారి జైళ్లే మేలని కూడా అన్పిస్తుంటాయి.

బ్రహ్మకుమారీలు వచ్చి “నైతిక ఆధ్యాత్మిక బోధామృతం” కురిపించబోయినప్పుడు, ఒక సాధారణ ఖైదీ “అందరం బాగానే వున్నాం కదా! ఇక్కడ అత్తలూ లేరు, మొగుళ్ళూ లేరు; వంటలూ లేవు, వేధింపులూ లేవు” అని అమాయకంగానో, గడసరి తనంతోనో వారిని ప్రశ్నిస్తుంది. ఇలాంటి ఘట్టాలు చదువుతున్నప్పుడు జైలు రచనల్లోనూ ఇంత హాస్యం పండించవచ్చా అన్పిస్తుంది. జైల్లోనూ ఆడవాళ్ళకి పండుగలు, సంసారాలు, కోరికలు, ప్రేమలు, మేకప్లు, మాతృత్వాలు, సహకారాలు అన్నీ ఉంటాయి. అలానే అసూయలు, ద్వేషాలు, పోటీలు,కొట్లాటలు, దొంగతనాలు కూడా ఉంటాయి. జైల్లో వేసినంత మాత్రాన వాళ్ళ జీవితాలేమీ మారవు. వీళ్లంతా మామూలు మనుషులు, మట్టి మనుషులు. వాళ్లు ఎప్పుడూ మనుషుల్లానే వుంటారు.

వీరంతా జైలు నుంచి బయటి కొచ్చాక ఏమవుతారు? లోకాన్ని ఎదురీదడంలో రాటు తేలుతారన్పిస్తుంది. బడాబడా నేరగాళ్లు లక్షల మంది వుంటే వీళ్ళే జైలుకెందుకు రావాలి అనేది అసలు ప్రశ్న. కనీసం మరుగుదొడ్లయినా ఉండని, బాత్రూములు కూడా దొరకని, చివరకు బట్టలారేసుకొనూ దోవలేని దౌర్భాగ్యం. సుధా గారే “నేను భారతీయ మరుగుదొడ్డిలో ఒక మూల కూచొని స్నానం చేసేదాన్ని” అన్నప్పుడు అమానుషత్వ మంతా జైళ్లలో పేరుకు పోయిందనిపించి అసహ్యం వేస్తుంది.

బ్రిటన్ కాలపు జైళ్లే మేలు. యరవాడ జైల్లో గాంధీ గారి లాంటివారూ వున్నారు. ఆ రోజుల్లో వారికి కావలసిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ఎన్ని రచనలనైనా వారు చేసేవారు. సమావేశాలు జరిపేవారు. పూనా ఒప్పందం ఇక్కడే జరిగింది. దీర్ఘకాలిక నిరాహార దీక్షల్లాంటి రాజకీయ పోరాటాలు కూడా వాళ్ళు చెయ్యగలిగే వారు. స్వతంత్ర భారతదేశంలో జైళ్ళు ఎందుకిలా బిగుసుకు పోయాయి? మన ప్రజాస్వామ్యం ఎందుకింత కురచబారి పోయింది? సుధా భరద్వాజ్ గారు ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతారు. జైళ్ళులేని పాలను అంటూ వుండదా? అని ఆమె ప్రశ్నిస్తారు.

అలాగే మన నేరనిర్ధారణలూ, శిక్షాస్మృతులు కూడా. ఆత్మ రక్షణలో భాగంగా చెయ్యాల్సి వచ్చే చర్యల్ని బ్రిటన్ లాంటి దేశాలు హత్యానేరాలుగా లెక్కించవు. మన దేశంలో ఈ మాత్రం విచక్షణ లేదెందకని? అదే వుండి వుంటే ఈ ఖైదీల్లో సగం మంది జైలు ముఖం చూడాల్సి వచ్చేదే గాదు. సుధా గారు సూటిగా ఈ ప్రశ్నను లేవనెత్తుతారు.

ఇక “ఉరివార్డు నుండి” కథనం కూడా అద్భుతమైంది. ఒక్కోఖైదీని (ఈ మాట మాటి మాటికీ అనడం సిగ్గుగా ఉంది) సాదాసీదాగా ఆమె ముక్కు గురించీ, ముంగురుల గురించీ, పూసుకున్న లిఫ్టిక్ గురించీ, వేసుకొన్న జడ గురించీ చెబుతూనే పాఠకుల్ని ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్తారు. సామాజిక రాజకీయ అపసవ్యతలనన్నిటినీ మన ముందు రాసి పోస్తారు. రూపురేఖలతోనొ, వేషభాషలతోనో ప్రారంభించి ప్రతి ఖైదీ విషాద దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలబెడతారు. ఇదో కొత్త ప్రక్రియ అనిపిస్తోంది.

మూలం: “ఉరి వార్డు నుంచి” @కొలిమి సాహిత్య పత్రిక నుండి సేకరణ