పద్మవ్యూహం (యుద్ధ వ్యూహం)

వికీపీడియా నుండి
(చక్రవ్యూహం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చక్రవ్యూహ వ్యూహ వలయ రచన

పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలలో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేధ్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు.

మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యున్ని సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం యొక్క పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములో శ్రీకృష్ణునికి, అర్జునునికి, ప్రద్యుమ్నునికి (శ్రీకృష్ణుని కొడుకు), అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమని ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. అదే సమయంలో పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి ఇలా పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు.

అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం చెక్కిన శిల్పం - హలిబేడు, కర్ణాటక

అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Eenadu. "'పద్మవ్యూహం' రహస్యం ఏంటి? - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-10-14. Retrieved 2019-10-14.