కప్పలు (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్‌
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పదివేలు జేరుగదరా సుమతీ!

తెప్పలుగా చెరువు నిండితే కప్పలు చేరినట్టు, సంపద సమకూరినంతనే బంధువులు రాబందులుగా ఇంటికి చేరతారనే సుమతీ శతకంలోని పద్యం ఆధారంగా ఆచార్య ఆత్రేయ 60 ఏళ్ల క్రితం రూపొందించిన సాంఘిక నాటకం కప్పలు ఇది పైకి సాధారణంగా కన్పించేది. కానీ అంతర్లీనంగా పెట్టుబడిదారీ వ్యవస్థ దుష్ఫలితాలను ఆనాడే అతి సులభంగా చర్చిస్తుంది. కాబట్టే ఈ నాటకం సంచలనం సృష్టించడంతోపాటు సర్వకాలీన సర్వజనీయమై కూర్చున్నది.

మనిషి సంపాదించిన డబ్బు చివరకు ఆ మనిషినే మింగేస్తుందన్న భయం వెంటాడుతూ ఉంటే ఆ మనిషికి ఎలా ఉంటుంది? ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదు? తన భవిష్యత్తు ఏమిటి? ప్రాణప్రదంగా పెంచుకునే వారి భవిష్యత్‌ ఏమిటి? బంధువులైనా, మిత్రులైనా తమ ఆస్తులు కాజేయటానికి వస్తున్నారని తెలిసినా వారిని కాదనలేక వారి మధ్యనే అనుక్షణం అప్రమత్తతో జీవించడం ఎంతటి నరకం? ఆస్తి సంబంధాలు మానవ సంబంధాలను కబళిస్తున్నప్పుడు మనిషి స్వచ్ఛంగా ప్రేమతో జీవించడం సాధ్యమా? ఇలాంటి ప్రశ్నలన్నింటినీ నాటకం లేవనెత్తుతుంది. అంతేగాక ఒకవైపు సంపద పెరుగుతుంటే మరోవైపు దారిద్య్రం, బీదలపాట్లు అనివార్యంగా పెరుగుతాయనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఆనాడు సూక్ష్మస్థాయిలో ఉన్న ఈ విపరిణామాలు కుటుంబాలను, రంగాలను, సంస్థలను, గ్రామాలనే గాక చివరకు దేశాలను కూడా ఎలా ఆక్రమిస్తున్నాయో రోజూ మనం పత్రికలో మీడియాలో చూస్తూనే ఉన్నాం.

ఆర్థిక ప్రయోజనాలు ఆధారంగా నిర్మించుకునే కృత్రిమ, కుహనా మానవ సంబంధాలు ఎంత సహజంగా చలామణి అవుతున్నాయో నాటకం తేటతెల్లం చేస్తుంది. ఆధునిక తెలుగు నాటక రచనా విధానానికి ఆత్రేయ అగ్రశ్రేణిలో ఉన్నట్టు రుజువు అవుతుంది. ఇంతటి విషయాన్ని సులభశైలి, తక్కువ పాత్రలతో, తక్కువ సమయంలో, అర్థవంతమైన సంభాషణా చాతుర్యంతో, నాటక లక్షణాలతో పగడ్బంధీగా నిర్మిస్తాడు.

పాత్రలు

[మార్చు]
  • శ్రీపతి
  • కమల - శ్రీపతి కూతురు
  • పంకజమ్మ
  • భద్రయ్య
  • జగ్గయ్య
  • చలపతి - జగ్గయ్య కొడుకు
  • నారయ్య - నౌకరు

సంక్షిప్త కథ

[మార్చు]

శ్రీపతి ఓ ధనవంతుడు. అతను ఆ ఆస్తిని సక్రమంగా సంపాదించాడో, అక్రమంగా సంపాదించాడో ఎవరికీ తెలియదు. చిన్నప్పుడు అల్లరిచిల్లరిగా తిరిగే శ్రీపతి, యువకుడిగా ఉన్నప్పుడు ఓ అమ్మాయిని తీసుకుని పారిపోతాడు. వారికి కూతురు పుట్టిన తర్వాత ఆమె చనిపోతుంది. అప్పటి నుండి శ్రీపతే తల్లీతండ్రీ అయి ఆ కూతుర్ని అపురూపంగా పెంచుకుంటాడు. ఊరిచివర ఒక బంగళా కట్టుకుని కార్లతో, నౌకర్లతో దర్జాగా బ్రతుకుతుంటాడు. ప్రక్కనే చెరువు ఉంటుంది. కప్పల బెకబెకలతో నాటకం ప్రారంభం అవుతుంది.

