Jump to content

ఉవ్వ కుటుంబము

వికీపీడియా నుండి

ఉవ్వ కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము. ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో పెద్ద చెట్లు, చిన్న మొక్కలు కూడ ఉన్నాయి.. ఆకులు ఒంటరి చేరిక, వీనికి గణుపు పుచ్చము లుండవు. ఆకులు సాధారణముగ గొమ్మల చివర గుబురులు గుబురులుగా నుండును. ఆకర్షణ పత్రములన్నియు విడివిడిగా నుండును. కింజల్కములు చాల గలవు. అండాశయములును విడివిడిగా నుండును.[1]

కుటుంబ లక్షణాలు

[మార్చు]
  • ప్రకాండము: వంకరలు లేక తిన్నగా నుండును. కాని కొంచమే ఎత్తుండును. కొమ్మలు గుండ్రముగా వ్వాపించును.
  • ఆకులు: ఒంటరి చేరిక, లఘు పత్రములు తొడిమలు కురుచనివి. నిడివి చౌకపు నాకారము. రెండు వైపుల నున్నగ నుండును. అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము.
  • పుష్పమంజరి: కణుపుసందుల నిక్కొక్క పువ్వు గలదు. పువ్వులు పెద్దవి. భూమి వైపు వంగి యుండును.
  • పుష్పకోశము: రక్షక పత్రములైదు. గుండ్రముగాను దళసరిగాను నున్నవి. ఇదియు బెరుగుచు కాయను మరుగు పరచును. నీచము.
  • దళవలయము: అసంయుక్తము. వృంతాశ్రితము. 5 ఆకర్షణ పత్రములు. తెలుపు రంగు, వీనికి మంచి వాసన గలదు.
  • కింజల్కములు: అసంఖ్యములు. కాడలు పొట్టివి. పుప్పొడి తిత్తులు సన్నము. మధ్యనున్న పుప్పొడి తిత్తులు సన్నము. మధ్యనున్న పుప్పొడి తిత్తులు కీలాగ్రము క్రింద వంగి యున్నవి.
  • అండకోశము: ఉచ్చము ఒక్కొక్కగదిలో బెక్కు గింజలుండును. ఒక్కొక్క దాని కొక్కొక్క కీలమును కీలాగ్రమును గలవు. కీలము మిక్కిలి పొట్టిగను కీలాగ్రము కొంచెము పొడుగగను నున్నవి.

ఉవ్వ చెట్టు

[మార్చు]

ఉవ్వచెట్టు కొండల మీద బెరుగును. ఇది అందముగా నుండుట చే తోటలందును బెంచు చున్నారు. కొమ్మల చివర ఆకులుండుటయు కొమ్మ లన్నియు దట్టముగా మాను చివర చుట్టు నుండుటయు నీ చెట్టున కంద మిచ్చు చున్నవి. పువ్వులు సువాసన వేయును. దీని కాయలను తిందురు. వీనిలో, పువ్వులలో నుండు ఆకుపచ్చని రేకులు కూడ బెరిగి కండ కట్టి కాయనావరించు కొను చున్నవి. ఉవ్వ కలప గట్టిగా నుండును. దీనిని దరుచుగా తుపాకుల కుపయోగించెదరు.

మూలాలు

[మార్చు]
  1. వేమూరి, శ్రీనివాసరావు (1916). వృక్షశాస్త్రము. మద్రాసు: విజ్ఞాన చంద్రికా మండలి. p. 60. Retrieved 27 June 2016.[permanent dead link]