కలశపూజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కలశ పూజ అనగా భగవంతుని పూజించే టప్పుడు ఉపయోగించే జలాన్ని కలశంలో ఉంచి దానిని పవిత్రత గావించేందుకు చేసే పూజ. పూజ చేసేటప్పుడు పుణ్యతీర్థంలో లబించే జలం తీసుకుంటే మంచిది. కానీ అన్ని చోట్లా అలాంటి జలం లభించదు. కనుక భక్తులకు సమీపంలో ఉన్న జలాన్ని తెచ్చి ఒక చెంబు (కలశం) ఉంచి దానిని పూజ చేస్తారు. దేవతలను ఆహ్వానించుట ద్వారా ఆ జలమును పవిత్రీకరణ గావించి భగవంతుని ఉపచారంలో వాడుకుంటారు.[1]

ఎదురుగా మనం అర్పించబోతున్నది 14 లోకాలను వ్యాపించి వున్న విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ చిన్న చెంబునీళ్లు చాలవు. కనుక ఎదురుగా చిన్న విగ్రహంలో అనంతమైన పరమాత్మను సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను భావన చేస్తాం. ఈ భావనచేత పరిమితమైన ఆ పాత్ర అపరిమితమైన మహాజల రాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుంది. అప్పుడది ఆ విశ్వమూర్తియొక్క అర్చనకు అర్హవౌతుంది.

విధానం[మార్చు]

ఆచమనం చేసిన పాత్ర కాక వేరొక కలశంలో పూజకోసం ఉపయోగించే నీళ్ళను తీసుకోవాలి. ఆ కలశానికి గంధము, కుంకుమలతో అలంకరించాలి. ఆ పాత్రలో కొద్దిగా పూలు, అక్షింతలు వేయాలి. ఇది పాత్రలోని దేవతలకు అర్చన. ఆ తరువాత ఆ పాత్రపై కుడి చేతిని మూతగా వుంచి దిగువ తెలిపిన మంత్రం చెప్పాలి. ఇది భక్తుడిలోని చైతన్యశక్తి నీళ్లలోనికి ప్రసరించి, ఆ నీళ్ళ విశాల జల ప్రపంచంగా మారటానికి సంకేతం. ఇదే కలశపూజ, ఈ పూజ అయిన తరువాత పువ్వుతోగానీ, తమలపాకుతోగానీ, ఆ పాత్రలోని నీటిని కొద్దిగా బయటకు తీసి ఆ నీళ్ళను పూజాద్రవ్యాల మీద పూజించబోయే దేవుడిమీద, పూజించే భక్తులమీద చల్లుకోవాలి. ఆ మూడు విశ్వచైతన్య స్వరూపాలే అని మనస్సుకు అందించడం మరో సూచన. ఇలా కలశపూజలో విశ్వచైతన్య దృష్టి స్థిరపడుతోంది గనుక కలశపూజను తప్పక ఆచరించాలి.

కలశం అంటే నీళ్ళు వుండే పాత్రకు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరచేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని, ఈ క్రింది మంత్రం చదవాలి.

తదంగ కలశ పూజాం కరిష్యే...
శ్లో. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః

(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ) పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య.

ఈ పాత్రకు అడుగున బ్రహ్మ, మధ్యలో రుద్రుడు, పైన విష్ణువు వున్నాడు. మధ్యలో సప్తమాత్రుకలున్నాయి. దీని కడుపులో సముద్రాలన్నీ వున్నాయి. గంగా, యమున, కృష్ణా, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధుకావేరి నదులారా! మీరు ఈ పాత్రలో ప్రవేశించండి- అని ఈ మంత్రానికి అర్థం.

అనగా, ఆ కలశంలో ఋషులు, మునులు, దేవతలు, గంగాధి సర్వ తీర్థాలు, నాలుగు వేదాలు, అన్నీ కూడా అందులో ఉండాలని ఆవాహన చేస్తారు. ఆ విధంగా ఆ జలాన్ని పవిత్రీకరణ చేస్తారు.

మూలాలు[మార్చు]

  1. ttdj. "కలశ పూజ ఎందుకు చేస్తారు...?!". telugu.webdunia.com. Retrieved 2021-06-02.
"https://te.wikipedia.org/w/index.php?title=కలశపూజ&oldid=3209478" నుండి వెలికితీశారు