Jump to content

ఒంగోలు మునిసుబ్రహ్యణ్యం

వికీపీడియా నుండి

ఒంగోలు మునిసుబ్రహ్యణ్యం న్యాయవాది, స్వాతంత్రయ సమరయోధుడు.

ఇతడు 1886 లో నాయుడుపేట లో జన్మించాడు. తండ్రి వెంకటరంగయ్య రెవెన్యూ శాఖలో చిన్న ఉద్యోగి. మునిసుబ్రహ్యణ్యం విజయనగరం కళాశాలలో తమ బంధువు ఒంగోలు పట్టాభిరామమూర్తి ఇంట్లో ఉండి ఇంటర్మీడియట్ చదివాడు. విజయనగరంలో మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి, భోగంవారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఈ రామమూర్తి నాయకుడు. కాలేజీ విద్యార్థిగా మునిసుబ్రహ్యణ్యంకు ఈ పట్టాభిరామమూర్తే ఆదర్శం. మునిసుబ్రహ్యణ్యం తండ్రి ఉద్యోగవిరమణ చేసినతర్వాత, కుమారులను చదివించుకొనే ఆలోచనతో 30 రూపాయల జీతంతో చిన్న ఉద్యోగం సంపాదించుకొని, విజయనగరంలో కాపురం పెట్టాడు. తండ్రికి సహాయంగా ఉంటూ దివాణంలో నెలకు పది రూపాయల ఉద్యోగంచేస్తూ మునిసుబ్రహ్యణ్యం ఇంటర్ చదువు కొనసాగించాడు. గురజాడ అప్పారావు ఈయనచేత దివాణంలో పని మాన్పించి, తనఇంట్లో కూర్చొని శాసనాలనుంచి, ప్రబంధాలనుంచి సంస్థాన చరిత్రకు అవసరమయిన ఆధారాలను సేకరించేపని ఒప్పజెప్పాడు. ఆవిధంగా మునిసుబ్రహ్యణ్యం గురజాడ అభిమానాన్ని సంపాదించాడు.

1907 లో మునిసుబ్రహ్యణ్యం ఇంటర్ పాసయ్యీడు. తర్వాత చదువు కొనసాగించే స్థోమత లేదు. తనను అభిమానించే గురజాడ సంస్థాన వారసత్వ దావాలో తలమునకలయి, ఇతని చదువు విషయం పట్టించుకోలేదు. కాలేజీలో బి. ఏ తరగతులు కూడా మొదలయినాయి. అర్హులయిన పేద విద్యార్థులకు ఉపకారవేతనం ఇచ్చేందుకు పెట్టిన పరీక్ష మునిసుబ్రహ్యణ్యం చక్కగా రాశాడు. ఎంపికయితే నెలకు పదిరూపాయల ఉపకారవేతనంతో తన బి. ఏ చదువు పూర్తవుతుందని ఆశించాడు. ఒకరోజు గురజాడ అప్పారావు మునిసుబ్రహ్మణ్యాన్ని వెంటపెట్టుకొని కాలేజీ ప్రిన్సిపల్ రామానుజాచార్య వద్దకు తీసుకొనివెళ్ళి, మహారాణి ద్వారా అతనికి కాలేజీ ఫీజు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి, తరగతిలో కూర్చొనేందుకు అనుమతి ఇప్పించాడు. మొదటి టర్మ్ ముగుస్తున్నా ఫీజు చెల్లించే ఏర్పాటు జరగలేదు. గత్యంతరం లేని పరిస్థితిలో అతన్ని కాలేజినుంచి పంపించివేయవలసిన పరిస్థితి వచ్చింది. మునిసుబ్రమణ్యం పరిస్థితిని గురాజడకు వివరిచడంతో గురజాడ అతన్ని సంస్థానం ఆఫీసుకు వెంటపెట్టుకొని వెళ్ళి సంస్థానం కోర్టు వ్యవహారాలలో పనిచేసినందుకు 60 రూపాయలు ఇప్పించాడు. ఇదే పద్ధతిలో గురజాడ దివాణంనుచి ఇప్పించిన డబ్బుతో మునిసుబ్రమణ్యం బియే చదువు పూర్తిచేశాడు.విద్యార్థులు బియే పరీక్షలు మద్రాసు వెళ్ళి రాయాలి. గురజాడ సహయంతో మునిసుబ్రహ్మణ్యం పరీక్షలు రాశాడు.

1909జూన్ వరకు ఆరు నెలలు మునిసుబ్రమణ్యం నెల్లూరు వి.ఆర్.హై స్కూల్లో పనిచేశాడు. తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడు మాట సహాయంతో కాకినాడ పి. ఆర్. కాలేజీలో ఇంగ్షీషు ట్యూటరుగా చేశాడు. కాకినాడలో ఉన్న రోజుల్లోనే మిత్రుడు బులుసు సాంబమూర్తి ప్రోత్సాహంతో ఫస్ట్ గ్రేడ్ ప్లీడరు పరీక్ష పాసయి, 1911లో ఒంగోలు కోర్టులో న్యాయవాద వృత్తిలో ప్రవేశించాడు. హోమ్ రూల్, అసహాయ ఉద్యమం విద్యాధికులను కదిలించాయి. తొలిదశలో న్యాయవాదవృత్తిని విడిచిపెట్టిన వారిలో ఒంగోలు మునిసుబ్రమణ్యం ఒకడు. ఒంగోలులో ప్రారంభించిన జాతీయ పాఠశాలలో ఇతను అధ్యాపకుడుగా పనిచేశాడు, ఉద్యమం చల్లారగానే స్కూల్ మూతబడి, విధిలేని పరస్థితిలో మళ్ళీ న్యాయవాద వృత్తిలో ప్రవేశించవలసి వచ్చింది. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు మునిసుబ్రహ్మణ్యానికి నెల్లూరు కలెక్టరు 1922లో నూరు రూపాయలు జుల్మానా విధించాడు.

మూలాలు

[మార్చు]
  • 1.మునిసుబ్రహ్మణ్యం 1935లో గురాజడతో తన అనుభవాలను హిందూ పత్రికలో వ్యాసాలుగా రాశాడు. ( Reminiscences of Gurjada apparao Pantulu) ఈ వ్యాసాలవల్లనే గురజాడకు సంబంధించి, కన్యాశుల్కం గురించి అనేక విషయాలు మనకు తెలిషయాయి.)
  • 2.ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం ఇంగ్షీషు ఆటో బయోగ్రాఫి రాత ప్రతి,
  • 3. మునిసుబ్రహ్యమణ్యంకు గురాజడ లేఖలు,
  • 4. కాళిదాసు పురుషోత్తం పెన్న ముచ్చట్లులో మునిసుబ్రమణ్యం గూర్చి రాసిన రెండు వ్యాసాలు.
  • 5.విక్రమసింహపూరి మండల సర్వస్వం, సంపాదకుడు: ఎన్. ఎస్. కే, నెల్లూరు జిల్లాపరిషద్ ప్రచురణ, 1964.
  • 6.కొందరు నెల్లూరు గొప్పవారు, రచయిత: ఒంగోలు వెంకట రంగయ్య, 1948