జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ భావాలు, సిద్ధాంతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జవాహర్‌లాల్ నెహ్రూను సామ్యవాదం, ప్రజాస్వామ్య దృక్పథం, శాసనోల్లంఘన, జాతీయవాదం, లౌకికవాదం వంటి రాజకీయ ఆర్థిక భావాలు,పద్ధతులు, సిద్ధాంతాలు ప్రభావితం చేయగా, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అలీనవాదాన్ని ప్రపంచానికి అందించాడు.

లౌకిక వాదం[మార్చు]

జవాహర్‌లాల్ తొలి నుంచీ లౌకిక వాది. దానికి బీజాలు బాల్యంలోనూ, ముస్లింలతో సాధారణంగా కాశ్మీరీ పండిట్లు చూపే ఏకీభావంలోనూ లోతుగా ఉన్నాయి. మతసమస్యను జవాహర్‌లాల్ ఏనాడూ విలువనిచ్చి చర్చించదగ్గ విషయంగా భావించలేదు. అందుకు ప్రతిగా మతకలహాలు కేవలం ఊహాత్మకమైన విషయాలపై ఆధారపడ్డవని తిరస్కరించేవాడు. ఇందుకు జవాహర్ దృష్టిలో ఉన్న పరిష్కారం మతమనే దాన్ని దుర్బలపరిచి అదుపులో పెట్టడం, రాజకీయాల్లో లౌకిక భావనలు వ్యాప్తిచేయడం. ఈ అభిప్రాయాలు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మతకలహాలను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతీసారీ దృఢపడుతూనే వచ్చింది. ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు అనే మూడిటి పట్టు నుంచి భారతదేశాన్ని విముక్తం చేయాలని అభిప్రాయపడేవాడు. మత హింసపై ఇస్లాంకి నమ్మకం లేదనీ, గజినీ వంటివారు కేవలం దోపిడీ కోసమే ఆలయాల మీద పడ్డారు తప్ప దానిలో ఇస్లాం ప్రమేయం లేదని వాదించేవాడు.[1] 1933లో హిందూ మత తత్వంపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన జవాహర్‌లాల్ ఇస్లాం మత తత్వాన్ని మాత్రం కొంత మృదువైన ధోరణిలో ఖండించాడు. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండడం, మైనారిటీలు కావడం వల్ల వారి భయాలు అర్థం చేసుకోవాలని నమ్మేవాడు. నిష్కపటమైన మతతత్వం భయం వల్ల, బూటకపు మతతత్వం రాజకీయ ప్రతీపవాదమనీ వర్గీకరించేవాడు.[2] జవాహర్ జీవితచరిత్రకారుడు ఎస్.గోపాల్ ఈ అంశాన్ని "ఈ సమస్యను జవాహర్‌లాల్ జాగ్రత్తగా పరిశీలించనిమాట నిజమే... హిందూ ముస్లిం మతతత్వాల మధ్య ఒక దానిని మనం మంచిదని ఎంపిక చేసుకోవచ్చునని చెప్పడం అనేక ప్రమాదకరమైన సంభావ్యతలకు చోటిచ్చే అవాంఛనీయ విషయం" అని వ్యాఖ్యానించాడు.[3]

సామ్యవాదం[మార్చు]

ఐరోపా పర్యటన (1926-1928)కు ముందు జవాహర్‌లాల్ రాజకీయ పరమైన అంశాలను ఆర్థికపరమైన విషయాలతో ఏ సంబంధం లేని శుద్ధ రాజకీయాలుగా చూసేవాడు. 1929-30 నాటికి జవాహర్‌లాల్ రాజకీయ భావజాలంలో ఆర్థికాంశాలు విడదీయరాని అంశాలుగా ముడిపడిపోయాయి. ఈ దశలోనే అతనికి సోషలిజంపై తీవ్ర అభిమానం ఏర్పడింది. వ్యవసాయ భూములను చిన్న చిన్న కమతాలుగా ఏర్పరిచి జమీందారీ రద్దుచేసి, ఒక్కో రైతుకు ఒక్కో కమతాన్ని ఇవ్వాలని, భూములు కమ్యూనిస్టు దేశాల్లోలాగా జాతీయీకరించకూడదు కానీ ఆ కమతాలను రైతు అమ్మే వీలు ఉండకూడదనీ, వ్యావసాయిక ఋణాలను కొంత చెల్లించాకా మాఫీ చేయాలని భావించేవాడు. కీలకమైన పరిశ్రమల జాతీయీకరణ గురించి 1929లోనే ఆలోచించాడు.

