Jump to content

చండ్రుభట్ల రాజగోపాలరావు

వికీపీడియా నుండి

చండ్రుభట్ల రాజగోపాల రావు పాత్రికేయుడు, సంపాదకుడు.

బాల్యము

[మార్చు]

చండ్రుభట్ల రాజగోపాల రావు పుట్టింది తూర్పు గోదావరి జిల్లా ఇందుకూరుపేట గ్రామం లోని అమ్మమ్మ గారింట. అయితే దేశ భక్తుడిగా జాతీయవాదిగా జర్నలిస్టుగా ఊపిరులు పోసుకుంది మాత్రం రాజమండ్రి దగ్గరి సీతానగరంలోని గౌతమి సత్యాగ్రహాలయం లోనే.. రాజగోపాల రావు బాల్యం ఆ ఆశ్రమం పరిధి లోనే పరిక్రమించింది. అక్కడి రాట్నం సవ్వడులే లేలేత వయసులో ఆయన మదిని సమ్మోహన పరిచిన సరిగమ లయ్యాయి. వందేమాతరం నినాదాలే ఆయనను ముందుకు నడిపించిన జీవన వేదాలయ్యాయి. రాజ గోపాల రావు తండ్రి చండ్రుభట్ల హనుమంత రావు ప్రముఖ పాత్రికేయుడు. జైలు కెళ్ళిన స్వాతంత్ర్య యోధుడు, పాత్రికేయ జీవితం పట్ల అభిలాష, అభినివేశాలు రాజ గోపాల రావుకి తండ్రి నుంచే అనువంశికంగా అబ్బాయి.

పాత్రికేయ జీవితం

[మార్చు]
దేశ భక్తుడు, కలం వీరుడు -ఆంధ్ర పత్రిక రాజ గోపాల రావు. ఖద్దరు కుటుంబం నుంచి వచ్చిన కలం వీరుడు చండ్రుభట్ల రాజగోపాలరావు. జర్నలిజం ఆయన వృత్తి. జాతీయవాదం ఆయన ప్రవృత్తి. వృత్తి ప్రవృత్తి పాలూ తీనెలా కలగలసి పొవడం వల్ల ఆయన ఉత్తమ శ్రేణి పాత్రికేయుడిగా రూపుదిద్దుకున్నారు. తర్వాతి రోజుల్లో ఆంధ్ర పత్రిక సంపాదకుడిగా ఎదిగి ఆంధ్ర పత్రిక రాజ గోపాల రావుగా వాసి కెక్కారు. చూపు ఆనని ముదిమి వయసులో సైతం పరిశోధనలు జరిపి గొప్ప పుస్తకాలు వెలువరించిన దీక్షా దక్షతలు ఆయనవి.

పాత్రికేయ జీవితం 1953 లో టంగుటూరి ప్రకాశం "ప్రజా పత్రిక"లో శ్రీకారం చుట్టుకొంది. మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోవడానికి కొద్ది రోజుల ముందు గావడంతో టంగుటూరి ప్రకాశం అభిప్రాయాల కోసం అంతా ప్రజా పత్రికనే చదివే వారు. మద్రాసు శాసన సభలో టంగుటూరి అధ్యక్షతన ఆంధ్ర శాసన సభ్యుల ప్రత్యేక సమావేశాన్ని రాజ గోపాల రావు కవర్ చేసారు. కమ్యునిస్టులు బెజవాడ రాజధాని చేయాలని పట్టుబట్టగా ప్రకాశం వారి మాటలు చెల్లనివ్వకుండా కర్నూలు రాజధానిగా తీర్మానం చేయించిన వైనానికి రాజ గోపాల రావు ప్రత్యక్ష సాక్షి.

ఆర్నెల్లకు "ప్రజా పత్రిక" మూత పడగా రాజమండ్రి వచ్చి కొంతకాలం క్రొవ్విడి లింగరాజు సంపాదకత్వంలోని "గోదావరి" తెలుగు పత్రికలో పనిచేసారు. అనంతరం "ఆంధ్ర పత్రిక" మద్రాసులో సబ్ ఎడిటర్ చేరారు. శంభు ప్రసాద్ సంపాదకులు కాగా పండితారాధ్యుల నాగేశ్వరరావు, పోలవరపు శ్రీ రాములు, నండూరి రామ్మోహన్ రావు, శ్రీనివాస శిరోమణి, పిలక గణపతి శాస్త్రి వంటి హేమాహేమీలు ఆయన సహోద్యోగులు. కొంతకాలం తరువాత విజయవాడ రిపోర్టర్ గా బదిలీ అయ్యారు.

