చిలకలూరిపేట బస్సు దహనం ఘటన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట సమీపంలో ఇద్దరు దుండగులు ఒక బస్సును తగలబెట్టిన ఘటన, చిలకలూరిపేట బస్సు దహనం ఘటన. 1993 మార్చి 8 న హైదరాబాదు నుండి చిలకలూరిపేట వెళ్తున్న బస్సులో దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టిన ఈ ఘటనలో 23 మంది మరణించారు. [1]

ఘటన వివరాలు[మార్చు]

1993 మార్చి 7 రాత్రి హైదరాబాదు నుండి చిలకలూరిపేటకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు మార్చి 8 తెల్లవారు ఝామున నర్సరావుపేటలో ఆగి, 4:10 కి తిరిగి బయలుదేరింది. పట్టణం లోని రైల్వే క్రాసింగు వద్ద సాతులూరి చలపతిరావు, గెంటెల విజయవర్ధనరావు అనే ఇద్దరు వ్యక్తులు బస్సెక్కి చిలకలూరిపేటకు టిక్కెట్టు తీసుకున్నారు. కొంతదూరం ప్రయాణించాక వారిద్దరూ బస్సులో పెట్రోలు విరజిమ్మారు. అది గమనించి బస్సు డ్రైవరు లైట్లు వేసి, బస్సును ఆపాడు. వారిద్దరూ కిందికి దిగిపోతూ ఆగిప్పుల్ల వెలిగించి బస్సుకు నిప్పు పెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 32 మందిలో 23 మంది సజీవదహనమై పోయారు. మిగిలినవారు తప్పించుకోగలిగారు. తప్పించుకున్నవారిలో ఇద్దరిని దుండగులు వెంటాడి, వారివద్ద నున్న డబ్బును దోచుకున్నారు. [2]

నిందితులిద్దరినీ మార్చి 18 న పోలీసులు పట్టుకున్నారు.

విచారణ, శిక్ష[మార్చు]

గుంటూరు సెషన్సు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రెండేళ్ళ విచారణ తరువాత, 1995 సెప్టెంబరు 7 న నిందితులిద్దరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. [3] దోషులు హైకోర్టుకు అప్పీలు చెయ్యగా అది కింది కోర్టు విధించిన శిక్షను ధ్రువీకరించింది. దోషులు తిరిగి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోగా, 1997 ఆగస్టు 28 న అక్కడ కూడా శిక్షను ధ్రువీకరించారు. తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ దోషులు రాష్ట్రపతికి విన్నవించుకోగా, అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ దాన్ని తిరస్కరించాడు. 1998 మార్చి 29 న దోషులకు ఉరి వేసేందుకు సన్నద్ధమయ్యారు.

అయితే ఒక్క రోజు ముందు, మార్చి 28 న, రచయిత్రి మహాశ్వేతాదేవి, రాష్ట్రపతి నుండి జ్ఞానపీఠ పురస్కారం అందుకునే సందర్భంలో, దోషుల తరపున మరొక క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతికి సమర్పించింది. ఆ వెంటనే, క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్నందున, దానిపై నిర్ణయం వెలువడే వరకు ఉరితీతను ఆపాలని సుప్రీం కోర్టులో ఒక కేసు వేసారు. సుప్రీం కోర్టు వెంటనే దాన్ని విచారించి, ఉరిని ఆపాలని తీర్పునిచ్చింది. [2]

ఆ రాత్రే ఈ తీర్పును జైలు అధికారులకు పంపగా, మరుసటిరోజు తెల్లవారుఝామున అమలు చెయ్యాల్సిన ఉరిని ఆపారు. ఆ తరువాత వచ్చిన రాష్ట్రపతి, కె.ఆర్. నారాయణన్ ఆ క్షమాభిక్ష అభ్యర్థనపై స్పందించి, దోషులిద్దరికీ క్షమాభిక్ష ప్రసాదించాడు. దానితో ఉరిశిక్షను యావజ్జీవ జైలుశిక్షగా మార్చారు. [3]

మూలాలు[మార్చు]

  1. Dec 20, TNN / Updated:; 2016; Ist, 12:02 (2016-12-20). "20 years ago, midnight call stopped hangman | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2017-03-06. Retrieved 2017-03-06. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 ఆలమూరు, సౌమ్య (2021-11-26). "చిలకలూరుపేట బస్సు దహనం (1993) కేసు: 23 మంది మృతికి కారణమైన దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే..." BBC News తెలుగు. Archived from the original on 2022-01-01. Retrieved 2022-08-23.
  3. 3.0 3.1 "సుప్రీం జోక్యంతో చివరి ఘడియల్లో ఆగిన 'ఉరి'". Samayam Telugu. Archived from the original on 2022-08-06. Retrieved 2022-08-06.