ఐస్ పాప్
ఐస్ పాప్ అనేది ఒక పుల్లకు తగిలించిన ఐస్ ముక్క. తెలుగు లో పుల్ల ఐస్ అంటారు.
ఇది పాశ్చాత్యదేశాల్లోనూ ఉంది. అక్కడ దీన్నే ఐస్‌లాలీ లేదా ఐస్‌పాప్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఐసీపోల్, ఐస్‌బ్లాక్ అంటే మొరాకన్లు మాత్రం ఎస్కివో అంటారట. అమెరికాలో మాత్రం పాప్‌సైసిల్ అన్నదే పాపులర్. ఎందుకంటే అది అక్కడ మొదట్లో వచ్చిన బ్రాండెడ్ ఐస్‌ఫ్రూట్. దాంతో అక్కడ ఏ రకం ఐస్‌ఫ్రూట్‌నైనా ఇదే పేరుతో పిలుస్తారు.
చరిత్ర
[మార్చు]పుల్లఐసు పుట్టుక చాలా యాదృచ్ఛికంగా జరిగింది. 1905లో శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన 11 ఏళ్ల ఎప్పర్‌సన్, ఆటాడుకుంటూ ఓ రోజు గ్లాసులో సోడా పోసి పుల్లతో తిప్పుతూ అక్కడే పెట్టి మర్చిపోయాడట. ఆ రాత్రి ఉష్ణోగ్రత శాతం పడిపోవడంతో ఉదయానికి అది గడ్డకట్టేసిందట. దాంతో దానిమీద కాసిని వేడినీళ్లు పోసి బయటకుతీసి ఆ పుల్లతోనే దాన్ని చీకాడట. అదేదో సరదాగా అనిపించడంతో రోజూ అలాగే తినేవాడట. పెరిగి పెద్దయ్యాక తన పిల్లలకు కూడా అలాగే చేసి ఇచ్చేవాడు. వాళ్లకూ బాగా నచ్చడంతో పాప్‌సైసిల్ బ్రాండుతో ఐస్‌పాప్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చాడట. ఆ తరువాత వీటి తయారీకి ప్రత్యేక మెషీన్లూ రావడంతో అనేక రకాల ఐసుఫ్రూట్‌లు వచ్చాయి. ఎక్కువగా పండ్లరసాలు, నీళ్లతోనే వీటిని తయారుచేస్తారు. 2005లో స్నాపెల్ కంపెనీ న్యూయార్క్‌లో 25 అడుగుల ఐస్‌పాప్‌ను తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీనికోసం 17.5 టన్నుల పండ్లరసాన్ని వాడింది.
గత ఏడాది డెల్‌మాంటె కంపెనీ జాతీయ ఐసుక్రీము వారోత్సవం సందర్భంగా జేమ్స్‌బాండ్‌గా ప్రసిద్ధుడైన డేనియల్‌క్రెయిగ్‌ను పోలిన ఐస్‌పాప్‌ను తయారుచేసి అందర్నీ ఆకట్టుకుంది. స్టిక్‌లేకుండా పంచదారనీళ్లు, ఫ్రూట్‌జ్యూసులు లేదా ఫ్లేవర్డ్ కలర్స్‌తో చేసిన పాప్‌లూ వచ్చాయి. వీటిని ప్లాస్టిక్ కవర్లలో సీలుచేసి అమ్ముతారు. వీటినీ ఐస్‌పాప్‌లనే అంటారక్కడ. ఇంట్లో కూడా సులభంగా తయారుచేసుకోవడానికి వీలుగా అనేక ఆకారాల్లో ప్లాస్టిక్ మౌల్డులు వచ్చాయి. అభిరుచి మేరకు వీటిల్లో రకరకాల పండ్లరసాల్ని పోసి స్టిక్ పెట్టి ఫ్రీజర్‌లో పెట్టేస్తే కృత్రిమరంగులు లేకుండా పుల్లఐస్ ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
కుల్ఫీ ఐస్
[మార్చు]ఇది భారత దేశంలోనే అచ్చంగా తయారైన ఐస్ క్రీము. ఇక్కడ నుంచే మధ్యతూర్పు దేశాలకూ పాకింది. ఫ్రిజ్‌లు అంతటా రాకముందు కేవలం రాజకుటుంబాలకే పరిమితమైన డెజర్ట్.
ఇది ఐసుక్రీములా త్వరగా కరిగిపోదు. తక్కువమంటమీద పాలను మరగకాచి అందులో రకరకాల ఫ్లేవర్లను జోడించి మౌల్డ్‌ల్లో పోసి ఐసు, ఉప్పు పోసిన కుండల్లో ఉంచి తయారుచేసేవారు. ఇప్పుడయితే చిక్కదనం కోసం కార్న్‌ఫ్లోర్‌నూ వాడి తయారుచేసి ఫ్రీజ్ చేస్తున్నారు. అప్పట్లో స్పూనుతో మాత్రమే తినే వీలున్న కుల్ఫీ ఇప్పుడు స్టిక్‌లతోనూ మార్కెట్లో విందులు చేస్తోంది. పిస్తా, బాదం, గులాబీ, మామిడి, ఇలాచీ, కుంకుమపువ్వుల ఫ్లేవర్లతోపాటు ఇటీవల యాపిల్, నారింజ, వేరుసెనగ, అవకాడో రుచుల్లోనూ ఇది దొరుకుతోంది. సో... కుల్ఫీ దేశీయ స్టిక్ ఐస్‌క్రీమ్ అన్నమాట.