పాత్రికేయుడిగా అనేక ఉత్తేజకర ఘట్టాలను రాజగోపాల రావు ఇక్కడే చూసారు. పండిట్ నెహ్రూ విజయవాడ వచ్చిన సందర్భంగా అయన రిపోర్ట్ పంపాలి. నెహ్రూ సాయంత్రం 4 గంటలకు విజయవాడ వస్తున్నారు అయితే 2 గంటలకే రిపోర్ట్ పంపాల్సి ఉంది. నెహ్రూ వచ్చినట్లుగా, ముఖ్యమంత్రి సంజీవయ్య స్వాగతం పలికి సభాస్థలికి తీసుకు పోయినట్లు వార్త పంపించారు. ఆంధ్ర పత్రికకు ఆ రోజుల్లో ఉన్న విశ్వాసనీయత దృష్ట్యా రాజ గోపాల రావు చేసింది పెద్ద సాహసమే. అయితే కథ ఎక్కడా అడ్డం తిరగక పొవడం ఆయనకు కలసి వచ్చిన అదృష్టం.

గుంటూరులో లాల్ బహదూర్ శాస్త్రి పాల్గొన్నఏ.ఐ.సి.సి సమావేశం. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర పర్యటన. గోదావరి వరదలు, రాయలసీమ కరవు మున్నగు ప్రత్యేక వార్తలను అయన కవర్ చేసారు. "ఆంధ్ర పత్రిక" ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టి 1990 లో పదవీ విరమణ చేసే వరకు వృత్తి జీవితంలో ఉత్తమ విలువలు పెంచి పోషించారు. జాతీయ భావాల వ్యాప్తికి, దేశ సేవకి పాత్రికేయ వృతి కూడా ఒక మార్గంగా ఆయన భావించే వారు. పాటకులకు జవాబుదారిగా, విశ్వాసనీయతే ప్రమాణంగా అయన పనిచేసారు. ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా అదిరేవారు కాదు. బెదిరేవారు కాదు.

రచనా వ్యాసంగం

[మార్చు]

పదవీ విరమణ చేసిన తొమ్మిదేళ్ళ తరువాత రచనా వ్యాసంగం యాధ్రుచ్చికంగా చేపట్టారు. తనను ప్రభావితం చేసిన సీతానగరం ఆశ్రమం పైనే "గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం" పేరుతొ అయన తొలి పుస్తకాన్ని రాశారు. ఆనక తనకు గుర్తింపు రాణింపు ప్రసాదించిన "అంధ్ర పత్రిక చరిత్ర"ను రాశారు. అదే చేత్తో " జైలు కెళ్ళిన జర్నలిస్టు యోధులు " "వందే మాతరం నుంచి క్విట్ ఇండియా" వరకు అనే పుస్తకాలు అయన రాశారు. కళ్ళు కనబడని స్థితిలో కాళ్ళు సహకరించని పరిస్థితిలో ఈ పుస్తకాలు రాయడానికి అయన రాష్ట్ర లిబ్రరీల వెంట కుటుంబ సభ్యుల సహకారంతో తిరిగారు. ఎక్కడెక్కడో ఉన్న లైబ్రరీలు, ఆర్కైవ్స్ లను జల్లెడ పట్టారు. భూతద్దం సాయంతో కొన్ని వేల జి వో లు, పత్రికలు చదివారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చీకట్లో మగ్గుతున్న చరిత్రను వెలుగులోకి తీసారు . తన రచనల ద్వారా మన వారసత్వ సంపద లోని ఘన చరిత్రను ముందు తరాలకు అందించాలన్న ఆయన తలంపు ఎంతో గొప్పది. "ఆంధ్ర పత్రిక చరిత్ర," " జైలు కెళ్ళిన జర్నలిస్టు యోధులు " పుస్తకాలను ప్రెస్ అకాడెమీ ఆర్థిక సహాయం చేసింది.

పురస్కారము

[మార్చు]

ఆంధ్ర పత్రిక చరిత్ర, " కు ఉత్తమ గ్రంథంగా 2006 లో తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది. అనేక ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సత్కారాలను ఆయన అందుకున్నారు. రాజ గోపాల రావు పై ప్రెస్ అకాడెమి "అడుగు జాడలు" పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించింది. ప్రతి వ్యక్తి తన వృత్తిలో నిజాయతిని వ్యక్తిత్వంలో నియమ పాలనను పాటిస్తే దేశ సేవ చేసినట్లేనని సి.వి.రాజ గోపాల రావు విశ్వాసం.

1961 జూన్ 28 న సరోజినీతో ఆయన వివాహం జరిగింది. మామగారు పైడిమర్రి సత్య నారాయణ మూర్తి కూడా స్వాతంత్ర్య యోధులే. శ్రీధర్, శైలజ వారి సంతానం. శ్రీమతి సరోజినీ 2010 లో మరణించడంతో రాజ గోపాల రావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. అప్పటి నుంచే అయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.

నిరంతర శ్రమనే నమ్మిన మేధావి, నిబద్దతతో నిజయతికి మారుపేరుగా గడిపిన ఉతమశ్రేణి పాత్రికేయుడు సి వి రాజగోపాలరావు మార్చి 18 న మరణించారు . కాని తెలుగు పత్రికా లోకానికి అయన చేసిన సేవలు, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికి పదిలంగా ఉంటాయి

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]