ఎగువ శ్వాసమార్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

                     

                                                                                     

ప్రాణికోటి జీవక్రియలో శ్వాసక్రియ చాలా ముఖ్యం. ఈ క్రియలో ప్రాణవాయువు స్వీకరించబడి, బొగ్గుపులుసువాయువు విసర్జింపబడుతుంది. క్షీరదములలోను, వెన్నెముక గల ఇతరజంతువులలోను, ఇతర పెద్ద జంతువులలోను శ్వాసక్రియను ఊపిరితిత్తులు నిర్వహిస్తాయి. క్షీరదములలో గాలి ఉచ్ఛ్వాసములో ముక్కు ద్వారా దేహములోనికి ప్రవేశించి శ్వాసమార్గము ద్వారా ఛాతిలో ఉన్న ఊపిరితిత్తులకు చేరుతుంది.

శ్వాసమార్గం

నిశ్వాసములో గాలి ఊపిరితిత్తులనుండి శ్వాసమార్గము ద్వారా ప్రసరించి ముక్కు ద్వారా వాతావరణములోనికి విసర్జింపబడుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువును రక్తమునకు చేర్చి, రక్తములోని బొగ్గుపులుసువాయువును విసర్జిస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధులే కాక శ్వాసమార్గములో అడ్డంకులున్నా శ్వాసక్రియకు భంగం కలిగి శ్వాసవైఫల్యం కలిగే అవకాశం ఉంది.

ముక్కు నుండి స్వరపేటిక వఱకు గల శ్వాసమార్గం ఎగువ శ్వాసమార్గం (ఊర్ధ్వశ్వాసపథం/upper airway). స్వరపేటిక నుంచి ఊపిరితిత్తుల వఱకు ఉన్న శ్వాసమార్గం అధో శ్వాసపథం (దిగువ శ్వాసమార్గం/lower airway).

ముక్కు[మార్చు]

ముక్కు ముందు ఉన్న రెండు రంధ్రాలతో (పూర్వ నాసికా రంధ్రాలు/ఏంటీరియర్ నేర్స్ ) వాతావరణంతో అనుబంధం కలిగి ఉంటుంది. ముక్కులో ఉన్న మధ్య గోడ (సెప్టమ్) ముక్కును రెండు భాగాలుగా విభజిస్తుంది. ముక్కు లోపల చెరిపక్కా పక్క గోడలో మూడు నాసికాశుక్తులు (నేసల్ టర్బినేట్స్/ నేసల్ కంఖే) ఒకదాని క్రింద మఱొకటి ఉంటాయి. ఆ శుక్తులు కింద నాసికాకుహరాల (పారా నేసల్ సైనసస్) ద్వారాలు తెరుచుకొని ఉంటాయి.

ముక్కులోపలి భాగములు, త్రిమితీయ చిత్రం

ముక్కు  వెనుక ఉన్న రంధ్రాల (పర నాసికారంధ్రాలు / పోస్టీరియర్ నేర్స్) ద్వారా గొంతుతో కలుస్తుంది. గొంతునే గళం, సప్తపథ అని కూడా పిలుస్తారు. ముక్కుకు నోటికి మధ్య అంగిలి (తాలువు) ఉంటుంది. తాలువు ముందు భాగం కఠినతాలువు. దీనిలో ఎముక ఉంటుంది. తాలువు వెనుక భాగం మృదుతాలువులో ఎముక ఉండదు.                                                  

సప్తపథ ( గళం / ఫారిన్క్స్)[మార్చు]

గొంతు ( గళం;సప్తపథ ) ముక్కును స్వరపేటికతోను, ఊపిరితిత్తులతోను, నోటిని అన్ననాళముతోను కలిపే కండరపు గొట్టం.

