Jump to content

చెన్నై ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
చెన్నై ఎక్స్‌ప్రెస్
చిత్ర పోస్టర్
దర్శకత్వంరోహిత్ షెట్టి
స్క్రీన్ ప్లేయూనుస్ సజావల్
కథకె. సుభాష్
నిర్మాతగౌరీ ఖాన్
రోనీ స్క్రూవాలా
సిద్ధార్థ్ రాయ్ కపూర్
తారాగణందీపిక పదుకొనే
షారుఖ్ ఖాన్[4]
ఢిల్లీ గణేష్
ఛాయాగ్రహణండూడ్లే
కూర్పుSteven H. Bernard
సంగీతంవిశాల్ - శేఖర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుయూటీవీ పిక్చర్స్[5]
విడుదల తేదీs
8 ఆగస్టు 2013 (2013-08-08)(United Kingdom,[1] United States[2])
9 ఆగస్టు 2013 (Worldwide[3])
సినిమా నిడివి
141 minutes[1]
దేశంభారత్
భాషహిందీ
బడ్జెట్750 మిలియను (US$9.4 million)[6]

చెన్నై ఎక్స్‌ప్రెస్ 2013 లో విడుదలై మనదేశ చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హిందీ చిత్రం.

రాహుల్ (షారుఖ్ ఖాన్) 40 ఏళ్ళ బ్రహ్మచారి. ముంబైలో తన తాత నడిపే వై. వై. మిఠాయివాలా స్వీట్ షాపుల బ్రాంచులను పర్యవేక్షిస్తూ ఉంటాడు. 8 ఏళ్ళ వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాహుల్ తన తాత, బామ్మల పెంపకంలో పెరిగాడు. నిజానికి రాహుల్ చాలా ధనవంతుడు. ఎంతో మంది అమ్మాయిలని ప్రేమించాలనుకుంటాడు. కానీ 99 ఏళ్ళ వయసున్న తన తాత వై. వై. మిఠాయివాలా తన ప్రేమ, పెళ్ళి జరగనివ్వడంలేదని బాధపడుతుంటాడు. తన తాత 100 ఏళ్ళ పుట్టినరోజు వేడుక రోజు తన తాత సచిన్ టెండూల్కర్ అభిమాని అవ్వటం వల్ల సచిన్ 99 పరుగులకే ఔటవ్వడం తట్టుకోలేక గుండెపోటుతో మరణిస్తాడు. దానితో రాహుల్ తన స్నేహితులతో కలిసి గోవాకి వెళ్ళాలనుకున్న ప్లాన్ ఫెయిలై తను రామేశ్వరం వెళ్ళాల్సి వస్తుంది. తన తాత అస్తికల్లో సగభాగాన్ని తన బామ్మ కాశీలో, తను మిగిలిన సగాన్ని రామేశ్వరంలో కలపాలనేది తన తాత చివరి కోరిక అని తెలుసుకుంటాడు రాహుల్. ఐతే గోవాలో కలిపితే అవే నీళ్ళు రామేశ్వరం చేరుకుంటాయని తన స్నేహితులు తనకి సూచిస్తారు. తన బామ్మ తనని స్టేషను దాకా తోడొస్తాననడంతో రాహుల్ ఓ ప్లాన్ వేస్తాడు. ముంబైలో చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కి వచ్చే కళ్యాణ్ స్టేషనులో దిగిపోయి అక్కడి నుంచి రోడు మీదుగా గోవా వెళ్ళాలని తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేస్తాడు. అన్నీ అనుకున్నట్టుగానే చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కి తన బామ్మ నుంచి తప్పించుకుంటాడు.

