Jump to content

గోల్డెన్ జూబ్లీ డైమండ్

వికీపీడియా నుండి
గోల్డెన్ జూబ్లీ డైమండ్
అసలును పోలిన నకలు జూబ్లీ డైమండ్
బరువు545.67 క్యారెట్లు (109.13 గ్రా)
రంగుగోధుమ రంగు
కోతఫైర్ రోజ్ కుషన్ కట్
వెలికితీసిన దేశంథాయిలాండ్
వెలికితీసిన గనిప్రీమియర్ గని
కనుగొన్నవారు1985
కోత చేసినవారుగాబ్రియేల్ టోల్కౌస్కై
తొలి యజమానిహెన్రీ హో [1]
యజమానిరాజు భుమిబోల్ అదుల్యతేజ్
విలువ (అంచనా)USD $4-12 మిలియన్

గోల్డెన్ జూబ్లీ డైమండ్ లేదా ఫెట్ కాంచనఫిసెక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, మెరుగుపెట్టిన వజ్రం. ఇది 545.67 క్యారెట్ల (109.134 గ్రా) బరువున్న గోధుమ రంగు వజ్రం. ఇది కుల్లినాన్ వజ్రం I ("గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా") కంటే 15.37 క్యారెట్లు (3.074 గ్రా) పెద్దది. గోల్డెన్ జూబ్లీ డైమండ్‌ను 1985 లో థాయిలాండ్ లోని ప్రీమియర్ మైన్ (ఇప్పుడు కుల్లినన్ డైమండ్ మైన్) లో కనుగొన్నారు. ఈ గని లోనే కుల్లినన్ డైమండ్ (1905), టేలర్–బర్టన్ (1966), సెంటెనరీ (1986) వంటి ఇతర ప్రసిద్ధ డైమండ్లు కూడా లభించాయి.

చరిత్ర

[మార్చు]

మొదట "పేరులేని గోధుమ రంగు" వజ్రంగా ఉదహరించిన ఈ గోల్డెన్ జూబ్లీ వజ్రాన్ని 755.5 క్యారెట్ల (151 గ్రా) పెద్ద గోధుమ రంగు ముడి వజ్రం నుండి కోశారు. ఇది 1985 లో దక్షిణాఫ్రికాలోని ప్రీమియర్ మైన్సు నీలిరంగు నేలలో దొరికింది.

1990 వరకూ ఈ వజ్రం గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. దానిని ప్రస్తుత రూపానికి తీసుకురావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది. విశాలమైన ఉపరితలం, అంతర్గతంగా ఉన్న లోతైన పగుళ్ళు వంటి కారణాల వలన ఈ పెద్ద వజ్రాన్ని కత్తిరించడం లోను, మెరుగులు పెట్టడం లోనూ అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. డి బీర్స్ సంస్థ, కొత్త కత్తిరింపు సాంకేతికతను పరీక్షించడానికి దీన్ని ఒక అవకాశంగా మలుచుకుంది. గోల్డెన్ జూబ్లీ వజ్రాన్ని కత్తిరించడంలో ఉపయోగించిన సాంకేతికతనే, ఆ తరువాత సెంటెనరీ వజ్రాన్ని కత్తిరించడంలోనూ ఉపయోగించారు. ఈ సెంటెనరీ వజ్రం చిన్నదీ (273.85 క్యారెట్లు), దోషరహితమైనదీ, రంగులేనిదీను.[2]

వజ్రాన్ని కత్తిరించడానికి డి బీర్స్ సంస్థ, గాబ్రియేల్ టోల్కోవ్స్కీని నియమించుకుంది. రంగులేని సెంటినరీ వజ్రాన్ని కోసేందుకు అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక సాధనాలు, కత్తిరింపు పద్ధతులను పరీక్షించడానికి కూడా గాబ్రియేల్ టోల్కోవ్స్కీని నియమించుకున్నారు.[3]

థాయ్ డైమండ్ తయారీదారుల సంఘం లామ్ చాబాంగ్‌లో థాయ్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రదర్శనలో ప్రదర్శించడానికి పేరులేని ఈ వజ్రాన్ని థాయిలాండ్‌కు తీసుకువచ్చింది. 1988లో డి బీర్ శతాబ్ది ఉత్సవాలను ప్రకటించడానికి దీన్ని ఎంపిక చేసారు.

