ఉష్ణ సంబంధ రుగ్మతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2016 లూసియానా వరదల సమయంలో బాటన్ రూజ్ వద్ద హీట్ స్ట్రోక్ ప్రాథమిక చికిత్స చేస్తున్న దృశ్యం

ఉష్ణ సంబంధ రుగ్మతలు శరీరంలో ఉష్ణం సరైన స్థాయిలో లేనపుడు కలిగే రుగ్మతలు. వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు కలిగే రుగ్మతలను తఱచు చూస్తాము. శీతల దేశాలలో విపరీతమైన చలిలో ఎక్కువ కాలము ఉంటే అల్పఉష్ణోగ్రత రుగ్మతలు కలుగగలవు.

అధిక ఉష్ణోగ్రత

[మార్చు]

అధిక ఉష్ణోగ్రతలలో పనిచేసేవారిలోను, వ్యాయామం, క్రీడలలో పాల్గొనేవారిలోను, సైనికులలోను, దళసరి వస్త్రధారణ చేసేవారిలోను, గృహవసతి లేనివారిలోను, ఇతర అనారోగ్యాలు కలవారిలోను, మద్యం, యితర మాదక ద్రవ్యములు వాడే వారిలోను, మానసిక ఔషధాలు, యితర ఔషధాలు వాడే వారిలోను వాతావరణంలో వేడి అనారోగ్యం కలిగించే అవకాశాలు ఎక్కువ.

శరీరంలో ఉష్ణ నియంత్రణ

[మార్చు]

శరీరంలో ఉష్ణ నియంత్రణ కేంద్రం మెదడులో హైపోథలమస్ లో ఉంటుంది. ఉష్ణం శరీరంలో ఎక్కువగా పుట్టినపుడు , వాతావరణ ఉష్ణం ఎక్కువగా ఉన్నపుడు, శరీరం ఎక్కువ వేడిని బయటకు ప్రసరించుటలో లోపం ఉంటే ఉష్ణ సంబంధ రుగ్మతలు కలుగుతాయి.

ఉష్ణం శరీరం నుంచి దేహానికి అంటిఉన్న దుస్తులు మొదలగు చల్లని వస్తువులకు వహనం వలన, దేహంపై ప్రసరించు గాలికి సంవహనం వలన, విద్యుత్ అయస్కాంత తరంగాల వికిరణం వలన, చెమట ఆవిరి చెందుట వలన బయటకు ప్రసరించబడుతుంది.

వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినపుడు, కండరాల శ్రమ పెరిగినపుడు, శరీరంలో జీవప్రక్రియ ( మెటబాలిజమ్ ) పెరిగినపుడు స్వేదం ఎక్కువగా స్రవించి ఉష్ణం బయటకు ప్రసరించడానికి, దోహదపడుతుంది. హృదయ వేగం, సంకోచం పెరిగి, హృదయం నుంచి బృహద్ధమని లోనికి ( దేహానికి ) ప్రసరించే రక్తప్రమాణం పెరుగుతుంది. అందుచే చర్మానికి రక్తప్రసరణ పెరిగి ఉష్ణప్రసరణ కూడా ఎక్కువవుతుంది. జీర్ణమండలం, ఇతర ఉదరాంతర అవయవాలలో రక్తనాళాలు ఎక్కువగా సంకోచించడం వలన చర్మానికి రక్తప్రసరణ పెరుగుతుంది. చెమట ఉత్పత్తి ఎక్కువైనపుడు దేహంలో ప్రసరణ రక్తప్రమాణం తగ్గుతుంది. శరీరంలో జల లవణాల ప్రమాణం తగ్గి శోషణ కలుగుతుంది. దేహంలో పుట్టే వేడి ఉష్ణనష్టం కంటె ఎక్కువైనపుడు శరీర అంతర్గత ఉష్ణోగ్రత క్రమముగా పెరుగడం మొదలవుతుంది.

