కుసుమ ధర్మన్న

వికీపీడియా నుండి
(కుసుమ దర్మన్న నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుసుమ ధర్మన్న
కుసుమ ధర్మన్న
జననం1884
మరణం1946
వృత్తిరచయిత
కవి
సాహితీకారుడు
భార్య / భర్తలక్ష్మీనారాయణమ్మ
పిల్లలుపతితపావనమూర్తి,
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ,
భాగ్యలక్ష్మి,
కాశీ విశాలాక్షి,
చిత్తరంజన్,
భగవాన్ దాస్
తల్లిదండ్రులువీరాస్వామి, నాగమ్మ
Notes
తొలి దళిత కవి, వ్యాసకర్త, వక్త

కుసుమ ధర్మన్న (క్రీ, శ 1884-1946) తొలి దళిత కవి, వ్యాసకర్త, వక్త. జయభేరి పత్రిక సంపాదకుడు. ఉద్యమకారుడు. వృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యుడు. సాహితీ కోవిదుడు. ఆంగ్ల-ఆంధ్ర భాషల్లో పండితుడు. "మాకొద్దీ నల్లదొరతనం" గేయరచయితగా ప్రసిద్ధుడు.

జీవిత విశేషాలు[మార్చు]

కుసుమ ధర్మన్న 1884లో రాజమహేంద్రవరంలోని లక్ష్మివారపు పేటలో వ్యవసాయ కూలీలైన కుసుమ వీరాస్వామి, నాగమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు ఆదిఆంధ్ర జూనియర్ ఎలిమెంట్ స్కూలులో 5వ తరగతి వరకు చదివాడు. తరువాత థర్డ్ ఫారం చదివి ఆయుర్వేదంలో వైద్య విద్వాన్ పట్టా పొందాడు. ఇతడికి తెలుగు, సంస్కృతము, ఆంగ్లము, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది. చదువుకునే రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితుడైనాడు.[1] ఇతడు తన జాతి హీనత్వంతో అవమానంతో అమానుషంగా, అంటరాని తనం, సామాజిక వివక్షలతో, బాధపడుతున్న దళితులను( ప్రధానంగా మాలలు ), ఇతర అణగారిన వర్గాలను సంఘ- సంస్కరించాలనే దృక్ఫదంతో "హరిజన శతకాన్ని" రచించాడు. ఇతను హైదరాబాద్లో ఉన్న దళిత ఉద్యమ కారులైన భాగ్య రెడ్డి వర్మ, బి ఎస్. వెంకట్ రావు, అరిగే రామస్వామి లాంటి నాయకులతో అనునిత్యం సంబంధాలు ఏర్పర్చుకొంటు ఒక బలమైన రచయితగా ఎదగడం జరిగింది. ఈయన అంబేద్కర్ స్ఫూర్తి పొంది అంటరాని తనాన్ని నిర్ములించాలనే లక్ష్యంతో తపించిన తొలి దళిత కవి.[2][3][4] ఇతడు గుడివాడ సేవాశ్రమం వ్యవస్థాపకుడు గూడూరి రామచంద్రరావు వద్ద, సీతానగరం ఆశ్రమం, చాగల్లు ఆనందాశ్రమాలలో కొంతకాలం వుండి తన ఉద్యమస్ఫూర్తిని మెరుగుపరచుకున్నాడు.

తెలుగు సాహిత్యంలో తనదంటూ ఒక ప్రత్యెక ముద్ర వేసుకున్న ప్రసిద్ధ సాహిత్యకారుడు ద్వా.నా. శాస్త్రి కుసుమ ధర్మన్నజీవితంపై ఒక పరిశోధన గ్రంధాన్ని రచించారు. 1884లో జన్మిచటంతో పాటు , దళితుల జీవితాన్ని కవిత్వంగా చించిన కుసుమ ధర్మాన్నే తొలి దళిత కవి అని అయన నిరూపించారు. "దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న కవీంద్రుడు" అనే పుస్తకంలో సి.వి. గారు కూడా ఈయన గురించిన సమాచారం తనవద్ద లేదని రాశాడు. 1921లో కుసుమ ధర్మన్న మాకొద్దీ నల్ల దొరతనము రాశారు. దళిత వర్గం నుంచి అతి కష్టంమీద చదువుకుని పైకొచ్చి, తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతికొద్ది మంది దళిత విద్యావంతుల్లో 'కుసుమ ధర్మన్న కవి' ఒకరు. దళితులు, బ్రిటిషు పాలనలో కంటే, స్థానిక అగ్రవర్ణాల పాలనలో మరింత నలిగిపోతారని మొట్టమొదటగా చాటింది కుసుమ ధర్మన్నే. కాంగ్రెస్‌లో ఉంటూనే 'మాకొద్దీ నల్లదొరతనము' అంటూ గళం విప్పిన ధైర్యశాలి. రాజమహేంద్రవరం తాలూకా బోర్డుకు కాంగ్రేసు పార్టీ తరఫున సభ్యునిగా ఎన్నికై కూడా బోర్డు ప్రెసిడెంటు ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి వోటు వేయని స్వతంత్రుడు ఆయన.

