కాంచన ద్వీపం
"కాంచన ద్వీపం" సాహస యాత్రా ఇతివృత్తంగా వ్రాయబడిన ఒక ఆంగ్ల నవల. దీనిని ఆంగ్లంలో "రాబర్ట్ లూయీ స్టీవెన్సన్" (Robert Louis Stevenson) వ్రాశాడు. ఆంగ్లంలో దీని పేరు "Treasure Island". సముద్రపు దొంగలు (పైరేటులు), గుప్త నిధులు ఈ కథలో ముఖ్యాంశాలు. 1883లో మొట్టమొదటిసారి ఆంగ్లంలో ప్రచురింపబడిన ఈ నవల అంతకుముందు Young Folks అనే పిల్లల పత్రికలో 1881-82 కాలంలో The Sea Cook, or Treasure Island అనే పేరుతో ధారావాహికగా వచ్చింది. అద్భుతమైన పాఠకాదరణ పొందిన ఈ నవల అనేక భాషలలోకి అనువదింపబడింది..
కౌమార దశలో ఉన్న బాలుర మానసిక స్థితి, అద్భుతమైన నేపథ్యం, వివిధ మనోవృత్తులు కలిగిన వ్యక్తులు, "నీతి"లో ఉండే అస్పష్టతపై వ్యంగ్య వ్యాఖ్యలు ఈ నవలలో ప్రధానంగా కనుపించే అంశాలు. పిల్లల సాహిత్యంలోఇలాంటి అంశాలుండడం అరుదు. వీటికి తోడు ఇది "యాక్షన్" భరితమైన ఇతివృత్తం. నాటకంగా ప్రదర్శనకు ఈ నవలను పెక్కురు ఎన్నుకొంటారు. దీని ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. సామాన్యజనానీకంలో సముద్రపు దొంగల గురించిన అభిప్రాయాలు చాలా ఈ నవలలోని పాత్రలపై ఆధారపడినాయి. నిధులకోసం మ్యాపులు, అందులో 'X' వంటి గుర్తులు, నిర్మానుష్యమైన దీవులు, సముద్రపు దొంగల ఒంటికంటి నాయకులు, వారి భుజాలపైన ఒక పెంపుడు చిలుక - ఇవన్నీ ఈ నవల కారణంగా ప్రజల మనసులో ముద్రితమైన చిత్రరూపాలు. అనేక బొమ్మలలోను, కార్టూనులలోను పాత్రల చిత్రణ ఇందులోని పాత్రలఫై ఆధారపడి ఉంది.
చిన్న పిల్లల కోసం అని చెప్పినా, ఈ నవల నిస్సందేహంగా అందరినీ అలరిస్తుంది. జిమ్ హాకిన్స్, అతని బృందం వొకానొక దీవిలో వున్న నిధిని సంపాదించడానికి చేసే ప్రయత్నం, దాంట్లో ఎదురయ్యే ప్రమాదాలు, వాళ్ళు ఎలా వాటన్నిటినీ అధిగమించి నిధిని సంపాదిస్తారు అనే కథ మనల్ని పుస్తకం క్రింద పెట్టనివ్వకుండా చదివిస్తుంది.