Jump to content

చిత్తప్రసాద్ భట్టాచార్య

వికీపీడియా నుండి
(చిత్తప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
చిత్తప్రసాద్ భట్టాచార్య
బాల్య నామంచిత్తప్రసాద్ భట్టాచార్య
జననం(1915-06-21)1915 జూన్ 21
నైహతి,ఉత్తర 24 పరగణాలు జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, భారతదేశం
మరణం1978 నవంబరు 13

చిత్తప్రసాద్ భట్టాచార్య 20వ శతాబ్ది మధ్యకాలానికి చెందిన అత్యంత గుర్తింపు పొందిన భారతీయ రాజకీయ కళాకారుడు. ఆయన నీటిరంగులు, ప్రింట్ మేకింగ్‌లకు ప్రాధాన్యతనిచ్చాడు. కాన్వాసుపై ఆయిల్ కలర్లు ఉపయోగించ లేదు. వామపక్ష ఆలోచనలు ప్రసరింపజేసేందుకు చిత్తప్రసాద్ ప్రింట్లు వాడాడు.[1]

విశేషాలు

[మార్చు]

చిత్తప్రసాద్ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా, నైహతిలో జన్మించాడు[2]. ఇతని తల్లిదండ్రులు సాహిత్య సంగీతాలలో ప్రవేశం ఉన్నవారు కనుక ఇతని కళాభిరుచికి ప్రోత్సాహం లభించింది. తండ్రి ఉద్యోగ రీత్యా బెంగాల్ అంతటా తిరుగుతూ వుంటే ఇతడూ తిరిగాడు. ఇతని విద్యాభ్యాసం విప్లవ కార్యకలాపాలకు కేంద్రమైన చిట్టగాంగ్, బంకురాలలో కొనసాగింది[3]. చిట్టగాంగ్‌లో ఇంటర్ చదివి ఉత్తీర్ణుడయ్యాడు. "రాజకీయాలలో పాల్గొనని" వ్రాసి ఇస్తే కాని సీటు ఇవ్వనన్న కలకత్తా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిన్సిపాల్‌ షరతును తోసిపుచ్చి ప్రజల మధ్యనే తన కళకు మెరుగులు దిద్దుకున్నాడు. "నీకు మేము నేర్పేది ఏమీ లేదు. నీ పద్ధతిలోనే అలా కొనసాగించు. ఒకనాటికి మమ్మల్ని మించిపోతావు" అని శాంతినికేతన్ నిర్వాహకులు రవీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోసులు ఇతడిని ప్రశంసించారు[3].

ఇతడు అభ్యుదయ రచయితల సంఘం, భారత ప్రజానాట్యమండలి తొలి రోజులనుండి వాటితో అనుబంధం కలిగి ఉన్నాడు. కమ్యూనిస్టుల "పీపుల్స్ వార్" పత్రికలో పనిచేశాడు. ఇతడు చిత్రకారుడు మాత్రమే కాదు. స్వయంగా కవి, గాయకుడు, రచయిత కూడా. 1945లో కలకత్తాలో జరిగిన ఫాసిస్టు వ్యతిరేక రచయితలు - కళాకారుల వార్షిక సభలో ఇతడు వ్రాసిన పాటలు రెండింటిని ప్రజానాట్యమండలి కళాకారులు గానం చేయగా శ్రోతలు ఉర్రూతలూగారు. ఇతని కవితలు ఆనాటికే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. ఇతడు బెంగాలీ జానపద గాథలను తన స్వంతబాణీలో తిరగరాసి తన బొమ్మలతో సహా ఒక సంపుటంగా ప్రచురించాడు[3].

ఇతడు తన ముందున్న వివిధ భారతీయ, విదేశీయ, సాంప్రదాయ, ఆధునిక కళారీతులను నిశితంగా పరిశీలించాడ్డు. జర్మన్ కాత్‌కొల్విట్జ్, మెక్సికన్ చిత్రకారులు, చైనీస్-జపానీస్ ఉడ్ కట్ రీతులు, గోయా రాజకీయ వ్యంగ్య చిత్రాలు, మనదేశపు మొఘల్, రాజ్‌పుట్ సూక్ష్మచిత్ర రీతులు, బౌద్ధ గుహాకుడ్య చిత్ర, శిల్పాలు, డేవిడ్‌లో ఆధునికత అన్నింటినీ ఇతడు అధ్యయనం చేశాడు. వీటన్నింటినీ తను ప్రత్యక్షంగా చూసి ప్రేరణ పొందిన బెంగాల్ జానపద కళారీతులతో సమన్వయ పరచుకున్నాడు. తనదైన విశిష్టశైలిని ఏర్పరచుకున్నాడు[3].