ధర్మన్నఅంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితుడై అంబేద్కర్ గురించి ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆంధ్రదేశానికి అంబేద్కరును తొలిగా పరిచయం చేసింది ఈయనే.[5] అణగారిన జాతులకు గొంతుకనిస్తూ, అంబేద్కర్ భావాలను ప్రచారం చేయటానికి జయభేరి అనే పక్ష పత్రికను స్థాపించాడు.

1930వ దశకంలో కాంగ్రేసు పార్టీ చొరవతీసుకొని హరిజన సేవా సంఘం యొక్క ఆంధ్ర విభాగాన్ని ప్రారంభించింది. మహాత్మా గాంధీ అంటరాని కులాల ప్రజలకు హరిజనులు అని పేరుపెట్టడంతో అది ప్రాచుర్యం పొందింది. క్రమేణా ఆది ఆంధ్ర నాయకులంతా కాంగ్రేసు స్థాపించిన హరిజన సేవా సంఘంలో భాగమైనా కుసుమ ధర్మన్న వంటి కట్టుబడిన నాయకులు మాత్రం దాన్ని వ్యతిరేకించారు. నిమ్న జాతుల అభివృద్ధి విషయంలో మహాత్మా గాంధీ ఆశయాలను నమ్మి గౌరవించినా, ఆచరణలో లోపాలను ధర్మన్న సహించలేదు. గాంధీ యొక్క ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం వచ్చి హరిజన నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంలో, ధర్మన్న ఆ సమావేశాన్ని బహిష్కరించాడు. 'హరిజన నాయకులైతే మా పేటలకు వచ్చి యిక్కడ మాట్లాడాలని' కబురుపెట్టి గాంధీని, ఇతర కాంగ్రెస్ నాయకులను తమ పేటకు రప్పించి, ఆతిథ్యమిచ్చి దళితుల గౌరవాన్ని చాటాడు.

దళిత చైతన్యం కోసం ధర్మన్న పడిన తపన ఈయన 1933లో వ్రాసిన హరిజన శతకంలో చూడవచ్చు. "ఆత్మ గౌరవంబు నలరంగ చాటరా" అని ఉద్బోధించిన ధర్మన్న కవిగారు వర్ణధర్మం పేరిట భారతీయ సమాజంలో నెలకొని ఉన్న హెచ్చు తగ్గులను నిరసించిన జాతీయ వాది. సమకాలికులు ఆయనను 'ఆది ఆంధ్ర కవి సార్వభౌమ'గా పేర్కొన్నారు.

1936లో విజయనగరంలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభ సమావేశానికి కుసుమ ధర్మన్న అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో అధ్యక్ష ప్రసంగం చేస్తూ సామ్యవాదాన్ని సహించని హిందూమతం అనే శీర్షికన ప్రసంగం వెలువరించాడు. ఈయన నిమ్నజాతి విముక్తి తరంగిణి, వాళ్ళు అంటరాని వాళ్లా, హరిజన చరిత్ర మొదలైన రచనలు చేశాడు.

