Jump to content

జాతీయ గ్రంథాలయ దినోత్సవం

వికీపీడియా నుండి
జాతీయ గ్రంథాలయ దినోత్సవం
జాతీయ గ్రంథాలయ దినోత్సవం
ఎస్.ఆర్.రంగనాథన్ చిత్రపటం
యితర పేర్లుగ్రంథాలయ దినోత్సవం
జరుపుకొనేవారుభారతదేశం
జరుపుకొనే రోజుఆగష్టు 12
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

జాతీయ గ్రంథాలయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ గుర్తుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ప్రారంభం

[మార్చు]

లెక్కల ఆచార్యులైన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ 1923లో మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా చేరాడు. తనకు దొరికిన ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, 1924లో వర్గీకరణ క్లాసిఫికేషన్‌, 1933లో గ్రంథాలయ కేటలాగుల్ని తయారుచేయడానికి ఒక కొత్త కోడ్‌ను రూపొందించాడు. కోలన్ క్లాసిఫికేషన్ అని పిలిచే ఈ వర్గీకరణ పద్ధతిని దేశంలోని అనేక గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి.[1][2]

భారతదేశంలో అకడమిక్‌ లైబ్రరీలతోపాటు, పబ్లిక్‌ లైబ్రరీలలో అభివృద్ధికి, గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి విశేషంగా కృషి చేసిన ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజైన ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నారు.[3]

1972లో ఆయన మరణం తర్వాత, భారత గ్రంథాలయ సంఘం (ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ILA) ప్రతిపాదనతో జాతీయ స్థాయిలో ఆగస్టు 12ను Librarians’ Dayగా జరపడం 1980లలో ప్రారంభమైంది. దీని ముఖ్యోద్దేశం గ్రంథాలయాల ప్రాముఖ్యతను, గ్రంథాలయ పాలకుల సేవలను గుర్తించడం ఇంకా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం; గ్రంథాలయాలపై ప్రజల్లో అవగాహన పెంపు; గ్రంథాలయ పాలకుల కృషికి గౌరవం; గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుట, పఠన సంస్కృతిని పెంపొందించుట, సమాచారం అందుబాటును ప్రోత్సహించడం.

కార్యక్రమాలు

[మార్చు]

గ్రంథాలయ సమాచార రంగమునకు సంబంధించి గ్రంథపాలకులు లేదా అధికారులు, సిబ్బంది, విద్యావేత్తలు, విద్యార్థులు, పౌరులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.

  1. ఈ దినోత్సవం సందర్భంగా భారతదేశవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఎస్.ఆర్ రంగనాథన్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటారు.
  2. విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, క్విజ్ వంటి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు.

గ్రంథాలయ వారోత్సవాలు

[మార్చు]

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 నుంచి 20వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవి వారం పాటు జరుపుతారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఉద్యమ కారులకు సమాచార కేంద్రాలుగా ఉంటూ పౌరుల అక్షరాస్యత సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన గ్రంథాలయాల మొదలు నేటి ఆధునిక కాలంలోనూ పాఠకులకు విస్తృత స్థాయిలో సేవలందిస్తున్న ఈ పఠనాలయాలను గుర్తిస్తూ ఈ వారోత్సవాలు జాతీయ స్థాయి లోను తెలుగు రాష్ట్రాలలోను, పౌర విద్యా గ్రంథాలయాలు నిర్వహిస్తారు.

"భారతదేశంలో ప్రజా గ్రంథాలయ ఉద్యమ రూపశిల్పి"గా గౌరవించిన అయ్యంకి వెంకట రమణయ్య ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని గ్రంథాలయ సమాచార వర్గాలవారు కొనసాగిస్తున్నారు. భారతదేశం అంతటా ఈ వారం పొడవునా గ్రంథాలయాలు పుస్తక ప్రదర్శనలు, అవగాహనా కార్యక్రమాలు, పిల్లలు, పెద్దల కోసం వక్తృత్వ వ్యాసరచన, క్రీడా పోటీల నిర్వహణ, గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుట, పఠన వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తాయి.[4] [5][6][7]

ఇతర దేశాలలో గ్రంథాలయ దినోత్సవం

[మార్చు]

అమెరికా

[మార్చు]

