Jump to content

కవిత్వం

వికీపీడియా నుండి
(కవిత్వము నుండి దారిమార్పు చెందింది)

నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టలు ఉండకూడదు. కవిత్వం రాసేవారిని కవులు/కవయిత్రులు అంటారు. వారి కీర్తి కాంక్ష అసలే ఉండొద్దు . ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ ఘడియల్లో సృజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయిన..

అనుభవాన్ని వ్యక్తం చెయ్యటమే కాక, అది మనకు అనుభూతమయ్యేటట్లు చెయ్యటం కవిత్వం పని.అస్తవ్యస్తమైన మన దైనందిక అనుభవాలకి ఒక క్రమాన్ని, అర్ధాన్నీ కవిత్వం ఆపాదిస్తుందన్నమాట.ఐతే తత్త్వం మన జీవితాలకు ఒక అర్ధమూ లక్ష్యమూ నిర్దేశిస్తుందనీ, ఈపనిని అమూర్తమైన ప్రత్యయాల ద్వారా నిర్వహిస్తుందనీ, శాస్త్రం కూడా మన చుట్టూ తిరుగుతున్న ప్రాపంచిక సంఘటలని గణిత శాస్త్రీయ సూత్రాల ద్వారా అర్ధవంతాలుగా చెయ్యటానికి ప్రయత్నిస్తుందనీ వింటుంటాం. మరి వీటి అర్ధవత్త్వానికి కవిత్వం అర్ధవత్వానికి తేడా ఏమిటి? ఏ అమూర్త ప్రత్యయాల, శాస్త్రీయ సూత్రాల నిమిత్తత్త్వం లేకుండానే జీవితానుభవాలను ప్రత్యక్షంగా అనుభూతమయ్యేటట్లు చెయ్యగలిగే శక్తి కవిత్వానికి ఉంది.కవిత్వంలో అనుభవాన్ని అనుభవరూపంలోనే తెలుసుకుంటాం. మామిడి పండును నోటితో తెలుసుకున్నంత ప్రత్యక్షంగా. కొన్ని సార్లు వట్టి కవిత్వం లోను శబ్ద సంవిధానం అర్ధ సంవిధానాన్ని అనుశాసించలేవు. శబ్దాలంకారాలు అర్ధాన్ని శాసించగలవనే భ్రమ అప్పుడప్పుడు కవులకు కలుగుతూ వచ్చింది. ముఖ్యంగా మన పూర్వ కవులకు. అర్ధాలతో సంబంధం లేకుండా వట్టి శబ్ద శబలత వల్లనే రసోత్పత్తి కలిగించవచ్చునని మలార్మే (Mallarame) అనే ఫ్రెంచ్ కవినమ్మి, కొన్ని ప్రయోగాలు చేశాడు. ఆ తరువాత ఫ్రాన్స్ లో డాడాయిస్టులూ, ఇటలీ, రష్యాల్లో ఫ్యూచరిస్టులు పదాలచేత వ్యభిరింప చెయ్యటానికి చాలా ప్రయ్తత్నాలు చేశారు.తెలుగులో శ్రీ శ్రీ కూడా ప్రయోగాలు చేశాడు.కానీ ఇవేవీ సఫలం కాలేదు. కావ్యానికి లేదా కవిత్వానికి కవియొక్క అద్వంద్వమైన అనుభవమే ఆ కావ్యము యొక్క అర్ధ సంవిధానాన్ని, ఆకృతిని నిర్ణయిస్తుంది. ఈ లక్షణాలే కవిత్వాన్ని వచన కవిత్వం నుంచి వేరు చేస్తుందనీ చెప్పవచ్చును., కవిత్వంలో వివిధ పదచిత్రాల పరస్పర సంబంధం వలన కావ్యానికి అర్ధవత్వం లభిస్తుంది.

జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా అనుభూతికి అందివ్వటమేనా కవిత్వం ధ్యేయం., అసంబద్ధమైన వాటిమధ్య సంబంధమే కవిత్వానికి అర్ధం చేకూరుస్తుంది.ఈ సంబంధమే కవిత్వ సారమూ, అది ప్రసరించే కాంతి.

కవిత్వంలో రకాలు

[మార్చు]

కవిత్వం పై ప్రముఖుల వ్యాఖ్యలు

[మార్చు]
  • కవిత్వ మొక తీరని దాహం --శ్రీశ్రీ
  • ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే--శ్రీశ్రీ
  • వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం --గుర్రం జాషువా
  • అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం---దాశరథి కృష్ణమాచార్య
  • ఒకరు రాయమంటే రాయునది కవిత్వం కాజాలదు

ఆకలియే కవిత్వం ఆలోచనయే కవిత్వం కదిలించే ఘటనలు కవ్వించే ప్రతినలు కవితకు ప్రతిపాదికలు

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఛార్ బైట్

మూలాలు

[మార్చు]

1977 భారతి మాసపత్రిక. వ్యాసము: కవిత్వమంటే ఏమిటి? వ్యాసకర్త: శ్రీ ఇస్మాయిల్.

"https://te.wikipedia.org/w/index.php?title=కవిత్వం&oldid=4104970" నుండి వెలికితీశారు