సామ్యవాదం అన్న ఆర్థిక ప్రణాళిక జవాహర్‌ను 1928 తర్వాత ఎప్పుడూ ఉత్తేజితం చేస్తూనే ఉండేది. 1930ల తొలినాళ్ళలో జమీందారీలను స్వాధీన పరుచుకోవడం, వ్యవసాయం చేస్తున్న రైతులను భూమికి స్వంతదారులను చేయడం, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను ప్రభుత్వం నిర్వహిస్తూ రైతులను వాటిలో ప్రయోగాలు చేయమని ప్రోత్సహించడం వంటి ఆలోచనలు చేశాడు.[4] ఆ క్రమంలో పన్నులు ఎలా ఉండాలన్న వరకు అతని ఆలోచనలు సాగాయి. కానీ వీటన్నిటినీ సుదూర భవిష్యత్తులో అమలులోకి తేగలిగినవిగా భావించాడు. రాజకీయ కారణాల దృష్ట్యా వీటికై వెనువెంటనే ప్రయత్నాలు ప్రారంభించి జమీందార్లను, పెట్టుబడిదార్లను కాంగ్రెస్ శత్రువులను చేసుకోవడం అవివేకమనీ అతని భావన. పైగా పేద, మధ్య తరహా రైతులకూ, జమీందార్లు, పెట్టుబడిదార్లకు మధ్య వర్గ సంఘర్షణ పోరాట రూపం తీసుకోకుండా కాంగ్రెస్ పనిచేస్తోందని, అది మంచికేననీ నమ్మాడు.[5] 1933 నాటికి ప్రపంచశక్తుల అల్లికలో భాగంగా భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. సార్వత్రికంగా ఒక ఊపు కనిపిస్తోందని, ప్రపంచం అటు నిర్దుష్టమైన సోవియట్ పద్ధతిలోనిది కాని సామ్యవాదాన్ని కానీ, ఇటు ఫాసిజాన్ని కానీ - ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని భావించాడు. జవాహర్‌లాల్ మొగ్గు సామ్యవాదం వైపు ఉండేది.[6] జాతీయవాదులు రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూనే ఆర్థికంగా జమీందార్లు, సంస్థానాధీశులు, పెట్టుబడిదారులను తమ పూర్వ స్థితిలో ఉండనిస్తే, అది స్వాతంత్ర్యం కాదని భావించేవాడు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం సాధించకుండా ఆర్థిక దుస్థితిని మార్చే ప్రయత్నాలు చేయడమంటే శక్తిని వృధా చేయడం కాబట్టి ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాల్లో తనకు అంతగా పొసగకున్నా, గాంధీ సమర్థత మీద విశ్వాసం ఉంచి అతన్నే బలపరుస్తూ వచ్చాడు.[7]

అహింస[మార్చు]

1928 నుంచి అహింసను మౌలిక సిద్ధాంతంగా కాక స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పద్ధతిగా మాత్రమే స్వీకరించాడు. ప్రధానంగా సోషలిజం సాధించే క్రమంలో వివిధ వర్గాల ప్రయోజనల వల్ల పుట్టే ఘర్షణను అహింసా సిద్ధాంతం పేరుతో నిరాకరించరాదనీ, అవసరమైతే పోరాడి సాధించుకోవచ్చనీ భావించేవాడు. తీవ్రమైన అహింసాత్మక సహాయ నిరాకరణాన్ని స్వీకరించింది భారతదేశ పరిస్థితుల రీత్యా దౌర్జన్యకరమైన పద్ధతులు అనుసరించడం చివరకు విప్లవ ప్రతీఘాతమైన ఫలితాలు లభిస్తాయన్న కారణంతోనే. లాహోర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో ఉండి భారతదేశం తన లక్ష్యాలను చేరుకోవడానికి హింసాత్మక విధానాలు అవలంబించడం సరైనదైతే అవలంబించవచ్చనీ, కానీ కాంగ్రెస్ ప్రస్తుత స్థితిలో వ్యవస్థీకృతమైన హింస చేపట్టలేదని, ఆ కారణంగా అహింసాత్మక శాసనోల్లంఘన చేపట్టాలని పేర్కొన్నాడు.

జాతీయ వాదం[మార్చు]

జవాహర్‌లాల్ అతి సున్నిత హృదయుడైన ఆసియాఖండ జాతీయవాది అని ఎస్.గోపాల్ భావించాడు. అయితే జాతీయవాదం వల్ల వచ్చే చెడు ప్రభావాలను కూడా అతను అర్థం చేసుకునే ఉన్నాడు. ప్రపంచ శక్తుల పరస్పర క్రియ అయిన చరిత్ర గతిలో ఏ అంశాన్నీ ఏ ఒక్క వ్యక్తికో, జాతికో ముడిపెట్టలేమని జవాహర్ విశ్వసించాడు. కాబట్టే సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూనే బ్రిటీష్ వారిని ద్వేషించలేదు.[8] అంతర్జాతీయ వ్యవహారాలు నెహ్రూ 1926-1928ల్లో ఐరోపా వెళ్ళిన నాటి నుంచీ ప్రత్యేక శ్రద్ధతో అవగాహన చేసుకుంటూనే ఉన్నాడు. 1931-1933 నడుమ జైలులో ఏడాదిన్నర కాలం గడిపినప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలను విపులంగా అధ్యయనం చేశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. సర్వేపల్లి గోపాల్ 1993, p. 150.
  2. సర్వేపల్లి గోపాల్ 1993, p. 157.
  3. సర్వేపల్లి గోపాల్ 1993, p. 158.
  4. సర్వేపల్లి గోపాల్ 1993, p. 131.
  5. సర్వేపల్లి గోపాల్ 1993, p. 132.
  6. 6.0 6.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 153.
  7. సర్వేపల్లి గోపాల్ 1993, p. 155.
  8. సర్వేపల్లి గోపాల్ 1993, p. 149.