ఓరియంటలిజం (పుస్తకం)
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఓరియంటలిజం, రచయిత ఎడ్వర్డ్ సయీద్ 1976 లో రాసిన పుస్తకం.
సయీద్ పాలస్తీనా దేశీయడు, విద్యావేత్త, రచయిత, అనేక విశ్వవిద్యాలయల్లో విజిటింగ్ ప్రొఫెసర్. కొలంబియా విశ్వవిద్యాలయంలో అంగ్లసాహిత్యం బోధించేవారు. ఆయన 2003లో చనిపోయారు. బ్రిటిష్, ఫ్రెంచ్ చరిత్రకారులు, రచయితలు ఈజిప్టు, ఇతర సమీప ప్రాచ్య దేశాలను(నియర్ ఈస్ట్) ఓరియంటల్ (Oriental) దేశాలని, వాటిని గురించి చేసిన రచన లను- చరిత్ర, యాత్రా చరిత్రలు, నవలలు, ఆ దేశపు భాషాసంస్కృతులను, ప్రజలను గురించి రాసిన సమస్త విషయాలను "ఓరియంటలిజం" పేరుతో వ్యవహరించారు. ఈ దృష్టితోచూచినపుడు భారతదేశం కూడా ఈ ఓరియంటలిజం కిందకు వస్తుంది. ఓరియంటలిజం భావన, ఆ రచనలు వలస పాలకులకు ఉపయోగించాయని, పరోక్షంగా స్థానిక ప్రజలను అణచిపెట్టి వలస పాలన కొనసాగించడానికే ఆయా రచయితలు, భాషావేత్తలు, కళావిమర్శకులు సహకరించారని సయీద్ ఈ రచనలో ఆరోపించాడు. కొంతవరకు అది నిజం కూడా. పాలితుల భాష నేర్చుకొని, క్రైస్తవ మత ప్రచారానికి, మరింత పకడ్బందీగా, కట్టుదిట్టంగా స్థానిక తిరుగుబాట్లను అణచివేయడానికి వలసపాలకులు ఉపయోగించుకొన్నారు. రచయిత సమీప ప్రాచ్యానికే పరిమితమైనా, అతని పరిశీలనలు భారతదేశం వంటి అనేక ప్రాచ్యదేశాలకు అన్వయిస్తాయి. ఓరియంట్ గురించి బ్రిటిష్, ఫ్రెంచి, అమెరికా వారి అనుభవాలను మొత్తం ఒక యూనిట్ గా స్వీకరించి, వారి దృష్టిలో అరబ్, ఇస్లాం వేయేళ్ళ చరిత్రను ఒక యూనిట్ గా భావించి పరిశీలించాడు. ఫ్రెంచ్, ఇంగ్లీషు పండితులు పర్షియా, ఈజిప్టు, భారతదేశంలో ప్రాచీన భాషలను, ఆ ప్రాంతాల లిపులను, శాసనాలను అధ్యయనం చేశారు. E.S. Sheffer రచన “Kubla KKhan and the fall of Jerusalam “ఓరియంటలిజం మీద వచ్చిన తొలి గ్రంథాలలో ఒకటి. ఓరియంట్.ని గురించి రచనలు చేసే రచయితల కంఠస్వరం, పాఠకులను సప్రయత్నంగా సంబోధించిన విధానం, అందులో ఇచ్చిన చిత్రాలు, రచయిత ఓరియంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడా? దాని తరఫున మాట్లాడుతున్నాడా? అన్నీ పరిశీలన చేయదగినవే. సాధారణంగా ఓరియంటలిస్టు తనకు పూర్వం వెలువడిన యాత్రాచరిత్రలు, భాషావిషయ అధ్యయనాలు, ఓరియంటల్ 'ఇన్స్టిట్యూట్'ల రికార్డు అన్ని వాడుకుంటాడు. అయితే ఓరియంటలిస్టు ఓరియంట్ కు వెలుపలివాడు. అందుకే ఓరియంటలిజం ఓరియంట్ కు దూరంగా, ప్రధానంగా ఇస్లాంకు, అరబ్బులకు వ్యతిరేకంగా, జూడాయిజం, యూదులపట్ల సానుకూలధోరణి కలిగి ఉంటుంది. పెట్రోలియం చమురు ఆధిపత్యరాజకీయాలు కూడా రచయిత దృక్పథాన్ని నిర్ణయిస్తాయి. అమెరికాలో పాలస్తీనా పౌరుడుగా, అరబ్ గా జీవించడం చాలా బాధాకరంగా ఉంటుందని రచయిత సయీద్ స్వానుభవంతో వివరిస్తాడు. అమెరికా ప్రభుత్వం Zionisam తో కలిసి