Jump to content

పట్కర్

వికీపీడియా నుండి
(కత్రి నుండి దారిమార్పు చెందింది)

పట్కర్‌ కులస్థులను ఖత్రీ అని కూడా అంటారు. వీరు మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌, కర్నూలు, మెదక్‌ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తారు.

చరిత్ర

[మార్చు]

పూర్వ కాలపు క్షత్రియ తెగకు చెందినవారు వీరు. పట్టు చీరలు నేయటంలో వీరి పూర్వీకులకు సాటి మరొకరు లేరట!

సామాజిక జీవితం, వృత్తి

[మార్చు]

రాఖీలు, గణేష్‌ మాలలు, నెక్లెస్‌ తాళ్లు, మొలదారాలు... వంటివి తయారుచేయటం వీరి కులవృత్తి. ఇప్పటికీ కంచిలో వీరి సామాజిక వర్గంవారు నేసిన పట్టు చీరలకు మంచి డిమాండ్‌ ఉంది. కాగా తెలంగాణ ప్రాంతంలోని వారు మాత్రం వలసలు పట్టారు. ముంబై, షోలా పూర్‌, భివాండి వంటి పట్టణాలకు వెళ్ళి జీవనం గడుపుతున్నారు. పట్కర్‌ కులస్థులు పట్టు, దారం వంటి ముడి సరుకు తీసుకొచ్చి గణేష్‌ మాలలు, రాఖీలు, నెక్లెస్‌ తాళ్లు వంటివి తయారు చేస్తుంటారు. ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకున్నవారు ఇతర వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందారు. హైదరాబాద్‌ బేగంబజార్‌ లోని కాస్మాటిక్‌ వ్యాపారంలో ఈ కులం వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. చీరలకు వేసే ఫాల్సు, జాకెట్‌ లేసులు, వర్క్ శారీస్ (చీరలపై చేతి కళలు) ‌ వ్యాపారులలో కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.

విద్య

[మార్చు]

వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందారు చదువుపై దృష్టి పెట్టారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూరులో ఈ కులస్థులు మగపిల్లలను డిగ్రీ వరకు, ఆడపిల్లలను కనీసం ఇంటర్‌మీడియట్‌ వరకు చదివించుకోవా లనే నియమం పెట్టుకున్నారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కనుకనే అక్కడ విద్యావంతుల సంఖ్య పెరగటంతోపాటు విదేశాలకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.. ముఖ్యంగా హిందీ పండిట్లుగా పనిచేసినవారు విద్య ప్రాధాన్యతను గుర్తించి తమ కులంవారిని చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. కనుకనే నేడు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నవారిలో ఎంబిఎ పూర్తి చేసిన యువకులూ ఉన్నారు. పైగా వీరి కుల సంఘం కూడా పై చదువుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాదీ దసరా సమ్మేళనాలలో బంగారు, రజిత పతకాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. పాఠశాలల పునః ప్రారంభంలో కూడా పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించి, పుస్తకాలు అందజేస్తోంది. హైదరాబాద్‌లోని రహిం పురాలో బాలికల జూనియర్‌ కళాశాల కోసం వీరి సంఘం భూమి కూడా కొనుగోలు చేసింది. చదువుకున్నవారిలో ఎక్కువమంది ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు.

వ్యాపారం

[మార్చు]

మరికొందరు వ్యాపారాన్ని ఎంచుకున్నారు. కాగా కుల వృత్తిని నమ్ముకున్నవారికి 365 రోజులూ చేతినిండా పని వుంటుంది కనుక మరో వ్యాపకం పెట్టుకోవట్లేదు. పెళ్ళిళ్ల సీజన్‌ వచ్చిందంటే పెళ్ళి పత్రికలకు అవసరమైన చంకీ తాళ్లు, ఇతర సరుకును అందిస్తారు. నెక్కెస్‌ తాళ్లు ఆర్డర్ల ప్రకారం చేసిస్తారు. రాఖీల విషయానికి వచ్చేసరికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పు డు తయారు చేసి పెట్టుకుంటారు. అయితే ఈ రాఖీల తయారీలో మాత్రం సృజనాత్మకత చూపాలి. పాత మోడల్స్, డిజైన్లు చేస్తే మాత్రం అమ్ముడుపోవు కనుక పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. వీరు తాము తయారు చేసేవాటికోసం సూరత్‌, బరోడా, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముడి సరుకు తెచ్చుకుంటారు. కనీసం లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఆ విధంగా పెట్టుబడి పెట్టలేనివారు తమ స్థాయికి తగ్గట్టుగా ముడిసరుకును స్థానికంగా కొనుగోలు చేసి తయారు చేస్తుంటారు.

రాజకీయాలు

[మార్చు]

పట్కర్‌ కులానికి రాజకీయ ప్రాధాన్యం అసలు లేదు.

మూలాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పట్కర్&oldid=2888057" నుండి వెలికితీశారు