రచనలు[మార్చు]

  1. నిమ్న జాతి తరంగిణి
  2. నల్ల దొరతనం
  3. నిమ్న జాతుల ఉత్ఫతి వ్యాసం
  4. మధ్య పాన నిషేధం వ్యాసరచన
  5. అసుర పురాణం పద్య కావ్యం
  6. అంటరాని వాళ్ళం
  7. హరిజన శతకం

మాకొద్దీ నల్ల దొరతనము[మార్చు]

1921లో గరిమెళ్ల సత్యనారాయణ "మాకొద్దీ తెల్ల దొరతనము" అనే గేయాన్ని వ్రాశాడు. అదే సంవత్సరం కుసుమ ధర్మన్న మాకొద్దీ నల్ల దొరతనము అనే గేయాన్ని రచించాడు. ఆ కాలంలో స్వాతంత్ర్యోద్యమ, హరిజనోద్యమ వేదికలపై ఈ రెండు గీతాలు మారుమ్రోగేవి. స్వాతంత్ర్యం వస్తే తెల్లదొరల స్థానంలో నల్లదొరలు వస్తారు. అంటరాని తనం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అస్పృశ్య భావన తొలగిపోతుందో అప్పుడే దళితులకు నిజమైన స్వాతంత్ర్యం అని ఇతడు భావించి ఈ గేయాన్ని రచించాడు.

ఈ పాటలో కొంత భాగం:

మాకొద్దీ నల్లదొరతనము దేవా!
మాకొద్దీ నల్లదొరతనము...
మాకు పదిమందితో పాటు పరువు
గలుగకయున్న మాకొద్దీ నల్లదొరతనము

పన్నెండుమాసాలు పాలేరుతనమున్న
పస్తులు పడుతూ బతకాలండీ
ఆలికూలీ జేసి తీరాలండీ
పిల్లగాడు పశువుల గాయాలండీ
పగలూరేయీ పాటుపడ్డానండీ
కట్టగుడ్డ కూడు గిట్టదండీ
రోగమొస్తే నాగ దప్పదండీ
అప్పుతీరదీ చిత్రమేనండీ
ఈ నిప్పుపైనిక మేము నిలువలేమో తండ్రీ! ||మాకొద్దీ||

పాడిపంటలు మేము కూడబెడితేవారు
కూర్చోనితింటామంటారు
నాములిచ్చి నట్టేటముంచేరు
ఎంచి అప్పు - అప్పు పెంచుతారు
చెంపకొట్టి కొంపలాగుతారు
...............................
............................... ||మాకొద్దీ||

స్ఫూర్తి[మార్చు]

కుసుమ ధర్మాన్న యీ గేయం నుంచి స్ఫూర్తి పొంది మాకొద్దీ నల్లదోరతనం అనే పద్యాన్ని రాశారు.

స్వంత పరిపాలన జేసేద్దమంటారు
చెంతకు మము జేర నీరు....
స్వరాజ్య మనుచు సర్కారుతో పోరాడి
 స్వాతంత్రము మడుగుతారు
మాకు స్వతంత్రమియ్యమంటారు
మాకు హక్కు లేదంటే స్వరాజ్య మెక్కడ దక్కు ....
మాకు హిందుసంగము నందు
స్వాతంత్ర్య మాగు వరకు
మాకొద్దీ నల్లదోరతనము

అంటూ కుసుమ ధర్మన్న గారు నల్ల దొరలూ చేసే అవినీతిని తన రచనల ద్వారా ప్రజలకు తెలియజేసారు

మూలాలు[మార్చు]

  1. పుట్ల, హేమలత (1 August 2016). తెలకపల్లి, రవి (ed.). "కుసుమ ధర్మన్న - మాకొద్దీ నల్లదొరతనం" (PDF). సాహిత్య ప్రస్థానం. హైదరాబాదు: వి.కృష్ణయ్య. 15 (6): 10–14. Retrieved 31 August 2016.
  2. కుసుమ, దర్మన్న. "హరిజన శతకము". kinige.com/. Archived from the original on 2015-03-27. Retrieved 2015-04-03.
  3. కుసుమ, దర్మన్న. "A History of Telugu Dalit Literature". books.google.co.in. kalpaz publications.
  4. K. Satyanarayana, Susie Tharu. "STEEL NIBS ARE SPROUTING - NEW DALIT WRITING FROM SOUTH INDIA DOSSIER 2: TELUGU AND KANNADA". harpercollins.co.in/. harpercollins. Archived from the original on 2015-05-02. Retrieved 2015-04-03.
  5. A History of Telugu Dalit Literature By Thummapudi Bharathi