అడుగులు వేస్తోంది అంటాడు. ఈజిప్టును ఆక్రమించింది దాన్ని ఉద్ధరించడానికే, ఈజిప్టు పౌరుల శ్రేయస్సుకే అని Balflour రాశాడు. ఈజిప్టు దేశాన్ని ఆక్రమించి, వలసగా మార్చడం ఆ ప్రజల శ్రేయస్సుకేనట! 1882లో ఆక్రమణ, 1097తిరుగుబాటు అణచివేసినందుకు ఆ గవర్నరుకు ఏభైవేల పౌండ్ల బహుమతి అన్నీ ఈజిప్టు శ్రేయస్సుకే! పాలితుల భాష, చరిత్ర, సంస్కృతుల పరిజ్ఞానంవల్ల వారిని మరింత సులభంగా, అణచిపెట్టి పాలించడం సులభమవుతుంది అంటాడు సయీద్ ఈ రచనలో. పాలితుల లోటుపాట్లు, పరిమితులు, వారిజాతి, చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, సమాజం గురించి తెలుసుకోవడం వల్ల పాలన ‘సంతృప్తి’గా సాగడాన్ని ఓరియంటలిజం గా సయీద్ అభివర్ణించాడు. యూరోపియన్ల ప్రకారం ప్రాచ్యదేశాలవారు మూర్ఖంగా, శిశువులమాదిరి ప్రవర్తించేవారు, పతితులు, తమకన్నా వేరుగా ఉంటారు. తమలో సకల సుగుణాలు, పరిణతమయిన మస్సు, సహజ ప్రవర్తన ఉంటాయని, తాము 'original' అని భావించుకొంటారు. వాళ్ళు ప్రాచ్య దేశాలు బలహీనంగా, పడమట దేశాలు బలంగా ఉన్న సమయంలో ఈ భావనలు కల్పించుకొన్నారు. ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్న ప్రాంతాల్లో 'ఓరియంట్' ఫ్రెంచి, ఇంగ్లీషువారికి ఎదురైంది. ఈ పరిస్థితుల్లో యూరోపియన్లు ఓరియంట్ ను నిర్వచించారు. పాశ్చాత్యుల ఆధిక్యతకు ప్రాచ్యదేశాలవారి “ఆత్మన్యూనత”కు తేడానే “ఓరియంటలిజం”అని అభివర్ణించారు. మరోరకంగా చెప్పాలంటే తమ గతంనుంచి తాము వారసత్వంగా పొందిన భావనలే యూరోపియన్లు ఓరియంటలిజంగా భావించారు. అయితే ఓరియంట్ కూడా ఆక్సిడెంట్.ను ప్రభావితం చేసిన సంగతి సయీద్ గుర్తు చేస్తాడు. మత ప్రచారకులు, బైబిలు పరిశోధకులు, ఇస్లాంను అధ్యయనంచేసే విద్వాంసులు, సెమిటిక్ భాషలు అధ్యయనంచేసే పండితులు, చైనా భాషా సంస్కృతులను పరిశీలించే పండితులు, భారతదేశంలో సంస్కృతం చదివిన విలియం జోన్స్ వంటివారు, విక్టర్ హ్యూగో, గెథె, Nerval, Floubrant, Fitzgerald తొలి ఓరియంటలిస్టులు, వీరి రచనలు అందుకు ఆధారాలు. తమ దేశాలుకాని, తమవికాని ప్రదేశాల్లో నివసించే ప్రజలను బార్బేరియన్లని, ఆదిమానవులని, క్రూరులైన ప్రజలు నివసించే ప్రాంతాలని ఏకపక్షంగా యూరోపియన్లు తీర్మానించారు. ఈ విభజన ఏకపక్షంగా ఏర్పరిచింది. క్రైస్తవ ప్రపంచ దృక్పథం ముస్లింలపట్ల, ఓరియంటల్ ప్రజలపట్ల స్థిరపరచిన అభిప్రాయాలను ఎవరూ సరిచేయలేకపోయారు. ఈజిప్టును, ఆ పరిసర దేశాలను మాత్రమే యూరోపియన్లు నియర్ ఓరియంట్ అన్నారు, ఇస్లాంను “Mohamaden” అని అగౌరవంగా పిలిచారు. ఓరియంటలిజం ఒకరకమైన పొరపాటు అవగాహన, తప్పు చైతన్యం, భావన, 'paranoiea' అంటాడు సయీద్. సూయజ్ కాలువ ఏర్పడడంతో యూరప్ కు సమీప ప్రాచ్యం-నియర్ ఈస్టుతో రాకపోకలు, సంబంధాలు, సైన్యాల కదలికలు, ఆసియాలో వారి వ్యాపారాలు సజావుగా సాగేందుకు పరిస్థితులు అనుకూలించాయి. 