Jump to content

ఎందరో మహానుభావులు (కీర్తన)

వికీపీడియా నుండి
(ఎందరో మహానుభావులు నుండి దారిమార్పు చెందింది)
త్యాగరాజు

ఎందరో మహానుభావులు ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు. ఇది త్యాగరాజ పంచరత్న కృతులులో ఐదవది.

ఈ కీర్తనను ఖరహరప్రియ జన్యమైన శ్రీరాగము, ఆదితాళంలో గానం చేస్తారు.[1]

కీర్తన

[మార్చు]
పల్లవి

ఎందరో మహానుభావులు అందరీకి వందనములు ॥ఎందరో॥

అనుపల్లవి

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనన వారెందరో మహానుభావులు అందరికీ వందనము-లెందరో మహానుభావులు

భారతీయ సంస్కృతి

[మార్చు]

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం. ఎస్. సుబ్బలక్ష్మి, మహారాజపురం సంతానం ఈ కీర్తనను అనేక మారులు గానం చేశారు. త్యాగయ్య (1946) సినిమా కోసం చిత్తూరు నాగయ్య ఈ కీర్తనను గానం చేసి నటించారు.

పూర్తి పాఠ్యం

[మార్చు]

మూలాలు

[మార్చు]