ఉరుకుంద ఈరణ్ణస్వామి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (మే 2017) |
ఉరుకుంద ఈరణ్ణస్వామి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ యోగులు. వీరు 1625 - 1685 మధ్య కాలంలో యోగ, భక్తి, వేదాంత, వైద్య, జ్యోతిష, వాస్తు శాస్త్రాల ద్వారా సామాన్య జనానికి సేవలు చేస్తూ సమసమాజ నిర్మాణానికి నడుం బింగించిన ఆధ్యాత్మిక గురువు. ఈరణ్ణ స్వామి శిష్యులు, అనుయాయులు అధికంగా శాంత స్వభావులు. ఈరణ్ణ వేష భాషలు శాంతికి విరక్తికి సంకేతాలు. ఐతే మిమతీయుల దౌర్జన్యాలు మితిమీరినపుడు ఈరణ్ణ తన తన శిష్యులను అనుయాయులను ఆ దుర్జనుల తలపండ్లు తరగడానికి పురికొల్పినాడు. ఆయన ముందుగా యోగి, కుండలినీ సాధనలో అణమాద్యష్టసిద్ధులు గడించాడు. తరువాత విరాగియైనాడు. కర్నూలు సమీపాన ఆదోని సమీపాన గల కౌతాళానికి చేరువగల ఉరుకుంద పొలిమేరలోని రావిచెట్టు నీడ ఆ శైవయోగికి సాధనా కేంద్రం. అదే ఆయన సమాధిస్థలం.
స్వామి వారి చరిత్ర
[మార్చు]క్రీశ.1610లో కౌతాళం గ్రామంలో హిరణ్యులు అనే స్వామి జన్మించారు. తన 12వ ఏటా ఆవులు మేపడానికి స్వామి ఉరుకుంద ప్రాంతానికి వచ్చాడు. ఆవులు గడ్డి మేస్తున్న సమయంలో హిరణ్యులు రావిచెట్టు కింద మౌనంగా కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో ఆ దారిని వెళుతున్న ఒక సిద్ధుడు హిరణ్యుల వద్దకు వచ్చి గురుబోధన చేశారు. దైవధ్యానం చేస్తూ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గడపమని సిద్ధుడు హిరణ్యులను ఆశీర్వాదించారు. అప్పటినుంచి బాలబ్రహ్మచారిగా స్వామివారు అశ్వద్ధ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తూ సమాధి ముద్రలో లక్ష్మీనరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారు. కాలక్రమంలో హిరణ్యులు తపస్సు చేసిన అశ్వద్ధ వృక్షం కిందనే ఉరుకుంద ఈరన్నస్వామి సన్నిధి ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తూ వచ్చారు. 1660లో ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రం వ్యాప్తి చెందింది. 1768లో భక్తులు స్వామివారికి దేవాలయాన్ని నిర్మించారు. 1995లో ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మాణ కార్యక్రమం 10 సంవత్సరాలపాటు సాగింది. నేడు ఉరుకుంద మహామాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. స్వామివారి ఆదాయం అంచలంచెలుగా పెరుగుతూ వస్తోంది.
స్వామివారి మహిమలు
[మార్చు]ఉరుకుంద ఈరన్నస్వామిని కొలవనివారు స్వామికి భక్తులు కొట్టిన కొబ్బరి తినాలంటేనే భయపడుతారు. కొబ్బరి తింటే ఈరన్నస్వామి వదలడని, కొలిచి తీరాల్సిందేనని, అందువల్ల ఆ స్వామిని నిప్పులాంటి దేవుడు అని భక్తులు విశ్వసిస్తారు. ఉరుకుంద ఈరన్నస్వామిని ఒక్క హిందూవులే కాకుండా ముస్లింలు సైతం కొలుస్తారు. ఇక్కడ ముస్లింలు సైతం స్వామివారికి పూజలు చేయడం మనం చూడవచ్చు. శ్రావణమాస ఉత్సవాల్లో ఇతర మతస్థులు కూడా కొబ్బరికాయలు ఇచ్చి పంపుతుంటారు. అందువల్ల స్వామిని మతసామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. గతంలో స్వామివారి క్షేత్రంలో భక్తులు నిద్రించడానికి వీలులేకుండా రాళ్లు వచ్చి పడేవని వృద్ధులు నేటికి చెబుతుంటారు. అందువలన అప్పట్లో ఉదయం పూట స్వామిని దర్శించుకుని చీకటి పడుతుండగానే ఇంటిదారి పట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఉరుకుంద ఈరన్నస్వామిగా పిలువబడుతున్న హిరణ్యులు అశ్వద్ధ వృక్షం కింద కూర్చోని ధ్యానం చేసి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పొందినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నారు. అందుకే భక్తులు నేటికీ స్వామికి ప్రతీకగా నిలిచిన అశ్వద్ధవృక్షానికి పూజలు చేస్తుంటారు. ఈ క్షేత్రంలోని అశ్వద్ధ వృక్షం ఏళ్లనాటిదని చెబుతుంటారు. వందల సంవత్సరాలైన అశ్వద్ధ్థ వృక్షం చెక్కుచెదరకుండా ఉంది. స్వామికి నిర్వహించే శ్రావణమాస ఉత్సవాలకు ఒక ప్రత్యేకం ఉంది. స్వామివారిని కొలిచే లక్షలాది మంది భక్తులు శ్రావణమాసాల్లో ఇండ్లు శుభ్రం చేసుకుని శ్రావణమాస ఉత్సవాలు ముగిసేంత వరకు మాంసాహారాన్ని ముట్టరు. మద్యం సేవించరు. స్వామి పట్ల అంచంచల భక్తి విశ్వాసాలతోనే భక్తులు మాంసం, మద్యానికి ఈ మాసం దూరంగా ఉంటుంటారు. శ్రావణమాస ఉత్సవాల్లోనే గాకుండా ప్రతి సోమ, గురువారాల్లో భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకుంటుంటారు.
