క్వినోవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బార్లీ, ఓట్స్, గోధుమలు ఎలానో క్వినోవా కూడా అలా ఓ పంట. పోషకాలకు పేరొందిన ఈ పంట ప్రాధాన్యతను గుర్తించి రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి క్వినోవా ఏడాదిని ప్రకటించింది. అత్యధిక పోషకాలున్న ఈ పంటని బొలీవియాలో బంగారు పంట అని పిలుస్తారు. దీన్నే కీన్‌వా అనీ అంటారు ఇవి విత్తనాలు లేదా గింజలు. అందుకే సూడో గ్రెయిన్స్ అంటున్నారు. బీట్‌రూట్, పాలకూర జాతి మొక్కల లక్షణాలు ఉన్న చీనోపోడియం జాతి మొక్కలకు చెందిన ఈ గింజలు అద్భుత పోషకనిల్వలు.

సూపర్ ఫుడ్[మార్చు]

గోధుమలతో పోలిస్తే ఇందులో ప్రొటీన్ శాతం ఎక్కువ. అదేసమయంలో వీటిల్లో గ్లూటెన్ ఉండదు. దాంతో పిండిపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా వచ్చే వూబకాయం, మధుమేహం, హృద్రోగసమస్యలూ తగ్గుముఖం పడతాయి. పైగా వీటిని ప్రొటీన్‌శాతం ఎక్కువగా ఉండే ఇతర పదార్థాల్లా కాకుండా బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పొట్టు తీసిన ఈ ధాన్యాన్ని అన్నంలానే వండుకోవచ్చు. కిచిడీలూ, పొంగలి రకాలూ, బిర్యానీలూ, సలాడ్‌లూ, కుకీలూ, బ్రెడ్‌లూ, బిస్కట్లూ... ఇలా అన్నీ చేసుకోవచ్చు. ఈ గింజలు రెండు నుంచి నాలుగు గంటల్లోనే మొలకలు వస్తాయి. దాంతో సలాడ్ల తయారీలో వాడుకోవడం సులభం. ముఖ్యంగా సలాడ్లలో ఈ గింజలు చక్కగా సరిపోతాయి. ఇతర ఆకుకూరల్లానే ఈ మొక్క ఆకుల్నీ తింటారు.

పోషకాలు[మార్చు]

వంద గ్రాముల క్వినోవాలో పోషకాల లభ్యత ఈ విధంగా ఉంటుంది... కేలోరీలు 368, ప్రొటీన్లు 14 గ్రా, పిండిపదార్థాలు 64గ్రా, పీచు 7గ్రా, కొవ్వులు 6 గ్రా, శ్యాచురేటేడ్ కొవ్వులు 0.7 గ్రా, మోనో అన్‌శ్యాచురేటెడ్ 1.6 గ్రా, పాలీ అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు 3.3గ్రా, విటమిన్ ఈ 2.44 మిగ్రా, క్యాల్షియం, 47మి గ్రా, ఐరన్ 4.6 మిగ్రా, మెగ్నీషీయం 197 మిగ్రా, ఫాస్పరస్ 457 మిగ్రా, పొటాషియం 563 మిగ్రా, జింక్ 3.1 మిగ్రా.

ప్రత్యేకతలు[మార్చు]

గోధుమ, ఎరుపు, ముదురు గోధుమ, నలుపు, గులాబీ రంగుల్లో ఇవి పండుతాయి. గ్లూటెన్ రహితమైన ఈ ధాన్యాన్ని ఇటీవల అమెరికన్లూ యూరోపియన్లూ ఎక్కువగా తింటున్నారు. దాంతో ఏటికేడాది వీటి ఉత్పత్తి సైతం పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి గతేడాదిని అంతర్జాతీయ క్వినోవా సంవత్సరంగానూ ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యాన్ని అర్థంచేసుకోవచ్చు. సుమారు ఏడువేల సంవత్సరాల క్రితమే ఆండెస్ పర్వతశ్రేణుల్లోని దక్షిణ అమెరికన్లు వీటిని సాగుచేసేవారు. యోధులకు నీరసాన్ని రానివ్వదన్న కారణంతో స్థానికులు క్వినోవాను బంగారంగా భావించేవారు. ప్రస్తుత నిపుణులు సైతం దీన్ని 'సూపర్‌గ్రెయిన్ ఆఫ్ ద ఫ్యూచర్'గా చెబుతున్నారు.

పండించే విధానం[మార్చు]

ఈ పంట 90 రోజుల్లో చేతకి వస్తుంది. నారు పోసిన 10 నుంచి 20 రోజుల్లో నాటాలి. పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించవు. ఖర్చు ఎకరాకు రూ. 17 వేలు మాత్రమే. రబీ పంటగా విత్తుకోవచ్చు. రబీలో రెండో పంటగా విత్తుకోవచ్చు. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అనువుగా ఉంటుంది. కాగా ఈ పంట సాగుకు అన్ని పొలాలు అనుకూలం. ఎకరాకు 10 క్విటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=క్వినోవా&oldid=2103273" నుండి వెలికితీశారు