అధిక ఉష్ణం వలన కలుగు స్వల్ప అస్వస్థతలు

[మార్చు]

వడ పొంగు

[మార్చు]

శరీర ఉష్ణం పెరగడం వలన కాళ్ళలో రక్తనాళాలు వ్యాకోచం చెంది, రక్త సాంద్రత పెరిగి కాళ్ళలోను పాదాల లోను పొంగులు కనిపించవచ్చును. చల్లని ప్రదేశాలలో కాళ్ళు ఎత్తుగా పెట్టి పడుకుంటే యీ పొంగులు తగ్గిపోతాయి. మూత్రకారకాలను యీ పొంగులకు వాడకూడదు.

కండరాల పీకులు, నొప్పులు

[మార్చు]

పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు ఆటలు, వ్యాయామం, శ్రమ జీవనాల వలన కండరాలలో పీకులు, నొప్పులు కలుగవచ్చును. [1]ఉదర కుడ్యంలో కండరాలు, తొడల కండరాలు, చేతులలోను, కాలిపిక్కల కండరాలలో యీ నొప్పులు సాధారణంగా కలుగుతాయి. జల, లవణ నష్టాలే కాక నాడీ కండర ప్రేరేపణలు ( న్యూరో మస్కులార్ ష్టిమ్యులై ) యీ నొప్పులకు కారణం కావచ్చు. చల్లటి ప్రదేశాలలో విశ్రాంతి, లవణాలతో కూడిన ద్రవపానాలు, మర్దనాలతో యీ పీకులను నివారించగలం.

చెమట పొక్కులు; చెమట కాయలు

[మార్చు]

ఎండలు, వేడి ఎక్కువయినపుడు చెమట ఎక్కువగా పడుతుంది. [2]స్వేద రంధ్రాలు పూడుకొనిపోతే చెమట స్వేద నాళాలలో యిరుక్కొని ఎఱ్ఱని చెమట కాయలు, పొక్కులు, చీముకాయలు ఏర్పడుతాయి. ఇవి సాధారణంగా వస్త్రాలతో కప్పబడే శరీర భాగాలలో కనిపిస్తాయి. చల్లని ప్రదేశాలకు చేరి, తేలిక దుస్తులు ధరించడం వలన, చర్మపు తేమ తగ్గించుకొనడం వలన చెమట కాయలు తగ్గుతాయి.

వడ సొమ్మ ( ఉష్ణ మూర్ఛ )

[మార్చు]

ఎక్కువసేపు వ్యాయామం చేసినప్పుడు సొమ్మసిల్లడం కలుగవచ్చు. వ్యాయామంలో దేహంలో పుట్టే వేడిమికి శరీరం దూర భాగాలలో ( కాళ్ళు, చేతులలో ) రక్తనాళాలు వ్యాకోచించడం వలన, [1]ఎక్కువ చెమటచే కలిగే జల లవణాల నష్టం వలన, దేహ రక్తప్రమాణం తగ్గడం వలన, రక్తనాళాలలో బిగుతు తగ్గడం వలనను స్థితి సంబంధ అల్ప రక్తపీడనం ( పాష్ట్యురల్ హైపోటెన్షన్ ) కలిగి మెదడుకు రక్తప్రసరణ తగ్గి యీ మూర్ఛ కలుగుతుంది. వెల్లకిల పడుకోబెట్టి కాళ్ళు ఎత్తిపెట్టి ఉంచగానే రక్తపీడనం తేరుకొని వారికి స్మారకం కలుగుతుంది. ఈ స్థితి నుంచి 15, 20 నిముషాలలో పూర్తిగా తేరుకుంటారు. వీరిచే ఉప్పుతో కూడిన ద్రవపదార్థాలను సేవింపజేసి చల్లని ప్రదేశాలలో విశ్రాంతి చేకూర్చాలి. హృదయ సంబంధ వ్యాధులు వలన కూడ అపస్మారక స్థితి కలుగవచ్చును. హృద్రోగ లక్షణాలు, ఆ అవకాశాలు కలవారిలోను, వయస్సు మీఱినవారిలోను హృద్రోగాలకు శోధించాలి .