కళ్యాణ్ స్టేషను రాగానే అస్తికలు ట్రైనులో మర్చిపోయి దిగిపోయిన రాహుల్ తన స్నేహితులని కలిసాక అస్తికలు ట్రైనులోనే ఉన్నాయని తెలుసుకుని మళ్ళీ చెన్నై ఎక్స్‌ప్రెస్ కదిలేలోపే ఎక్కి అస్తికలు తీసుకుని మెల్లగా కదులుతున్న ట్రైను నుంచి దిగిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ట్రైన్ అందుకోవాలని పరిగెడుతున్న ఓ అందమైన అమ్మాయి (దీపిక పదుకొనే) కి చెయ్యందించి ట్రైనులోకి లాగుతాడు. అదే రకంగా తను దిగే లోపు మరో నలుగురు మగాళ్ళని ట్రైనెక్కించి చివరికి తను దిగే లోపే ట్రైన్ స్టేషను వదిలి వెళ్ళిపోయిందని తెలుసుకుంటాడు. తమిళంలో సంభాషిస్తున్న ఆ అమ్మాయినీ, ఆ నలుగురు యువకులనీ మీ వల్లే నేను స్టేషను మిస్స్ అయ్యానని మందలిస్తాడు. ఆ నలుగురూ ఆజానుబాహులూ, దీర్ఘకాయులూ అవటం చేత రాహుల్ వారు కోపంగా చూడగానే భయపడిపోతాడు. కొన్ని సంఘటనల వల్ల తను కూడా ఈ నలుగురితో కలిసి వాళ్ళ ఊరైన కొంబన్ కౌం వెళ్ళాల్సివస్తుంది. ఈ ప్రయాణంలో ఆ తమిళ్ అమ్మాయిని అసలిక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నిస్తాడు. తను తన సందేహాలన్నిటినీ తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఆ అమ్మాయికి హిందీ రావడం వల్ల తన చరిత్రంతా చెప్తుంది. ఆ అమ్మాయి పేరు మీనలోచని అళగసుందరం. అందరూ తనని మీనా లేక మీనమ్మా అని పిలుస్తుంటారు. తనతో ఉన్న ఆ నలుగురు రౌడీలు తన బంధువులు. తన తండ్రి దుర్గేశ్వర అళగసుందరం (సత్యరాజ్) దక్షిణ భారతదేశంలో ఉన్న శక్తివంతమైన డన్ లలో ఒకరు. కొంబన్ కౌం ఊరిలో దుర్గేశ్వర అళగసుందరం అంటే అక్కడి ప్రజలకు ఎనలేని గౌరవం. ఆయన్ని అక్కడంతా పెరియతలై (పెద్దరాయుడుతో సమానం) అని పిలుస్తారు. తన బలాన్ని మరింత పెంచుకోడానికి మీనాను తన స్నేహితుడి కొడుకైన తంగవల్లి (నికితిన్ ధీర్) కిచ్చి బలవంతంగా పెళ్ళిచెయ్యాలనుకుంటాడు. అందుకే తను ఇంటి నుంచి పారిపోతుంది.

ఇదంతా విన్నాక రాహుల్ అనవసరంగా ఈ అమ్మాయినీ, ఆ నలుగురినీ ట్రైనెక్కించి చివరికి తన ప్రాణాలమీదకి తెచ్చుకున్నానని తెలుసుకుని బాధపడతాడు. కొంబన్ కౌం చేరాక మీనా తమిళంలో తన తండ్రితో రాహుల్ తనని ప్రేమించాడని, తనూ అతన్ని ప్రేమించిందని, ఇద్దరం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని అబద్ధం ఆడుతుంది. ఐతే రాహుల్ చిన్నపటినుంచీ ఉత్తర భారతదేశంలో పెరిగాడు కనుక తనకి తమిళ్ రాదని చెప్తుంది. అది నిజమే అని నమ్మి దుర్గేశ్వర అళగసుందరం వీళ్ళ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోడానికి వాళ్ళిద్దరినీ కొంబన్ కౌం తీసుకెళ్తాడు. దారిలో మీనా తను ఆడిన అబద్ధాలని రాహుల్ ముందు చెప్పేస్తుంది. దానితో రాహుల్ ఇంకా భయపడిపోతాడు. ఇదంతా తప్పించుకోడానికేనని, దారి దొరకంగానే అక్కడి నుంచి పారిపోదామని సద్దిచెప్పడంతో రాహుల్ మనసు కొంత కుదుట పడుతుంది. కొంబన్ కౌంలో ఉన్న మీనా ఇంట్లో రాహుల్ ఓ రోజు అక్కడి ఇన్స్పెక్టర్ షమ్షేర్ సింగ్ ని కలుస్తాడు. స్వతహాగా పంజాబీ ఐన షమ్షేర్ సింగ్ కొంబన్ కౌంలో డ్యూటీ చేస్తుండటం వల్ల తమిళ్ బాగా మాట్లాడగలడు. రాహుల్ మీనాని ప్రేమించాడని నమ్ముతున్నాడు కనుక తంగవల్లి నీ ప్రాణం తీస్తాడని షమ్షేర్ హెచ్చరిస్తాడు. ఇంతలో తంగవల్లి రానే వస్తాడు. ఐతే తమిళంలో ప్రేమగా మాట్లాడుతుండటంతో షమ్షేర్ సింగ్ ఎంత వారిస్తున్నా వినకుండా రాహుల్ తంగవల్లితో ఒప్పందానికి సమ్మతం ప్రకటిస్తాడు. తంగవల్లి వెళ్ళిపోయాక షమ్షేర్ ద్వారా తంగవల్లి రాహుల్ ఆ రాత్రి జరిగే సంబరాల్లో ఒకరితో ఒకరు పోరాడుతారని, ఎవరు గెలిస్తే మీనా వారిదేనని షరతు పెట్టాడని, తమిళ్ రాకపోవడం వల్ల తను ఆ ఒప్పందానికి అంగీకారం తెలిపానని తెలుసుకుంటాడు. ఆ రాత్రి షమ్షేర్ సహాయంతో కొంబన్ కౌం నుంచి రాహుల్ తప్పించుకుంటాడు. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల మళ్ళీ కొంబన్ కౌంకి తిరిగి వస్తాడు.

