Jump to content

ఆకురాలు కాలం

వికీపీడియా నుండి
మోడువారిన చెట్టు కొమ్మలు

ఉష్ణమండలంలో ఉన్న ఆంధ్రదేశంలో చెట్లు ఆకులు రాల్చడం అంతగా కనిపించదుకాని, సమశీతల దేశాలలోను, శీతల మండలాలలోను చలికాలం వచ్చే సరికి కొన్ని చెట్లు ఆకులన్నిటిని పూర్తిగా రాల్చేసి మోడులలా బోడిగా కనిపిస్తాయి. మన దేశంలో కులూ లోయ లోను, కాశ్మీరు లోను ఈ విశేషం చూడవచ్చు. శీతల దేశాలలో కూడా అన్ని చెట్లూ ఆకులని రాల్చవు. పైను, ఫర్‌ మొదలైన చెట్ల ఆకులు సన్నగా సూదులలా ఉంటాయి; ఇవి ఆకులని రాల్చవు. ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. కాని వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లన్నీ చలికాలంలో ఆకులని రాల్చుతాయి. ఈ ప్రవర్తనకి చాల కారణాలు చూపించవచ్చు.

మొదటి కారణం. ఆకులు వెడల్పుగా ఉన్న చెట్టు వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వైశాల్యం ఉన్న చెట్టు ఎక్కువ వేడిని నష్టపోతుంది. ఈ విషయాన్నే మరొక విధంగా చెప్పాలంటే, ఎక్కువ వైశాల్యంగా ఉన్న చెట్టుకి ఎక్కువ చలి వేస్తుంది. మనకి చలి వేసినప్పుడు మన వైశాల్యం తగ్గించడానికి ముడుచుకుని కూర్చుంటాం. అలాగే చలి కాలంలో చెట్లు తమ వైశాల్యాన్ని తగ్గించడానికి ఆకులని రాల్చివేస్తాయి.

రెండవ కారణం. ఆకులు ఆహారపదార్ధాలని తయారుచేసే కర్మాగారాల్లాంటివి. వేసవి కాలంలో ఎండ మెండుగా ఉన్న రోజులలో ఆ సూర్యరస్మిని పీల్చుకోడానికి ఎక్కువ వైశాల్యం ఉన్న ఆకులు కావాలి. శీతాకాలం వచ్చేసరికి ఎండ తగ్గిపోతుంది కనుక ఆకులకి సరిపడా సూర్యరస్మి తగలదు. కనుక అవి పూర్వంలా పని చెయ్యలేవు. పని చెయ్యని ఆకులతో నాకేం పని అని చెట్టు ఆ ఆకులని రాల్చేస్తుంది.