అధిక ఉష్ణం వలన కలిగే తీవ్ర రుగ్మతలు

[మార్చు]

వడ బడలిక

[మార్చు]

తీవ్ర వ్యాయామం, శారీరక శ్రమ, క్రీడల వలన ఎక్కువయే జీవ ప్రక్రియకు ( మెటబాలిజమ్ ) పరిసరాల అధిక ఉష్ణోగ్రత తోడయితే వడ బడలిక ( హీట్ ఎక్జాషన్ ) కలిగే అవకాశం ఉంది. ఎక్కువ వేడికి చెమట ఎక్కువపట్టి, జల, లవణ నష్టం కలుగుతుంది. ఈ జల లవణ నష్టాలను ఉప్పు ఉన్న పానీయాలతో పూరించకపోతే వడబడలిక కలుగవచ్చు. వడబడలిక కలిగిన వారికి అలసత్వము, నీరసం, ఒళ్ళు తూలడం, ఒంట్లో నలత, తలనొప్పి, [1]వికారం, వాంతులు కలుగవచ్చు. చెమట బాగా పట్టి చర్మం చల్లబడుతుంది. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత 101 - 104 ఫాహ్రెన్ హైట్ ( 38.3 - 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ) వఱకు చేరవచ్చు. వీరు నిలుచున్నప్పుడు రక్తపీడనం బాగా పడిపోవచ్చు. వీరి మానసికస్థితి మాత్రం మారదు. మతిభ్రంశం కలిగితే, శరీర ఉష్ణోగ్రత ఎంత ఉన్నా సరే దానిని వడదెబ్బగానే పరిగణించాలి.

వడబడలిక అయినా, వడదెబ్బ అయినా సంశయం కలిగినపుడు శరీరాంతర ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించేలా ప్రయత్నాలు చెయ్యాలి. [1]రోగులను చల్లని ప్రదేశాలకు చేర్చాలి. ఎక్కువైన దుస్తులు తొలగించాలి. చల్లని నీటి తుంపరలతోను, తడిగుడ్డలతోను, పంకాలతోను దేహం ఉష్ణోగ్రతను 101 ఫాహ్రెన్ హైట్ డిగ్రీలకు తగ్గించే ప్రయత్నం చేయాలి. నోటి ద్వారా గాని, సిరల ద్వారా గాని ఉప్పు గల ద్రవపదార్థాలు ఇచ్చి శోషణ తగ్గించాలి. వెల్లకిల పడుకోబెట్టి కాళ్ళు ఎత్తుగా ఉంచాలి .

వీరికి రక్తకణ పరీక్షలు, జీవప్రక్రియ రక్తపరీక్షలు ( విద్యుద్వాహక లవణాలు సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేటులు ; గ్లూకోజ్, యూరియా నైట్రొజెన్, క్రియటినిన్, కాలేయ వ్యాపార పరీక్షలు, రక్తంలో మయోగ్లోబిన్, మూత్ర పరీక్షలు, రక్త ఘనీభవన పరీక్షలు చేయాలి.

ఉపద్రవాలు

అధిక ఉష్ణోగ్రతల వద్ద జీవోత్ప్రేరకాలు, యితర మాంసకృత్తులు వికృతి పొందే అవకాశం, కణజాలం విధ్వంసం చెందే అవకాశం ఉన్నాయి. అస్థికండర కణవిధ్వంసము ( రేబ్డోమయోలైసిస్ ) జరిగి కండరాల నుంచి మయోగ్లోబిన్ అనే వర్ణకం విడుదల కావచ్చు.