"గ్రాఫిక్స్" జాబితాలోని లినోకట్, ఉడ్ కట్ ప్రక్రియలపై అధికారం సాధించాక వాటిని ప్రజలను చైతన్యవంతులను చేసే కృషిలో పెద్ద ఎత్తున, క్రమబద్ధంగా, శక్తివంతంగా వినియోగించిన తొలి చిత్రకారుడు చిత్తప్రసాద్. చాలా కాలం ఇతడు ఈ విధానాన్నే కొనసాగించాడు[3].

ముప్పై లక్షలమంది అమాయక ప్రజల్ని కబళించిన చరిత్ర ప్రసిద్ధమైన బెంగాల్ కరువు ప్రాంతాలలో ఇతడు 1943-44లో స్వయంగా పర్యటించి గుండెల్ని పిండివేసే ఆకలి చావులను చిత్రబద్ధం చేశాడు. పొట్టలు పెంచుకుంటున్న బ్లాక్‌మార్కెటీర్లను, వారికి అండగా నిలిచిన బ్రిటిష్ పాలక వర్గాన్ని తన శక్తివంతమైన కళ ద్వారా బహిర్గతం చేశాడు. వాటిని ప్రచురించిన పత్రికలే భయపడి ఆ తర్వాత వాటిని ధ్వంసం చేశాయి[3].

1946లో ఇతడు బొంబాయికి తరలివెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. 1949లో ప్రపంచ శాంతి సంఘం పిలుపుపై అనేక చిత్రాలను రూపొందించి ఉద్యమానికి అంకితం చేశాడు. 1950లో "కేలాఘర్" అనే పేరుతో ఒక పప్పెట్ థియేటర్‌ను నెలకొల్పాడు. ఆ ప్రాచీన కళారీతిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాడు. 1946-48 మధ్య కాలంలో తెలుగువారిని, తెలుగు ప్రజల సాయుధ పోరాటాల్ని కళ్ళకు కడుతూ ఎన్నో చిత్రాలను గీశాడు. నిజాం వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటాన్ని మరే చిత్రకారుడూ చేయని విధంగా శక్తివంతంగా ప్రజల కళ్ళకు కట్టేటట్లు చేశాడు. ఇతని రేఖలలో తెలుగు రైతులు, మహిళలు చిత్రితమయ్యారు[3].

ఇతడు మొదటి నుండి తనదైన నైతిక - రాజకీయ దృక్పథాలకు కట్టుబడి బ్రతికిన కళాకారుడు. తన కళను అమ్మి జీవించడానికి ఇతడు నిరాకరించాడు. తన మనసుకు నచ్చని చిత్రాలను గీయలేకపోయాడు. తాను మనసా వాచా నమ్మిన మార్క్సిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడు. ఇతని గ్రాఫిక్స్ మొదట ఏ గ్యాలరీలలోను భద్రపరచబడలేదు. పిదప డిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో, చెకొస్లోవేకియా రాజధాని ప్రేగ్‌లోని జాతీయ మ్యూజియంలో, ముంబాయిలోని ఓషియన్ ఆర్ట్ ఆర్కైవ్‌లో, దుబాయిలో, రష్యాలో, అమెరికాలో ఇతని చిత్రాలు భద్రపరచబడి ఉన్నాయి. చెకొస్లోవేకియాలో ఇతనిపై ఒక డాక్యుమెంటరీ చిత్రం తీయబడింది[3].

మరణం

[మార్చు]

1978లో కాలికి దెబ్బ తగిలి అనారోగ్యం పాలై ఇతడు కలకత్తాకు తరలించబడ్డాడు. 1978, నవంబరు 13వ తేదీన ఇతడు తన 63వ యేట మరణించాడు[3].

References

[మార్చు]
  1. Manifestations II, Rabina Karode, Delhi Art Gallery 2004, ISBN 81-902104-0-8
  2. Sen, Arup Kumar (March 5, 2016). "Chittaprosad Bhattacharya (1915–78)". Economic & Political Weekly. Vol. LI, no. 10.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 చలసాని, ప్రసాద్‌రావు (1 March 1992). "ప్రజా కళాకారుడు చిత్తప్రసాద్" (PDF). మిసిమి. 2 (32): 33–35. Retrieved 29 March 2018.[permanent dead link]