Jump to content

కమలాక్షు నర్చించు (పద్యం)

వికీపీడియా నుండి

పద్యం

[మార్చు]

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణునాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;

తే. దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి...భా. 7-169-సీ.

kamalAkshu narciMcu karamulu karamulu; SrInAthu varNiMcu jihva jihva
sura rakshakuni jUcu cUDkulu cUDkulu; SEshaSAyiki mrokku Siramu Siramu
vishNu nAkarNiMcu vInulu vInulu; madhuvairi davilina manamu manamu
bhagavaMtu valagonu padamulu padamulu; purushOttamuni mIdi buddhi buddhi

dEvadEvuni jiMtiMcu dinamu dinamu
cakrahastuni brakaTiMcu caduvu caduvu
kuMbhinIdhavu jeppeDi guruDu guruDu
taMDri! hari jErumaniyeDi taMDri taMDri!

టీకా

[మార్చు]

కమలాక్షునర్చించు - కమలాక్షున్ = నారాయణుని {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అర్చించు = పూజించెడి; కరములు = చేతులే; కరములు = చేతులు; శ్రీనాథు - శ్రీనాథున్ = నారాయణుని {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవికి) నాథుడు (భర్త), విష్ణువు}; వర్ణించు = స్తోత్రముచేసే; జిహ్వ = నాలుకే; జిహ్వ = నాలుక; సురరక్షకునిఁ జూచు - సురరక్షకునిన్ = నారాయణుని {సురరక్షకుడు - సుర (దేవతలకు) రక్షకుడు, విష్ణువు}; చూచు = చూచెడి; చూడ్కులు = చూపులే; చూడ్కులు = చూపులు; శేషశాయికి - శేషశాయి = నారాయణుని {శేషశాయి - శేష (ఆదిశేషుని)పై శాయి (శయనించువాడు), విష్ణువు}; కిన్ = కి; మ్రొక్కు = నమస్కరించెడి; శిరము = తలయే; శిరము = తల; విష్ణు నాకర్ణించు - విష్ణున్ = నారాయణుని {విష్ణువు - సర్వమునందు వ్యాపించువాడు, హరి}; ఆకర్ణించు = వినెడి; వీనులు = చెవులే; వీనులు = చెవులు; మధువైరిఁ దవిలిన - మధువైరిన్ = నారాయణుని {మధువైరి - మధు యనెడి రాక్షసుని వైరి (శత్రువు), విష్ణువు}; తవిలిన = లగ్నమైన; మనము = చిత్తమే; మనము = చిత్తము; భగవంతు - భగవంతున్ = నారాయణుని; వలగొను = ప్రదక్షిణలుచేసే; పదములు = అడుగులే; పదములు = అడుగులు; పురుషోత్తమునిమీఁది - పురుషోత్తముని = నారాయణుని {పురుషోత్తముడు - పురుషులందరిలోను ఉత్తముడు, విష్ణువు}; మీది = మీదగల; బుద్ధి = తలపే; బుద్ధి = తలపు. దేవదేవుని = నారాయణుని {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; చింతించు = ధ్యానించు; దినము = రోజే; దినము = రోజు; చక్రహస్తునిఁ బ్రకటించు - చక్రహస్తుని = నారాయణుని {చక్రహస్తుడు - చక్రాయుధము హస్తుడు (చేతిలోగలవాడు), విష్ణువు}; చదువు = చదువే; చదువు = చదువు; కుంభినీధవుఁ జెప్పెడి - కుంభినీధవున్ = నారాయణుని {కుంభునీధనువు - కుంభినీ (భూదేవి కి) (వరాహాతారమున) ధవుడు (భర్త), విష్ణువు}; చెప్పెడి = చెప్పెడి; గురుఁడు - గురుడు = గురువే; గురుడు = గురువు; తండ్రి = తండ్రి; హరిఁ జేరు మనియెడి - హరిన్ = నారాయణుని; చేరుము = చేరుము; అనియెడి = అనెడి; తండ్రి = తండ్రియే; తండ్రి = తండ్రి.

తాత్పర్యం

[మార్చు]

నాన్నగారు...... పద్మాక్షుని పూజించే చేతులు మాత్రమే చేతులు అన దగ్గవి. లక్ష్మీశుని కీర్తించే నాలుకే నాలుక అన దగ్గది. దేవేశుని చూసే చూపులనే చూపు లనవచ్చు. నారాయణుని మొక్కే శిరస్సు మాత్రమే శిరస్సు. హరిని వినిపించే చెవులే చెవులు. మాధవుని యందు లగ్న మయ్యే మనస్సు మాత్రమే మనస్సు అన దగ్గది. భగవంతునికి ప్రదక్షిణలు చేసే అడుగులే అడుగులు. ఆదిపురుషుని మీద లగ్న మయ్యే బుద్ధిమాత్రమే సద్బుద్ధి. పరదేవతను ధ్యానించే రోజు మాత్రమే మంచిరోజు. చక్రపాణిని తెలియజెప్పేది మాత్రమే అసలైన విద్య. విశ్వంభరుని వివరించే వాడే సద్గురువు. వైకుంఠుని దగ్గరకు పొమ్మనే వాడే మంచి తండ్రి. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.

బాహ్య లింకులు

[మార్చు]