విద్యుద్వాహక లవణాలలో తేడాలు, అస్థికండర కణవిధ్వంసం. కాలేయకణ విధ్వంసం, మూత్రాంగ వైఫల్యం వంటి ఉపద్రవాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్టి పరిణామాలను గమనించి వాటికి తగిన చికిత్స చేయాలి.

వడదెబ్బ ( ఉష్ణఘాతం )

[మార్చు]

వడదెబ్బ ( ఉష్ణఘాతం ) తగిలిన వారిలో శరీరాంతర ఉష్ణోగ్రత ( కోర్ బాడీ టెంపరేచర్ ) [3]104 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ ( 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ) గాని, అంతకు మించి గాని ఉంటుంది. కేంద్రనాడీమండలపు పనితీరులా అవలక్షణాలు కనిపిస్తాయి. వీరిలో శరీర ఉష్ణోగ్రతపై అదుపు లోపిస్తుంది.

వడదెబ్బను అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. త్వరగా చికిత్స చేసినట్లయితే ప్రాణాపాయం నివారించవచ్చు. చికిత్స ఆలస్యం అయినకొలది రోగులు మృత్యువాత పడే అవకాశాలు హెచ్చవుతుంటాయి.

వడదెబ్బ శారీరక శ్రమసహితం గాని, శారీరక శ్రమరహితం గాని కావచ్చును.

ఉపద్రవాలు

శరీర ఉష్ణోగ్రత తీవ్రతరం అయినపుడు శరీరంలో మాంసకృత్తులు వికృతం చెందగలవు. అందువలన శరీరంలో జీవప్రక్రియలు (మెటబాలిజం ) మందగించుటే గాక, అంతర జీవవిషాలు ( ఎండోటాక్సిన్స్ ) కూడా విడుదల అవుతాయి. శరీరంలో తాప ప్రతిస్పందన కూడా మొదలవుతుంది. వివిధ అవయవాలలో అవలక్షణాలు కలిగి అవయవాల పనులు కుంటుపడుతాయి. ఆ అవయవాల వైఫల్యాలు మరణానికి దారి తీస్తాయి.

వడదెబ్బ ( ఉష్ణఘాత ) లక్షణాలు

వడదెబ్బకు గుఱైనవారిలో శరీరాంతర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ గాని అంతకుమించి గాని ఉంటుంది. మానసిక ఆందోళన, అలజడి, గందరగోళం, కలవరం, తలనొప్పి, మూర్ఛలు, స్మృతిభ్రంశం, అపస్మారకం వంటి మానసిక అవలక్షణాలు కలుగుతాయి.

వీరు నేలపై కూలిపోయి కనిపిస్తారు. వీరి చర్మం వేడిగా ఉంటుంది. చెమటలు బాగా పోయవచ్చు. చెమటలు లేనప్పుడు చర్మము పొడిగా ఉండవచ్చు.

వీరిలో గుండె వేగం ఎక్కువగా ఉంటుంది. శ్వాస వేగం హెచ్చయి ఆయాసం పొడచూపవచ్చు. రక్తపీడనం తగ్గుతుంది. వడదెబ్బ ప్రభావం మెదడుపైనా, కాలేయంపైనా ఎక్కువగా ఉంటుంది. చిన్నమెదడుపై కూడా అధిక ప్రభావం ఉంటుంది. శరీర అస్థిరత ( ఎటాక్సియా ) తొలి లక్షణం కావచ్చు.