అమెరికాలో జాతీయ లైబ్రేరియన్ దినోత్సవం ఏప్రిల్ 16న జరగుతుంది. అమెరికాలో 1800ల చివరి నాటికి ఉచిత ప్రజా గ్రంథాలయాల భావన స్థిరపడింది. 20వ శతాబ్దం ప్రారంభంలో, మెల్విల్ డ్యూయీ తన దశాంక పధ్ధతి (డెసిమల్ సిస్టమ్)తో వర్గీకరణ, గ్రంథ సూచీకరణను ప్రామాణికం చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా వేలాది కొత్త శాఖలతో ప్రజా గ్రంథాలయాలు వేగంగా విస్తరించాయి. 1900 నాటికి, గ్రంథాలయాల పరిధి కూడా విస్తరించింది, అనేక ఆచూకీ సేవలు, అంతర గ్రంథాలయ (ఇంటర్ లైబ్రరీ) రుణాలను, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఆడియోబుక్‌లు, ఇ-రీడర్ మెటీరియల్‌లు, ఉచిత కంప్యూటర్ నైపుణ్యాల తరగతులు, ఉచిత ఆన్‌లైన్ వనరులకు ప్రాప్యత అందిస్తున్నాయి. గ్రంథాలయ విజ్ఞానశాస్త్రం (లైబ్రరీ సైన్స్‌)లో శిక్షణ పొందిన సుశిక్షితులైన గ్రంథపాలకులు, సిబ్బంది పుస్తకాలను నిర్వహించడానికి, వాటి కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, స్థానిక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానించడానికి, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి, తరగతులను బోధించడానికి, ఇంకా మరిన్ని సంక్లిష్టమైన వర్గీకరణ, సూచీకరణ వంటి సాంకేతిక వ్యవస్థలతో పని చేయడానికి కృషి చేస్తారు. కాబట్టి ధన్యవాదాలు చెప్పడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పౌరులు స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి, గ్రంథపాలకునికి ధన్యవాదాలు తెలియచేసి పుస్తకాలు విరాళంగా కూడా ఇస్తారు.[8]

అమెరికాలో, లైబ్రేరియన్ల దినోత్సవం సంబంధించి జాతీయ గ్రంథాలయ వారం (U.S., National Library Week) 1958లో ప్రారంభమైంది, దీనిని అమెరికా గ్రంథాలయ సంఘం (అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ -ALA) గ్రంథపాలకుల సహకారాన్ని గుర్తించడానికి, గ్రంథాలయ సేవలను ప్రోత్సహించడానికి ప్రారంభించింది. ఈ వారం సాధారణంగా గ్రంథాలయ సిబ్బందిని గౌరవించడానికి, సమాజంలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రముఖంగా చూపడానికి (హైలైట్) కార్యక్రమాలు చేపడుతారు, అనేక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇవి పౌరులకు సమాచార ప్రాప్యత, అక్షరాస్యత, జీవితకాల అభ్యాసం అందించడంలో వారి సహకారాన్ని గుర్తింస్తుంది. డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందుతున్న గ్రంథపాలకుల పాత్ర, సమాచారాన్ని సమర్థవంతంగా అందుకోవడంలో, ఉపయోగించడంలో ప్రజలకు సహాయపడటంలో వారి నిరంతర కృషి అందరకు అవగాహన పెంచడానికి కూడా ఈ రోజు ఉపయోగపడుతుంది.[9]

యునైటెడ్ కింగ్డం

[మార్చు]

యునైటెడ్ కింగ్డంలో జాతీయ గ్రంథాలయాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుతారు. ఇది గ్రంథాలయాలు గ్రంథాలయపాలకులకు జరిపే వార్షిక కార్యక్రమం. మొదట్లో ఈ కార్యక్రమం ఫిబ్రవరి 4, 2012న జరిగింది.