ఉరుకుంద క్షేత్రంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి కర్నూలు జిల్లా నుంచే గాకుండా పొరుగున ఉన్న అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు.
ఇతర విశేషాలు
[మార్చు]ఈ మహా పురుషుడు ముస్లిం మతగురువులు ముస్లిం సైన్యాలతో చేయించి రక్తపాతం మఠ మందిరాల అర్చా మూర్తుల విధ్వంసం చేతనైనంత వరకు ఎదుర్కొన్నాడు. అశ్వికబలం, నూతన మారణాయుధాలున్న తురకల దండును ధర్మావేశాం త్రిశూలాలతో వీరశైవవిప్లవయోగులు ఎదుర్కొనలేకపోయినారు. బహ్మనీ సుల్తానులు బీజాపురం ముస్లిం పాలకులు రాయచూరు, బళ్ళారి, కర్నూలు, కడప ప్రాంతాలకు ముస్లిం సైన్య బలాన్ని తోడుగా యిచ్చి ఇస్లాం మత ప్రచారకులను పంపించారు. అప్పుడు వీరభద్ర ప్రతిపాదితమైన వీరశివాచారాన్ని పాటిస్తూ, ఆనాటి వీరభద్రగణాల చేత పాటింపచేస్తూ ముస్లిం సైన్యాలను ఎదుర్కొని సనాతన ధర్మాన్ని నిలపడానికి ప్రయత్నించిన ఈరణ్ణ స్వామివారు ముస్లిములు స్త్రీలను శిశువులను వృద్ధులను కూడా నిర్దాక్షిణ్యంగా చంపుతున్న దృశ్యాలను చూసి కదలిపోయాడు. కౌతాళం లోని తన మఠాన్ని ఆక్రమించి అపవిత్రం చేసి ఆరాధ్యమూర్తులను భగ్నం చేసి శిష్యులను చంపుతుంటే మఠం విడిచి కొలది మంది అనుయాయులతో ఈరణ్ణ ఉరుకుంద పొలిమేరలవైపు సాగిపోయినాడు. వీరభద్రులకు స్వార్థం, భోగం, ద్వేషం, మాత్సర్యములుండవు. మానవత్వం, ప్రేమ వారి ముఖ్యాశయాలు.
ఈరణ్ణ ముస్లింల విజృంభణను నిరోధించడానికి వీరభద్ర ప్రతినిధులను పురికొల్పినాడు. తన తపశ్శక్తితో రోగులను నిరోగులను చేస్తూ సంతానార్థుల కోరికలు తీరుస్తూ, ఆర్తులను ఆదుకుంటూ తమ ప్రవచన ప్రబోధాలతో సంతోషానందాలు పంచుతూ, హిందూ సమాజాన్ని సంఘటిత పరుస్తున్న ఈరణ్ణ ముస్లిం పాలకులకు అసహ్యుడయ్యాడు. అందువల్ల సిద్దీ మసూద్‌ఖాన్ కౌతాళం వృహత్ శీలవంతుల మఠం ఆక్రమించి విధ్వంసం చేసాడు. ఈరణ్ణ శిష్యులు యువకులు ముస్లిం సేనలకు ఎదురొడ్డి నేలకొలికారు. ఈరణ్ణ తమ మఠం విడిచి పోయినారు. ఈ సంఘటన 1676 - 78 లలో జరిగింది. ఖాదర్ లింగస్వామి ఆ మఠంలో తిష్ట వేసినాడు. అక్కడ మసీదులు, షహీదుల సమాధులు నిర్మితమైనవి. తరువాత ఖాదర్ లింగస్వామి సమాధి కూడా అక్కడే ఏర్పడినది.