తీవ్ర జ్వరం , అపస్మారకాలను కలిగించే ఇతర వ్యాధులను దృష్టిలో పెట్టుకున్నా, పరిసరాల ఉష్ణోగ్రత, శారీరక శ్రమ వంటి పరిస్థితుల బట్టి వడదెబ్బను పసిగట్టి వెనువెంటనే వైద్యం సమకూర్చాలి. వ్యాధిగ్రస్థుడు నేలకు కూలబడిన 30 నిమిషాల వ్యవధిలో చికిత్స మొదలు పెడితే మృత్యువును నూటికి నూరు శాతం నివారించవచ్చు. శరీరాంతర ఉష్ణోగ్రత ఆసుపత్రులకు చేరేటప్పుడు 105.8 డిగీలు దాటి ఉన్నవారిలోను, హెచ్చుకాలం తీవ్రజ్వరం ఉన్నవారిలోను మృత్యువు కలిగే అవకాశం 80 శాతం వఱకు ఉండవచ్చు. అందువలన రోగిని చల్లపఱచే ప్రక్రియలు వైద్యాలయాలకు తరలించే ముందే మొదలుపెట్టి మార్గంలో కూడా కొనసాగించాలి.

చికిత్స

[మార్చు]

వడదెబ్బ తగిలిన వారిని వారి [4]ఉష్ణోగ్రత తగ్గించుటకు ( తల తప్పించి మిగిలిన శరీరాన్ని ) చల్లని నీటిలో గాని (50 F), మంచునీటిలో గాని (35.6-41 F) ముంచి ఉంచుట ఉత్తమ మార్గం.

మంచునీటిలో కాని, చల్లని నీటిలో కాని ముంచిఉంచుట అనువు కానప్పుడు చల్లని నీటి తుంపరులు చిమ్ముచు పంకాలతో గాలి శరీరంపై వీచనియ్యాలి. చల్లనీరు, మంచునీరు లభించనపుడు గోరువెచ్చని నీటిని ( 68 F) వాడవచ్చు.

వారి శరీరాంతర ఉష్ణోగ్రతను ఉష్ణమాపకం పురీషనాళంలో ఉంచి కొలవాలి. శరీరాంతర ఉష్ణోగ్రత 101 F డిగ్రీలకు దిగేవఱకు చల్లపఱచే ప్రయత్నాలు కొనసాగించాలి.

తడిగుడ్డలతో కప్పడం, పెద్ద ధమనులు ఉండే చోట్ల ( చంకలు, మెడ, మొలలు వద్ద ) మంచు పొట్లాలు ఉంచడం, పంకాగాలులు, చల్లనీరు జల్లుల వంటి పద్ధతులు కూడ ఉయోగించవచ్చు.

శరీరాన్ని చల్లార్చే ప్రయత్నాలు కొనసాగిస్తూ వ్యాధిగ్రస్థులను అత్యవసర వైద్యాలయాలకు తరలించాలి. వైద్యాలయాలలో శరీరాంతర ఉష్ణోగ్రతను 101 F డిగ్రీలకు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తూ సిరల ద్వారా చల్లని లవణ జలం ఇవ్వాలి.

రక్తపీడనం తక్కువగుట, శ్వాసవైఫల్యం, మూర్ఛ వంటి అత్యవసర పరిస్థితులకు తగిన చికిత్సలు వెనువెంటనా చెయ్యాలి.

[4]దేహం వణుకుతుంటే వణుకును ఆపడానికి కండరాలను సడలించడానికి వైద్యులు బెంజోడయిజపిన్ వర్గానికి చెందిన మందులను వాడుతారు.

జ్వరం తగ్గించే మందులు, డాంట్రొలీన్ వడదెబ్బకు పనిచేయవు.

[3]వడదెబ్బ ప్రాధమిక చికిత్స కొనసాగిస్తూ, వారికి రక్తకణ పరీక్షలు, జీవప్రక్రియ పరీక్షలు; విద్యుద్వాహక లవణాలు, మూత్రాంగాల పరీక్షలు ( యూరియా నైట్రొజెన్, క్రియటినిన్ ), కాలేయపు పనులకు పరీక్షలు, క్రియటినిన్ కైనేజ్, మయోగ్లోబిన్ ప్రమాణాలు, రక్తఘనీభవన పరీక్షలు, మూత్ర పరీక్షలు చెయ్యాలి.

