Jump to content

గన్నవరం లలిత్ ఆదిత్య

వికీపీడియా నుండి
గన్నవరం లలితాదిత్య

గన్నవరం లలితాదిత్య సంస్కృతాంధ్రశతావధాని. అమెరికాలో పుట్టి పెరిగిన అతను శతావధానములతో పాటు నవావధానాలను కూడా చేసారు[1].

జీవిత విశేషాలు

[మార్చు]

గన్నవరం లలితాదిత్య 2000లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జన్మించారు. తండ్రి మారుతి శశిధర్, అమ్మ శైలజ అతనికి బాల్యంలోనే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అలవర్చారు. అతని తండ్రి ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో నిపుణునిగా ఐ.బి.ఎం.లో పనిచేస్తున్నారు. తెలుగు భాషలో మాట్లాడమే కాకుండా, చిన్నతనంలోనే పద్యాలు చెప్పటం, తిరిగి చెప్పించటం ఇలా కన్నవారి ప్రేరణతోనే అమ్మ భాషపై పట్టు సాధించారు. పుస్తకపఠనం, సంగీతం రెండింటితో సహవాసం చేయడంతో అతను స్వయంగా పద్యాలు రాసేంతగా ఎదిగారు. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో పద్యాలు రాసి గురువుల ప్రశంసలు పొందారు[1]. పద్యాలు రాయడం లోను, వేదం, సంగీతం వంటి వాటిపైన పట్టు సంపాదించారు. అతను ఊనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సంస్కృతములో డిగ్రీలు సంపాదించారు.

అతను 2016లో "హనుమదాయతదోర్దండమండ నాకు" అన్న మకుటముతో ఆంజనేయశతకం రాసారు. ఈ రచన అతనిని అష్టావధానం వైపు అడుగులు వేయించింది. శతకంలోని తప్పొప్పులు విశ్లేషించుకునేందుకు అతను "అవధానిప్రాచార్య" ధూళిపాళ మహదేవమణి వద్దకు వెళ్ళారు. ఆయన వద్ద అష్టావధానంలో నాలుగు నెలల పాటు శిక్షణ పొందారు. సంస్కృత పండితులైన ధూళిపాళ మహదేవమణిగారి ఆధ్వర్యంలో మొదటి అష్టావధాన కార్యక్రమాన్ని చేసారు.

శ్రీవెంపటి కుటుంబశాస్త్రిగారు, శ్రీచిఱ్ఱావూరి పద్మనాభశర్మగారు వంటి పండితుల వద్ద వేదాంతము, వ్యాకరణము, మొదలైన శాస్త్రముల అధ్యయనమును, "దర్శనాలంకార" శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రిగారి వద్ద తర్కశాస్త్రాధ్యయనము కొనసాగించుచున్నారు.

అవధానాలు

[మార్చు]

ఆదిత్య 2019 జనవరిలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో ‘సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం’ చేసాడు[2]. ఆతుపై 2019 డిసెంబర్ లో రాజమహేంద్రిలో తొలి శతావధానము, తరువాత 2022 జూన్ నెలలో హైదరాబాదులో, 2022 డిసెంబర్ లో శ్రీకాకుళములో శతావధానములు కూడా జయప్రదముగా కావించాడు. శతావధానశతధృతి,శతావధానశరచ్చంద్ర, శతావధానిశ్రీసుమిత్ర, యువావధానశిరోమణి, కాలకంఠ మొదలైన బిరుదులను పొందారు.

19 సంవత్సరాల వయసున రాజమహేంద్రిలో శతావధానము, 21 ఏండ్లకు భాగ్యనగరములో శతావధానము, రవీంద్రభారతిలో ద్విగుణితద్విభాషాష్టావధానము, నల్లుకుంట శంకరమఠము(హైదరాబాద్), సైనిక్ పురీ శంకరమఠము, రామకోటి శంకరమఠము(విజయవాడ) ఇత్యాది ప్రాంగణాలలో, అమెరికా, కెనడా, భారతదేశాలలో 15కి పైగా అష్టావధానాలు నిర్వహించారు. భాగవతరామాయణగీతాదులపై శంకరదిగ్విజయాదులపై వివిధ-ఆధ్యామికాంశాలపై వీరు ప్రవచనాలు చేశారు.

రచనలు

[మార్చు]

సంస్కృతంలో

[మార్చు]
  • నఖశతకం
  • నారసింహనమశ్శతం
  • హనుమన్నవకం
  • నృసింహపాదాదికేసరాంతస్తోత్రం
  • శారదాపంచవింశికా

తెలుగులో

[మార్చు]
  • హనుమద్దోర్దండ శతకం
  • శ్రీరామ షోడశి
  • ఆవిర్భావము (నరసింహావిర్భావ ఘట్టం),
  • పర్యావరణావనం
  • శార్దూల విక్రీడితం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "అష్టావధానం.. ఎంతో ఇష్టంగా!". Sakshi. 2019-01-17. Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-25.
  2. "అబ్బురపరిచిన లలిత్‌ ఆదిత్య అష్టావధానం". www.eenadu.net. Archived from the original on 2020-02-25. Retrieved 2020-02-25.

బయటి లంకెలు

[మార్చు]