Jump to content

కమర్లింగ్ ఓన్స్

వికీపీడియా నుండి
Heike Kamerlingh Onnes , కమర్లింగ్‌ ఓన్స్

Heike Kamerlingh Onnes , కమర్లింగ్‌ ఓన్స్

అతివాహకతను ఆవిష్కరించినవాడు - పదార్థాలలో ఉన్న ఒక ధర్మాన్ని ఓ శాస్త్రవేత్త ఆవిష్కరించాడు... ఆ పరిశోధన ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణగా పేరొందింది... అనేక రంగాల్లో ఉపయోగపడుతూ మానవ జీవితాలను మలుపుతిప్పింది... ఆ ధర్మం 'అతి వాహకత' అయితే, దాన్ని కనిపెట్టిన వాడు కమర్లింగ్‌ ఓన్స్‌.

విద్యుత్‌ ప్రవాహమంటే ఎలక్ట్రాన్‌ల ప్రవాహం. ఎలక్ట్రాన్లు దాదాపు అన్ని పదార్థాల ద్వారా ప్రయాణిస్తాయి. కానీ కొన్ని పదార్థాలలో ఎక్కువగాను, కొన్నింటిలో తక్కువగాను వీటి ప్రవాహం ఉంటుంది. దీనికి కారణం పదార్థాలలోని పరమాణువుల ప్రకంపనాలే. ఈ ప్రకంపనాలు ఎలక్ట్రాన్ల ప్రయాణాన్ని అడ్డుకుంటాయి. ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు పయనించే పదార్థాలను ఉత్తమ వాహకాలని, అతి తక్కువ సంఖ్యలో పయనించే వాటిని అధమ వాహకాలని అంటారు. అయితే కొన్ని పదార్థాల ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తే, పరమాణువుల ప్రకంపనాల తీవ్రత తగ్గి అధమ వాహకాలు కూడా ఉత్తమ వాహకాలుగా మారతాయి. ఇలాంటి పదార్థాలనే 'అతివాహకాలు' అనీ, ఈ ధర్మాన్ని 'అతివాహకత' (Super conductivity) అనీ అంటారు.

అతివాహకాల వాడకం వల్లనే విద్యుత్‌ యంత్రాలు, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లలో విద్యుత్‌ ప్రసార నష్టాలు తగ్గిపోయాయి. అణువిద్యుత్‌లో ఉత్పత్తి వ్యయం అందుబాటులోకి వచ్చింది. పరిశోధనలు, పరిశ్రమల్లో ఉపయోగపడే విద్యుదయస్కాంతాల తయారీ సాధ్యమైంది. వైద్యరంగంలో ఉపయోగపడే ఎమ్మారై స్కానర్‌, కంప్యూటర్లలో మైక్రోప్రాసెసర్లు, అయస్కాంత రైళ్లు ఇవన్నీ పని చేసేది ఈ ధర్మం ఆధారంగానే. అతివాహకతను కనుగొన్న డచ్‌ శాస్త్రవేత్త కమర్లింగ్‌ ఓన్స్‌ 1913లో నోబెల్‌ బహుమతిని పొందారు.

నెదర్లాండ్‌లోని గ్రోవిజన్‌లో 1853 సెప్టెంబర్‌ 21న పుట్టిన ఓన్స్‌ పాతికేళ్లకల్లా భౌతికశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ, ఆపై ఏడాదే డాక్టరేట్‌ సాధించాడు. లెయిడన్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరి అక్కడి ప్రయోగశాలను ప్రపంచంలోనే అతి పెద్ద క్రయోజెనిక్‌ (అతిశీతలీకరణ) కేంద్రంగా మార్చాడు. శీతలీకరణ విధానాల ద్వారా అతివాహకాలుగా మారే 26 పదార్థాలను గుర్తించాడు. పరమశూన్య ఉష్ణోగ్రత(Absolute Zero అంటే సుమారు మైనస్‌ 273 డిగ్రీల సెల్షియస్‌)కు దగ్గరగా 0.9 కెల్విన్‌ వరకు ఉష్ణోగ్రతను తగ్గించి హీలియం వాయువును ద్రవ రూపంలోకి మార్చిన తొలి శాస్త్రవేత్త ఆయనే. ఆ రోజుల్లో అదే భూమిపై సాధించిన అత్యల్ప ఉష్ణోగ్రత. పాదరసం 4 కెల్విన్ల వద్ద, తగరం 3.7 కెల్విన్ల వద్ద, సీసం 7.2 కెల్విన్ల వద్ద అతివాహకాలుగా మారతాయని నిర్ధరించాడు. అనేక పతకాలు, అవార్డులు పొందిన ఓన్స్‌ గౌరవార్థం చంద్రుడిపై ఒక క్రేటర్‌కు ఆయన పేరు పెట్టారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు