చానమాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రోలమ, చానమాంబ తొలితరం ఆంధ్ర కవయత్రులలో ప్రధములుగా లక్ష్మీకాంతమ్మ పేర్కొన్నారు. వారు 13వ శతాబ్దము వారు.[1] అయితే గోన బుద్ధారెడ్డి కూతురు, వీరపత్ని కుప్పాంబిక కొంత ముందుకాలానికి పద్యరచన చేసారనే ఆధారాలు కూడా చరిత్రలో కనపడుతున్నాయి కాబట్టి కుప్పాంబికే మొదటి కవయిత్రి అను వాదము కూడా ఉంది,[2]

చానమాంబ రణ తిక్కన గా ఖ్యాతి గాంచిన ఖడ్గ తిక్కనార్యుని కులకాంత, ఇంకా కవిబ్రహ్మ తిక్కనార్యునికి వదిన గారు. ప్రోలమ కవిబ్రహ్మకు, ఖడ్గ తిక్కనార్యునికి తల్లి ఇంకా చానమాంబకు అత్తగారు. మనుమసిద్ధి దగ్గర రణతిక్కన సైనిక వ్యవహారాలు చూసే మంత్రిగా ఉండేవాడు. యుద్ధంలో ఓడిపోయి సజీవంగా ఇంటికి తిరిగివచ్చిన ఈ రణతిక్కనకు వీరపత్ని అయిన చానమాంబ, వీరమాత ప్రోలమ రెచ్చగొట్టి తిరిగి యుద్ధరంగానికి పంపారు. అతడు విజయుడై వీరస్వర్గము పొందాడు[1]. ఆనాటి సామాజిక ఆచారం ప్రకారం భర్తతో చానమ్మ సహగమనం చేసింది.[3]

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు, ప్రోలమ గురించి -

"ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అన్నట్లు కవి తిక్కన్నను, ఖడ్గతిక్కన్నను తెలుగు ప్రజలకు కానుక ఇచ్చిన తల్లి ప్రోలమ . . . అత్త కవయిత్రి. కోడలు కవయిత్రి కుమారుడు కవిబ్రహ్మ" అని పేర్కొన్నారు.

చానమాంబ గురించి -

"ఆమె నలువరాణికి తెలుగు చానలు ఉపాయముగా పచరించిన తొలి పూజా పద్మము.
ఆమె భారతీసతి మంజులపద రాజీవములకడ మొకరిలిన మొదటి పూజారిణి.
ఆమె వాగ్దేవీ సంసద్భవమున అంధ్ర కవయత్రీ ప్రతినిధ్యము నంగీకరించిన ప్రధామాస్థాని.
ఆమె సుందరాంధ్ర మహిళావాఙ్మయాంబరమున నుదయించిన తొలితార",

అని అభివర్ణించింది.

చానమ, ప్రోలమల కవితా ధోరణులు ఈ క్రింది సందర్భాలలో ప్రస్తావిస్తారు. పరీభూతుడయి శత్రువులకు వెన్నిచ్చి పారిపోయి వచ్చిన పతిని చూసి వీరపత్ని అయిన చానమాంబ హృదయమునుండి అవమానంతో కూడిన వీరరసావిష్కరణ ఈక్రింది కంద పద్య రూపములో సాక్షాత్కారము చెందినది.

పగరకు వెన్నిచ్చినచో,
నగరే నిను మగతనంపునాయకు లెందున్?
ముగు రాడు వారమైతిమి;
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్?

భోజనానికి కూర్చున్న ఖడ్గ తిక్కనతో తల్లి ప్రోలమ ఈ పద్యం చెప్పిందిట.[1][2]

అసదృశముగ నరివీరుల -
మసిపుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
కసవున్ మేయగ పోయిన - పసులున్
విరిగినవి; తిక్క! పాలున్ విరిగెన్’

ఖడ్గ తిక్కన వీరత్వం కొరకు చాటువులుగా చెప్పిన ఈ కంద పద్యాలు తప్ప వీరి ఇతర రచనలు లభించలేదు. లింగాలకొండ, సోమశిల యుద్ధవీరుల గాధలు నెల్లూరు ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉన్నాయి. సోమశిల దగ్గర సోమేశ్వర ఆలయం దగ్గర ఉన్న వీరుని విగ్రహం ఖడ్గ తిక్కనదే అని చెపుతారు. నాడు కవితా శక్తి కల ఇలాంటి స్త్రీలు రాజ్యం కోసం, భర్త, పుత్రులకోసం త్యాగాలు చేసారు. [3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి (1958). "చానమ, ప్రోలమ". ఆంధ్ర కవయిత్రులు (in తెలుఁగు). రాజమహేంద్రవరం: బత్తుల కామాక్షమ్మ. pp. 1–3.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 మందలపర్తి, కిషోర్ (20 April 2018). "తొలి తెలుగు కవయత్రి ఎవరు?". ఆంధ్రభూమి. Retrieved 20 May 2023.
  3. 3.0 3.1 భవానీ దేవి, సి. (19 February 2023). "ప్రాచీన తెలుగు కవయిత్రుల రచనలు - చారిత్రిక, సామాజిక, సాంస్కృతిక దృక్పధం". సంచిక: తెలుగు సాహిత్య వేదిక.
"https://te.wikipedia.org/w/index.php?title=చానమాంబ&oldid=3922880" నుండి వెలికితీశారు