ఎగువ శ్వాసపథం

గొంతు లోపలి భాగము శ్లేష్మపుపొరతో కప్పబడి ఉంటుంది[1]. ముక్కు వెనుక రెండు రంధ్రాలు (పర నాసికారంధ్రాలు / పోస్టీరియర్ నేర్స్), మధ్య చెవులను గొంతుతో కలిపే రెండు శ్రవణ గళ నాళికల (యూష్ట్రేషియన్ ట్యూబ్స్) ద్వారాలు, నోటి ద్వారం (వక్త్రద్వారం), స్వరపేటిక, అన్ననాళం, మొత్తం ఏడు మార్గాలు సప్తపథతో కలిసి ఉంటాయి.

నాసికాగళం (నేసోఫారిన్క్స్)[మార్చు]

గొంతు లేక గళంలో మూడు భాగాలు ఉంటాయి. ముక్కు వెనుక మృదుతాలువుకు పైన ఉండే గొంతు భాగం నాసికాగళం[1]. నాసికాగళంలోకి రెండు పక్కలా శ్రవణగళ నాళికల ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ శ్రవణగళ నాళికలు మధ్యచెవులను గొంతుతో కలుపుతాయి. నాసికాగళం ముందు భాగంలో ముక్కు వెనుక రంధ్రాలు (పోష్టీరియర్ నేర్స్) తెరుచుకుంటాయి. వెనుక భాగంలో శ్లేష్మపు పొర క్రింద దళసరి రసికణజాల రాశులు (ఎడినాయిడ్స్) ఉంటాయి.

వక్త్రగళము (ఓరో ఫారిన్క్స్)[మార్చు]

నోటి వెనుక ఉండు గొంతు భాగము వక్త్రగళం . ఈ భాగం అంగిలి ( తాలువు) నుంచి కంఠికాస్థి (హయాయిడ్ బోన్) వఱకు ఉండే గళభాగం[1].

నాలుక, గవదలు, కొండనాలుక,

మృదుతాలువు నుంచి చెరిపక్కా నాలుక మూలానికి ఒకటి, గళానికి ఒకటి  తెరలు (టాన్సిలార్ పిల్లర్స్) క్రిందకి దిగుతాయి. ఈ తెరల నడిమిలో (గళ) రసికణజాల గుళికలు (గవదలు/టాన్సిల్స్) ఉంటాయి. మృదుతాలువు మధ్యభాగం నుంచి కొండనాలుక (ఉపజిహ్వ) గొంతులోనికి వ్రేలాడుతుంది.

అధోగళము (హైపో ఫారిన్క్స్)[మార్చు]

కంఠికాస్థి (హయాయిడ్) నుంచి అన్ననాళ  ప్రవేశద్వారం వఱకు ఉండే గొంతు భాగం అధోగళం[1]. దీనిలో ముందుభాగంలో స్వరపేటిక ఉంటుంది. స్వరపేటికకు మీద నాలుక మూలంలో స్వరపేటికపు మూత (ఎపిగ్లాటిస్) ఉంటుంది. ఆహారాన్ని శ్వాసపథంనుంచి తప్పించి అన్ననాళంవైపు మరలించడానికి ఈ స్వరపేటికపు మూత తోడ్పడుతుంది. స్వరపేటికకు ఇరుపక్కల కాయల ఆకారపు గుంతలు (పైరిఫార్మ్ ఫోసే) ఉంటాయి.

స్వరపేటిక కింద ఉండే ముద్రికా మృదులాస్థి (క్రైకాయిడ్ కార్టిలేజ్) వెనుకను, ముద్రికా గళ నియంత్రణ కండరము (క్రైకోఫెరింజియల్ స్ఫింక్టర్) కిందను, సప్తపథ అన్ననాళంగా కొనసాగుతుంది. ముద్రికా మృదులాస్థి ఉంగరపుటాకారములో ఉంటుంది.

  1. 1.0 1.1 1.2 1.3 Gray, Henry (1995). Gray’s Anatomy, Fifteenth Edition. United States of America: Barnes & Nobles Books. pp. 871–872. ISBN 1-56619-821-6.