ఆ రోజు తంగవల్లి, మీనాల పెళ్ళి జరుగుతూ ఉంటుంది. మీనా గొంతుమీద కత్తి పెట్టి మొత్తానికి రాహుల్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ప్రమాదం లేదనుకుని కొంత దూరం వెళ్ళాక ఇద్దరూ గొడవ పడి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఐతే దిక్కుతోచని రాహుల్ మళ్ళీ మీనా దగ్గరికి వచ్చేస్తాడు. ఇద్దరూ కలిసి కొంత దూరంలో ఉన్న విధాంబ అనే కుగ్రామానికి వెళ్ళి కొత్తగా పెళ్ళైన జంటగా నాటకమాడి అక్కడ తలదాచుకుంటారు. విధాంబ గ్రామ ప్రజలు వారిరువురినీ ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కొన్ని సంఘటనల వల్ల మీనా రాహుల్ ని ప్రేమిస్తుంది. ఇదిలా ఉండగా ఓ నాడు రాహుల్ విధాంబ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మీనా విధాంబ గ్రామ ప్రజల మనసు గాయపరిచిన వాళ్ళమౌతామని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తుంది. ఐనా రాహుల్ వినిపించుకోకుండా కోపంలో అతికలు మీనా దగ్గరే వదిలేసి తన మనసును గాయపరిచి వెళ్ళిపోతాడు. ఐతే ఎందుకో తను చేసింది తప్పనుకుని తిరిగి విధాంబలో ఉన్న తన ఇంటికి బయలుదేరుతుండగా తంగవల్లి అతన్ని కొట్టి తనతో పాటు విధాంబకు వెళ్తాడు. అక్కడ మీనా, రాహుల్ జంటను ఆ ఊరి ప్రజలు తంగవల్లి నుంచి కాపాడి వాళ్ళు పారిపోడానికి జీప్ ఇస్తారు. ఇంత ప్రమాదకర పరిస్తిథిలోనూ మీనా తన తాత అస్తికలు తీసుకుని రావడం చూసి రాహుల్ మనసులో కదలికలు మొదలౌతాయి. ఇద్దరూ రామేశ్వరం వెళ్ళి ఆ అస్తికలను సముద్రంలో కలిపేస్తారు. అప్పటికే మీనాని ప్రేమిస్తున్న రాహుల్ మీనా నిద్రపోతుండగా తనని తీసుకుని కొంబన్ కౌంలో ఉన్న తన ఇంటికి వెళ్తాడు. అక్కడ దుర్గేశ్వర అళగసుందరంతో నీ కూతురు మనసును అర్థం చేసుకోని నువ్వూ ఓ తండ్రివేనా అని నిలదీస్తాడు. అక్కడికి వచ్చిన తంగవల్లినీ, అతని మనుషులనీ తనతో పోరాడమని రెచ్చగొడతాడు. అప్పుడె మొదటిసారిగా తను మీనాని ప్రేమిస్తున్నాని అందరి ముందూ చెప్తాడు.

తంగవల్లితో, అతని మనుషులతో పోరాడి పూర్తిగా రక్తసిక్త దేహంతో రాహుల్ విజయం సాధిస్తాడు. తంగవల్లి, దుర్గేశ్వర అళగసుందరం ఇద్దరూ తమ మనసులను మార్చుకుని మీనాని పెళ్ళి చేసుకునేందుకు రాహుల్ ని అనుమతిస్తారు. దానితో బాగా దెబ్బలు తిన్న రాహుల్, రాహుల్ పరిస్తిథిని చూసి కన్నీటి పర్యంతమైన మీనా ఒకరినొకరు హత్తుకుంటారు. సామాన్య మానవుడు పట్టుదలతో కృషిచేస్తే ఏం తలుచుకున్నా సాధించగలడనీ, ప్రేమకి కులం, మతం, ప్రంతం. భాష భేదాలు ఉండవనే సందేశంతో కథ సుఖాంతమౌతుంది.

పాటలు

[మార్చు]
  • బన్ కే తిత్లీ దిల్ ఉడా, ఉడా, ఉడా కహీ దూర్
  • లుంగీ డ్యాన్స్

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "CHENNAI EXPRESS (12A)". British Board of Film Classification. 31 July 2013. Retrieved 1 August 2013.
  2. "Chennai Express (2013) – Box Office Mojo". Box Office Mojo. Retrieved 6 August 2013.
  3. "Chennai Express Date Shifted". Taran Adarsh. 18 July 2013. Retrieved 18 July 2013.
  4. "Chennai Express The Characters". Chennai Express. Archived from the original on 6 జూలై 2013. Retrieved 15 April 2013.
  5. "Chennai Express Finally Chugs Off". New York Daily Times. 28 September 2013. Archived from the original on 12 అక్టోబరు 2012. Retrieved 28 September 2012.
  6. "Movie preview: Fun ride on Chennai Express". Deccan Herald. 6 August 2013. Retrieved 7 August 2013.