ఇతర ఉపద్రవాలకు చికిత్స

వడదెబ్బకు లోనయిన వారిలో మూత్రాంగముల వైఫల్యము, శ్వాస వైఫల్యము, కాలేయపు అవలక్షణములు, అస్థికండర కణ విధ్వంసము ( రేబ్జోమయోలైసిస్ ), విద్యుద్వాహక లవణ భేదములు, దేహంలో ‘విస్తృతంగా రక్తనాళాలలో రక్తఘనీభవనం’ ( డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులార్ కొయాగ్యులేషన్ ) వంటి అవలక్షణాలు కలిగే అవకాశం ఉంది. ఆయా అవలక్షణాలు కనిపెట్టి తగిన చికిత్సలు చెయ్యాలి.

వడదెబ్బ నుంచి కోలుకున్నవారు కనీసం వారం దినాలు ఎట్టి శ్రమ, వ్యాయామాలలో పాల్గొనకూడదు. పూర్తిగా కొలుకున్నాక చల్లని వాతావరణంలో వ్యాయామం, క్రీడలు, శారీరక శ్రమలలో పరిమితంగా పాల్గొనడం మొదలిడి క్రమంగా కార్యకలాపాలను పెంచవచ్చు.

ఉష్ణసంబంధ వ్యాధుల నివారణ

[మార్చు]

వేడి వాతావరణంలో శ్రమించేవారు, నివసించువారు [5]తఱచు చల్లని ద్రవ పదార్థాలు సేవించాలి. మంచినీళ్ళు, చక్కెరపానీయాలు రెండు మూడు లీటరుల వఱకు సేవించినా, ఉప్పు కూడా ఉన్న పానీయాలను కూడా సేవించుట మేలు. పలుచని, వదులైన, లేతరంగు దుస్తులు ధరించాలి.

వేడి వాతావరణానికి క్రమేణ అలవాటుపడాలి. పరిసర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు శ్రమతో కూడిన పనులు చేయకూడదు. తప్పనిసరి అయితే విరామ సమయాలు తీసుకొని, చల్లని పానీయాలు సేవిస్తూ ఉండాలి. లవణ నష్టాలను కూడా పూరించాలి. మంచినీరు, చక్కెర పానీయాలు మాత్రమే అధికంగా ( మూడు లీటరులకు మించి ) సేవించి, లవణాల నష్టం పూరించకపోతే రక్తంలో సోడియమ్ ప్రమాణాలు తగ్గే అవకాశం ఉంది.

అధిక వాతావరణ ఉష్ణోగ్రతలు కల చోట్ల పనిచేసే వైద్య బృందాలకు ఉష్ణ సంబంధ వ్యాధులను కనిపెట్టుటలోను, నిరూపిత చికిత్సా పద్ధతులలోను తగు శిక్షణ ఇయ్యాలి.

వేసవి తీవ్రత హెచ్చుగా ఉన్నపుడు, వడగాడ్పులు వీచుతున్నపుడు వృద్ధులకు, గృహవసతి లేనివారికి ప్రభుత్వాలు సమాజాలు శీతల వసతి గృహాలను తాత్కాలికంగానైనా ఏర్పాటు చెయ్యాలి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Heat Injury and Heat Exhaustion - OrthoInfo - AAOS". www.orthoinfo.org. Retrieved 2023-05-15.
  2. "Heat rash - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-05-16.
  3. 3.0 3.1 the Washington Manual of Medical Therapeutics. Washington University in St.Louis. 2023. p. 946. ISBN 978-1-975190-62-0.
  4. 4.0 4.1 "Heatstroke - Diagnosis and treatment - Mayo Clinic". www.mayoclinic.org. Retrieved 2023-05-16.
  5. "Heat-Related Illnesses (Heat Cramps, Heat Exhaustion, Heat Stroke)". www.hopkinsmedicine.org (in ఇంగ్లీష్). 2020-02-28. Retrieved 2023-05-16.

వెలుపలి లంకెలు

[మార్చు]