సూఫీ ముస్లిం వీరులు కత్తి బలంతో హిందువులను ముస్లింలుగా మార్చితే ముస్లింల సిద్ధూ మహాత్మ్యాలు ప్రదర్శించి హిందువులను ముస్లింలుగా మార్చారు. ఖాదర్ లింగస్వామి కౌతాళం వీర శైవులను అట్లే మార్చాడు. దానికి ప్రతీకగా లింగాన్ని తన పిక్కలకు కట్టుకున్నాడు. ఇది వాని విజయానికి సంకేతం.
చేతికర్ర కమండలం మాత్రం ధరించి మఠం బయటికి నడచిన ఈరణ్ణను ఆయన అనుచరులు కొందరు వెన్నంటి ఉరుకుందకు వచ్చారు. వారిలో కొందరు ఈనాడు ఉరుకుందలో పూజారులు. స్వామి ముందుగా ఉరుకుంద గ్రామాధికారి ఇంటి ముందున్న అరుగుపైన ఆసీనులైనారు. అందువలననే ఈనాటికీ స్వామివారి పల్లకిని అక్కడ ఉంచుతారు. స్వామి ఉరుకుందలో ఉంటూ చుట్టున్న గ్రామాలు తిరిగి ప్రచార ప్రబోధములు చేసాడు. ఆయా గ్రామాల ప్రజలిప్పటికీ పల్లకీ సేవలో పాల్గొంటారు. ఉరుకుంద పొలిమేరలోని రావిచెట్టు నీడ స్వామికి ఆవాస కేంద్రమైనది. స్వామి అక్కడే ఉంటూ 10 సంవత్సరాలు శుచి జీవనం గడుపుతూ ధర్మ ప్రబోధం చెస్తూ ప్రజానీకానికి శాంతి సౌభాగ్యాలను ప్రసాదించారు. చివరి దినాల్లో సమాధి నిర్మాణం చేయించుకొని 1686 సంవత్సరం అందులో ప్రవేశించి జీవసమాధియైనారు.
ఈరణ్ణ క్షేత్రం
[మార్చు]శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వీరన్నగా ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం ఉరుకుంద ఆదోనికి ౩౦ కిలోమీటర్ల దూరంలో ఉంది. . ఇక్కడికి రావాలంటే ఆదోని నుండి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యము ఉంది. అలాగే ఎమ్మిగనూరు నుండి ప్రతి గంటకు బస్సు సౌకర్యము ఉంది.ప్రతి ఏటా శ్రావణ మాసం స్వామి వారికి ఉత్సవాలు జరుగును.[1] స్వామి వారిని స్మరించి దర్శించిన కోరిన కోర్కెలు తీరును. పలికే దేవుడిగా స్వామి వారు ప్రసిద్ధిచెందారు. వారంలో సోమవారం, గురువారం స్వామి వారికి అంత్యంత ఇష్టమైనవి, అమావాస్య కూడా స్వామి వారికి చాల ఇష్టం.
ఉరుకుంద ఈరన్నస్వామి కొలిచిన వారికి కొంగు బంగారం. కోరిన వెంటనే భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా స్వామికి పేరు. వందల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది ఉరుకుంద ఈరన్న క్షేత్రం. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామం సమీపంలో ఉరుకుంద ఈరన్న క్షేత్రం నెలకొంది. ఉరుకుంద ఈరన్న స్వామిని ఈ ప్రాంతం ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ఇంటి దేవుడిగా పూజిస్తున్నారు. కోర్కెలు తీరిన అనంతరం భక్తులు తమ పిల్లలకు ఉరుకుందు, ఉరుకుందప్ప, ఈరన్న, అశ్వర్థప్ప అన్న స్వామి పేర్లు పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దాదాపు నెల రోజుల పాటు స్వామి వారికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమ, గురువారాల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తారు. శ్రావణ మాసం 3వ సోమవారం 30 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ ఒక్కరోజే స్వామివారికి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.[2]
సూచికలు
[మార్చు]- ఉరుకుంద ఈరణ్ణస్వామి చరిత్ర - హెచ్. హీరాలాల్, సాహిత్యరత్న, కర్నూలు వారి గ్రంథం.
- ఈరణ్ణ స్వామి జీవిత చరిత్ర[permanent dead link]