యుక్త వయసురాలైన శ్రీపతి కూతురు కమలను తన పెద్ద కొడుకుకు చేసుకోవాలనే తలంపుతో పంకజమ్మ తన భర్త, పిల్లవాడితో సహా ఆ ఇంట్లోకి చేరుతుంది. అలాగే భద్రయ్య అనే వ్యక్తి, తన పదహారేళ్ల కూతుర్ని శ్రీపతికి ఇచ్చి పెళ్ళి చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంట్లో తిష్టవేస్తాడు. శ్రీపతి ఆస్తి కోసమే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని వీరు ఆ ఇంటిలో పాగా వేశారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

శ్రీపతికి ప్రాణ స్నేహితుడ్ని అని చెప్పుకునే జగ్గయ్య కొడుకు చలపతి - కమల ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. చలపతి కమల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడా? లేక అందరిలాగా ఆస్తి కోసమే ప్రేమిస్తున్నాడా? అనేది శ్రీపతి అనుమానం. చలపతి ప్రేమలో నిజాయితీ ఎంతన్నదీ కమలకూ భయమే. శ్రీపతి ఈ వయసులో వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుని, తండ్రి తనకు దూరమై పోతాడేమోనన్న భయం కూడా కమలను వెంటాడుతుంది. ఇలా ఎవరి ఆలోచనలు భయాలు వారివి. అలాగే ఎవరి ఎత్తులు వారివి. వీటన్నిటి మధ్య నాటకం రసవత్తరంగా, హాస్యభరితంగా సాగుతుంది.

శ్రీపతి పుట్టిన రోజునాడు బంధువులందరికీ కానుకగా డబ్బు పంచుతాడు. ఆ డబ్బు దొంగనోట్లు అని తెలుసుకుని శ్రీపతిని అరెస్టు చేయడానికి పోలీసులు వస్తారు. తన దగ్గర ఉన్న దొంగనోట్లు ముద్రణ అచ్చుయంత్రాన్ని ఒకరోజు ఎవరైనా దాచి కాపాడితే తాను ఈ గండం నుండి బయట పడగలనని శ్రీపతి అంటాడు. దాంతో బంధువులంతా ఎక్కడివాళ్లు అక్కడే గప్‌చిప్‌ అంటూ మాయమైపోతారు.

శ్రీపతిని గట్టెక్కించడానికి మాత్రం నౌకరు నారయ్య, నిజాయితీగా ముందుకొస్తాడు. అయితే ఇది అంతా బంధువుల నిజస్వభావం బయట పెట్టడానికి శ్రీపతి, గోపాలం అనే యువకుడితో కలిసి ఆడిన నాటకం అని చివర్లో చెప్పడంతో సుఖాంతమవుతుంది. ఓస్‌ నాటకమా? ఇది అని బంధువులు యధాప్రకారం మరలా ఇంట్లో తిష్ట వేయడం, కప్పలు చివరకు బావురుమంటూ ఉండడం కొసమెరుపు.

అభిప్రాయాలు

[మార్చు]

కళా తపస్వి డా|| గరికపాటి రాజారావు సహచరులు, మిమిక్రీ సృష్టి నెరెళ్ల వేణుమాధవ్‌ ఈ నాటకాన్ని ప్రత్యేకంగా చూసి 1954లో విజయవాడలో తొలి ప్రదర్శన చూసి ఎంతో అనుభూతి పొందానో ఇప్పుడు అదే అనుభూతి పొందానని తెలిపారు. జీవితాన్ని ప్రతిబింబించడానికి, నడిపించడానికి, సాంఘిక నాటకంలో ఎంత అవకాశం ఉందో, అంతటి అవకాశాన్ని సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించడానికి కృషి చేసిన నాటక రచయిత ఆత్రేయ' అని ఆయన కొనియాడారు.

ప్రదర్శనలు

[మార్చు]

బి. నారాయణ దర్శకత్వంలో రసరంజని, హైదరాబాదు‌ ఇటీవల ప్రదర్శించిన ఈ నాటకంలో అందరూ పాత్రోచితంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.