రాయల్ స్వర్ణోత్సవం కోసం ప్రదర్శన

[మార్చు]

1996 లో డి బీర్స్ థాయిలాండ్ పెట్టుబడుల బోర్డు ఉత్సవంలో ఈ వజ్రాన్ని ప్రదర్శించింది. దాని అందాన్ని గుర్తించిన థాయ్ వ్యాపారవేత్తల బృందం సుమారు $6 మిలియన్లకు ఆ రాయిని కొనుగోలు చేసింది. రాజ భూమిబోల్ అదుల్యదేజ్ సింహాసనాన్ని అధిష్టించిన 50 వ వార్షికోత్సవం సందర్భంగా వ్యాపారవేత్తలు సంయుక్తంగా అతనికి గోల్డెన్ జూబ్లీ వజ్రాన్ని సమర్పించారు.[4] ఈ వజ్రాన్ని రాజదండంపై గానీ రాజముద్రపై గానీ అమర్చాలన్న తొలి ప్రతిపాదనలు అమలు కాలేదు.[5] మొదట్లో స్వర్ణోత్సవాన్ని రాజదండంలో అమర్చాలని అనుకున్నారు. తదుపరి దానిని రాజ ముద్రలో అమర్చాలని తలపెట్టారు.[6]

ఆశీర్వాదాలు

[మార్చు]

పోప్ ఆశీర్వాదం కోసం ఈ వజ్రాన్ని వాటికన్‌లోని పోప్ జాన్ పాల్ II వద్దకు తీసుకువెళ్లారు. దీనిని థాయిలాండ్ బౌద్ధ సుప్రీం పాట్రియార్క్ కూడా ఆశీర్వదించారు.

ప్రదర్శనలు

[మార్చు]

గోల్డెన్ జూబ్లీ వజ్రాన్ని బ్యాంకాక్‌లోని 59 అంతస్తుల ఆభరణాల వాణిజ్య కేంద్రంలోను, హెన్రీ హో లాట్ ఫ్రావో లోని సెంట్రల్ డిపార్ట్‌మెంట్ స్టోరు లోను, అంతర్జాతీయంగా బాసెల్ (స్విట్జర్లాండ్) లోను, యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికాలో నెబ్రాస్కా, ఒమాహాలోని బోర్షీమ్స్ (వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ యాజమాన్యంలో) లోను, కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలోని గ్లీమ్స్ జ్యువెలర్స్‌లోనూ ప్రదర్శించారు. ఇది ఇప్పుడు రాయల్ రెగాలియాలో భాగంగా గ్రాండ్ ప్యాలెస్‌లో ఉంది.[7]

విలువ

[మార్చు]

స్వర్ణోత్సవ వజ్రం విలువ $4, $12 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని నమ్ముతారు. వేలంలో అమ్మితే, ప్రముఖ వ్యక్తులతో (థాయిలాండ్ రాయల్టీ) దీనికి ఉన్న అనుబంధం కారణంగా గణనీయంగా ఎక్కువ ధర లభించే అవకాశం ఉంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "A moment with … Henry Ho of the Jewellery Trade Centre Bangkok". LifestyleAsia. Archived from the original on 2016-03-04. Retrieved 2016-08-09.
  2. "Golden Jubilee - AJU". university.langantiques.com. Archived from the original on 2016-05-25. Retrieved 2025-11-12.
  3. "Golden Jubilee Diamond: History, Properties and More". The Diamond Authority. 31 May 2017.
  4. เนชั่นแนล จีโอกราฟิก (ฉบับภาษาไทย) [National Geographic (Thai edition)]. National Geographic (Thai edition) (in థాయ్). December 2001. p. 34.
  5. "Golden Jubilee Diamond". Internet Stones. Retrieved 30 October 2025.
  6. "Golden Jubilee Diamond". Internet Stones.COM Network.
  7. "Golden Jubilee Diamond: History, Properties and More". The Diamond Authority. 31 May 2017.
  8. "The Golden Jubilee Diamond - Value & History". www.worthy.com. 26 June 2019.