Jump to content

చాటువులు

వికీపీడియా నుండి

మన ఆంధ్రకవులు ఎన్నో ఏళ్ళనుంచి తమ కవితామృత ధారతో తెలుగు రసిక హృదయ కేదారాలలో పసిడి పంటలు పండిస్తూనే ఉన్నారు. ఈ మహా కవులు తమ కావ్యాలలో ఇతివృత్తానికీ, కవితా పారమ్యానికీ ప్రాముఖ్యమిచ్చారు తప్ప వైయక్తిక అనుభూతులకు ఎక్కడోగాని తావీయలేదు. వాళ్లకు కోపమో, తాపమో, అనురాగమో, ఆనందమో, అవహేళనాభావమో, భక్తిభావమో కలిగినప్పుడు అప్పటికప్పుడు తమకు కలిగిన అనుభూతులు పద్యాలుగా అవతరించాయి. వీటినే చాటువులు అంటారు.

లక్షణాలు

[మార్చు]

అందరికీ అర్ధమయ్యేలా భావాల్ని పొందుపఱచి తమ ప్రజ్ఞాపాటవాలను చూపిస్తూ అందులో ఇంకొంచెం ప్రాణంపోసి ప్రచారంలోకి తెచ్చి శాశ్వతంగా ప్జ్రజల హృదయాంతరాళల్లో నిలిచిపోయేలా, వారి ఆలోచనారీతులను ప్రభావితం చేసేలా మనకు మిగిలిన, మన పెద్దలు మిగిల్చిన చద్ది మూటలు ఈ చాటుపద్యాలు. ఒకచోట చమత్కారం, ఒకచోట భావ విన్యాసం ఇంకోచోట వెక్కిరింపు, సాధింపులు, ఇంకొకచోట వ్యంగం, విరుపులు, ఇలా సన్నివేశానికి బలం చేకూర్చేలా ప్రాణంతో కదలాడే శబ్ద సమూహాలు ఈ చాటువులు.

ఉబికి వచ్చిన భావాన్ని పద్యంగా మలచి చిమ్మివేయడమే తప్ప ఇతరేతరమైన ఏ నియమ నిబంధనలకు ఒదగనిది చాటుపద్యం. సామెతకున్న సంక్షిప్తత, సూటిదనం, జనప్రియత్వం, స్ఫూర్తి, నిస్ప్రయత్నంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకునే శక్తి చాటుపద్యానికుంటాయి. సూక్తిని చమత్కృతం చేయడం చాటువు లక్షణం.అందువల్ల ఆశువుకంటే చాటువుకు ఆయుష్షు ఎక్కువ. చాటువులో అందమైన వస్తువుకంటే అందంగా చెప్పిన పద్ధతికే ప్రాముఖ్యం అంటే రుచికరం కాని వస్తువును రుచికరంగా చెప్పే సూక్తిధారి ఈ చాటువు.

అర్థము

[మార్చు]

చాటు : అనే సంస్కృత పదానికి 'చాటువు ' అనేది తత్సమ రూపం.చాటువు అంటే ప్రియమైన లేదా ఇష్టమైన మాట.

కొన్ని చమత్కార చాటువులు

[మార్చు]

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!

నల్లి బాధ పడలేకనే శివుడు కొండలపై, రవిచంద్రులు ఆకాశాన, విష్ణువు ఆదిశేషునిపై పడుకున్నారని భావం.

ఇంటావిడ పోరు పడలేక ఒక కవి ఇలా చెప్పాడు..

మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా
పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే !!

'దోమలు, నల్లులు రాత్రి మాత్రమే బాధిస్తాయి. ఈగలు, యాచకులు పగలు మాత్రమే బాధిస్తారు. చీమలు, భార్య రాత్రింబవళ్ళు వేధిస్తారు ' అని భావం.

కుల్లాయుంచితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రాగితిన్, రుచుల దోసంబంచు బోనాడితిన్
దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాధుడన్!

శ్రీనాధుడు ప్రౌడదేవరాయ సందర్శనాభిలాషియై విద్యానగరము వెళ్ళినప్పుడు జరిగిన మర్యాదలివి. కన్నడ మర్యాదానుసారం శ్రీనాధునికి కొత్త సంప్రదాయాలైన తలకు కుళ్ళాయి(తలపాగా), మేనికి అంగరఖాను ధరించవలసి వచ్చింది. శ్రీనాధుడు వేదాధ్యయన సంపన్నుడు కావడంవల్ల శిష్టుడు. శిష్టులు సకేశలైన వితంతువుల చేతి భోజనం అంటరు. ఈ దురవస్థ శ్రీనాధులవారికి కన్నడ రాజ్యంలొ సంప్రాప్తించింది. అందుకే కన్నడ రాజ్యలక్ష్మితో మొరపెట్టుకున్నాడు.


మేత గరి పిల్ల, పోరున మేక పిల్ల,
పారుపోతుతనంబున బంది పిల్ల,
యెల్ల పనులను జెఱుపంగ బిల్లి పిల్ల,
యందమున గ్రోతిపిల్ల యీ యఱవ పిల్ల!

దక్షిణ దేశ సంచార సమయంలొ ఒక అఱవ పిల్లను చూసి చెప్పిన హాస్యస్ఫూరక చాటువు ఇది.


కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?

రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభయైన నేకులె వడకున్‌
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్‌

ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
కాపు కపివరుండు కసవు నేడు
గుంపు గాగ నిచట గురజాల సీమలో
నోగులెల్ల గూడి రొక్క చోట.

గరళము మ్రింగితి ననుచుం
బురహర గర్వింపబోకు పో పో పో నీ
బిరుదింక గానవచ్చెడి
మెరసెడి రేనాటి జొన్నమెతుకులు తినుమీ.

కాశికా విశ్వేశ్వరు గలిసె వీరారెడ్డి
రత్నాంబరము లే రాయడిచ్చు
రంభ గూడె దెనుంగు రాయరాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
 
స్వర్గస్థుడయ్యె విస్సన్న మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలార విభుడేగె
దినవెచ్చ మే రాజు దీర్పగలడు

భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
గలియుగంబున నిక నుండ గష్టమనుచు
దివిజకవివరు గుండియల్‌ డిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.

యివి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చాటువులు&oldid=3878012" నుండి వెలికితీశారు