Jump to content

గజల్ శ్రీనివాస్

వికీపీడియా నుండి
(గజల్ శ్రీనివాస్‍ నుండి దారిమార్పు చెందింది)
కేశిరాజు శ్రీనివాస్
జన్మ నామంకేసిరాజు శ్రీనివాస్
ఇతర పేర్లుగజల్ శ్రీనివాస్
జననం1966
సంగీత శైలిగజల్
వృత్తిగాయకుడు
వాయిద్యాలువోకల్స్, తంబూర
జీవిత భాగస్వామిసురేఖ
పిల్లలుసంస్కృతి
వెబ్‌సైటుఅధికారిక జాలస్థలం

గజల్ శ్రీనివాస్ గా పేరు గాంచిన కేశిరాజు శ్రీనివాస్ తెలుగు గజల్ గాయకుడు, నటుడు, ఉద్యమకర్త. ఈయన 125 ప్రపంచ భాషలలో గాంధేయవాదం పై గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు, లిమ్కా రికార్డ్ నెలకొల్పాడు.[1] తెలుగులో గజల్స్ ప్రక్రియపై ఈయన విశేష కృషి చేశాడు. ఈయన హిందీ, ఉర్దూ గజల్స్ కూడా పాడతాడు.[2] ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. మహాత్మా గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు యుద్ధం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కొంటున్న దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో శాంతి యాత్ర చేశాడు. 2005 లో ఈయన గజల్స్ ను ప్రోత్సహించేందుకు గజల్ చారిటబుల్ ట్రస్టును ప్రారంభించాడు.

నేపథ్యం

[మార్చు]

శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలో జన్మించాడు. ఆయన తాత కేశిరాజు వెంకటనరసింహం పంతులు ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీనివాస్ తండ్రి నరసింహం తన ఉద్యోగ రీత్యా పాలకొల్లులో స్థిరపడ్డాడు. తల్లి రత్నావళి గృహిణి.[3] ఆయనకు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి కలిగింది. వివిధ వేదికల మీద సినిమా పాటలు పాడేవాడు. ఆయనకు సంగీతంలో మక్కువ ఎక్కువయినా తల్లిదండ్రులు మాత్రం మొదట్లో ఆ రంగంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. 1980 లో ఒకసారి ఆయనకి త్యాగరాయ గానసభ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లలిత సంగీతంలో ఒక అవార్డు వచ్చింది. దాంతో వారికి తమ కుమారుడు ఆ రంగంలో రాణించగలడని నమ్మకం వచ్చింది. శ్రీనివాస్ ను పండిట్ హరే రాం దగ్గరకి కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి పంపించారు.

ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో బి.ఎ చేశాడు. 1989 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్సెన్ లో డిగ్రీ చేశాడు.[4] తాను పూర్తి స్థాయి గజల్ గాయకుడిగా మారక మునుపు భీమవరం లోని భారతీయ విద్యాభవన్, కోరుకొండ సైనిక్ స్కూల్లో లైబ్రేరియన్ గా పనిచేశాడు.

ఈయనకు సురేఖతో వివాహం జరిగింది. వీరికి సంస్కృతి అనే కూతురు ఉంది.

వృత్తి జీవితం

[మార్చు]

మొదట్లో శ్రీనివాస్ సినిమాకు సంబంధించిన పాటలే పాడేవాడు. 1986 లో సి. నారాయణ రెడ్డి రాసిన గజల్స్ విన్నాడు. అప్పటి నుంచి గజల్స్ ను తనదైన శైలిలో ప్రయోగాత్మకంగా పాడటం మొదలు పెట్టాడు.

శ్రీనివాస్ 125 భాషల్లో గజల్స్ పాడి ప్రపంచ గిన్నీసు రికార్డులు సాధించాడు. అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా ప్రపంచంలో మొత్తం 6 వేల కచేరీలు చేశాడు. అమెరికాలో అనేక సార్లు పర్యటించి తెలుగు తోరణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించాడు. వివిధ భాషా సేవా సంస్థలు, కళావేదికల చే సన్మానాలు, బిరుదులు పొందాడు.

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడిన పలుగ్రామాలను దత్తత తీసుకొని వైద్యసేవలందించాడు. [ఆధారం చూపాలి]

హైదరాబాదులో సేవ్‌ టెంపుల్‌ కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగినిని తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశాడన్న ఫిర్యాదుపై పోలీసులు జనవరి 2వ తేదీ, 2018న అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. లైంగిక కార్యకలాపాల వీడియోలు లీకై తీవ్ర సంచలనం సృష్టించాయి.[5]


మూలాలు

[మార్చు]
  1. "'Ghazal Srinivas' enters Guinness book". The Hindu. Hyderabad. 14 November 2008. Retrieved 14 March 2015.
  2. Murali, S. (10 January 2016). "Ghazal Srinivas wants two Telugu States to flourish". The Hindu (in Indian English). Retrieved 22 June 2022.
  3. "gazals gaana kalaa prapoorna ghazal sriniva". gotelugu.com. Retrieved 21 June 2022.
  4. Satish Reddy, V (22 October 2017). "A remarkable journey". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 21 June 2022.
  5. బెయిలుపై విడుదలైన గజల్ శ్రీనివాస్