'వెస్టు' ఇక శాశ్వతంగా ప్రాచ్య దేశాలలలో తిష్ఠవేసింది. యాత్రా చరిత్రలు, పుస్తకాలు అన్నీ ఓరియంటల్ సంప్రదాయంలో రాసాగాయి. 19వ శతాబ్ది చివరకు ఓరియంటలిజం భావన పరిపూర్ణత పొందింది. యూరప్ విస్తీర్ణవాదంతో మతప్రచారకులు బహిరంగంగానే చేయికలిపారు. విద్యాసంస్థలు నెలకొల్పడం ఈ ప్రణాళికలో భాగమే. ఇక యూరప్ వాసులు అధిక సంఖ్యలో మిషన్ లు, ఫ్యాక్టరీలు, కౌన్సిలర్ ఆఫీసులునెలకొల్పి ఆసియా దేశాలలో స్థిరపడ్డారు. ఇస్లాంను "టెంట్ అండ్ ట్రైబ్" గా మార్చి పరిహాసప్రాయంచేశారు. నిఘంటు నిర్మాణం, వ్యాకరణరచన, అనువాదం, cultural decoding, వగైరా కార్యక్రమాలద్వారా "ఓరియంటలిస్టు”, ఓరియంట్” అనామకంగా మారకుండా దాన్ని కాపాడుతున్న హీరోలుగా తమను తాను భావించుకొన్నారు పశ్చిమ దేశాలవారు. ఈ క్రమంలో ఓరియంటలిజం శాస్త్రం సమూలమైన పరివర్తనం చెందింది. Massignon వంటి కొందరు నిజమైన ఓరియంటలిస్టులు ఈ రంగంలో గొప్ప కృషిచేశారు. ఇతరేతర ప్రాచ్యదేశాల భాషా సంస్కృతుల పరిజ్ఞానం లేకపోతే Classical Originalism ప్రాచ్యదేశాలను అర్ధం చేసుకోడానికి సరిపోదని మాసిగ్నాన్ అంటారు. “The essence of the difference between East and West is between modernity and ancient tradition” అని ఆయన ఒక్క మాటలో తేల్చారు. ముస్లింలు నలుగురు స్త్రీలను పెళ్ళాడడం, ఒక్కపొద్దులు, విందులు వీటికే ఇస్లాంను ఓరియంటలిస్టులు పరిమితం చేశారు. ఏవో కొన్ని మతగ్రంథాలను బట్టి, మొత్తం ఇస్లాంను అంచనా వేయడాన్ని సయీద్ తప్పు పట్టాడు. Islam rarely studied, rarely researched, rarely known అంటాడు. ఇస్లాం గురించి, అరబ్బులగురించి, ప్రాథమిక సమాచారం ఆధారంగా మూసరచనలు వచ్చాయని సయీద్ అంటాడు. Cambridge History of Islam ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. అవాస్తవాలు, వక్రీకరణలు, పరస్పర విరుద్ధ అంశాలను అతను వివరంగా తన పుస్తకంలో ఉదాహరించాడు. అరబ్బుల సమాజం చలనరహితమైనదని, అరబ్బీభాష తక్కువగా అభివృద్ధి చెందిన భాషని, వెనుకపడినవారి ఆలోచనలను ఆ భాష తెలియజేస్తూందని, ఆ భాష ఆలోచనలను నియంత్రణ చేస్తుందని ఇంకా రకరకాలుగా రాశారు. ముస్లింలపట్ల, అరబిక్ భాష, సమాజాలపట్ల ఉన్న అనేక అశాస్త్రీయ విషయాలను ఎడ్వర్డ్ సయీద్ తన పరిశోధన గ్రంథంలో ఖండించి, ఓరియంటలిజం పేర పాశ్చాత్య సమాజం సృష్టించిన కాల్పనిక దృక్పథాన్ని తిప్పికొట్టి కొత్త దృష్టిని కలిగించాడు. సి.పి.బ్రౌన్, కాలిన్ మెకంజీ, ఇతర ఇంగ్లీషు భాషా వేత్తలు, పరిశోధకులు, మిషనరీలు, ఇంగ్లీషు చరిత్రకారులు, యాత్రాచరిత్రలు రాసిన వారి గ్రంథాలను ఈ దృష్టితో మరొకసారి పరిశోధించ వలసిన అవసరం, పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సయీద్ ఈ గ్రంథంలో ప్రతిపాదించాడు.