2011లో 'సేవ్ అవర్ లైబ్రరీస్ డే' ఉద్యమం తర్వాత రచయిత, లైబ్రరీ ప్రచారకర్త 'అలాన్ గిబ్బన్స్ పౌరుల నుండి "మన గ్రంథాలయాలు ఉత్సవం జరుపుకునే అవకాశం ఉండాలని" సూచించే ఇమెయిల్‌లు అందిన తర్వాత ఫిబ్రవరిలో మొదటి రోజును జాతీయ లైబ్రరీస్ డేగా చేయాలని ప్రతిపాదించారు.[10]

జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని స్థానిక అధికారులు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయ సేవలందించేవారు, స్థానిక పౌర సమూహాలు దేశవ్యాప్తంగా రచయితలతో చర్చలు, అనేక రకాల పోటీలతో సహా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. "గ్రంథాలయాల భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన" కారణంగా 2012 జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని "అత్యంత ముఖ్యమైనది"గా అభివర్ణించారు. జాతీయ గ్రంథాలయ దినోత్సవానికి రచయితల సంఘం, పుస్తకాల విక్రేతలు , ప్రచురణ కర్తల సంఘాలు, మహిళా సంస్థలు, పుస్తక, లైబ్రరీ ప్రచార సంఘాలు, చదువరుల సంఘాలు, జాతీయ సాక్షరతా సంస్థలు మొదలగునవి మద్దతు ఇస్తున్నాయి. మొదటి జాతీయ గ్రంథాలయ దినోత్సవానికి మద్దతుగా, గ్రంథాలయాలు ప్రాముఖ్యత గురించి అనేక మంది రచయితలు తమ ఆలోచనలను పొందుపరచిన ఒక పుస్తకం ప్రచురించబడింది. దాని పేరు ది లైబ్రరీ బుక్ (The Library Book). దీనిలో 'అలాన్ బెన్నెట్', 'జూలియన్ బార్న్స్', స్టీఫెన్ ఫ్రైల రచనలు ఉన్నాయి, దీని ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 'ది రీడింగ్ ఏజెన్సీ' కి లైబ్రరీలకు మద్దతు ఇచ్చే వారి సహాయం కోసం వెళుతుంది.[11]

దక్షిణ ఆఫ్రికా

[మార్చు]

దక్షిణాఫ్రికా లైబ్రేరియన్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 10న నిర్వహించబడుతుంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (LIASA) స్థాపనకు గుర్తుగా, దక్షిణాఫ్రికాలో జాతి నిర్మాణం, అక్షరాస్యత, సమాచారానికి సమాన ప్రాప్యత అందించడంలో గ్రంథాలయ పాలకులు, సమాచార నిపుణులు పోషించే కీలక పాత్రకు గుర్తింపుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

దక్షిణాఫ్రికాలో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (LIS) వృత్తిలోని అన్ని రంగాలను ఏకం చేసే ప్రొఫెషనల్ సంస్థగా LIASA జూలై 10, 1997న అధికారికంగా ప్రారంభించబడింది. దాని 17వ వార్షికోత్సవం సందర్భంగా, LIASA 2014లో జూలై 10ని దక్షిణాఫ్రికా లైబ్రేరియన్ల దినోత్సవం (SALD)గా ప్రకటించింది, ప్రతి సంవత్సరం ఆదే తేదీని లైబ్రేరియన్ల దినోత్సవం దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా అర్హతల అథారిటీ (SAQA) ఫిబ్రవరి 2015లో LIASAకు గుర్తింపు ఇచ్చింది. తరువాత, ప్రభుత్వం ఆమోదించింది. దక్షిణాఫ్రికా, రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాచార ప్రాప్యత ప్రాథమిక హక్కుకు అనుబంధంగా లైబ్రేరియన్ల నిబద్ధతను నొక్కి చెప్పే మీడియా సలహాతో లైబ్రేరియన్ల దినోత్సవాన్ని జూలై10, 2015న ప్రారంభించారు. దీని లక్ష్యాలు - అందరకు సమ సమాచార ప్రాప్తి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన క్రియాశీల వృత్తిగా 'లైబ్రేరియన్‌షిప్' గురించి ప్రజలకు అవగాహన పెంచడం; సమాచార నిపుణులు, జ్ఞాన నిర్వాహకులు, పరిశోధన సులభతరం చేసేవారు, సమాజ విద్యావేత్తలుగా గ్రంధాలయ పాలకులకు విలువ జోడించడం; అక్షరాస్యత, అభ్యాసం, సామాజిక ఐక్యతను పెంపొందించే సమ్మిళిత సమాజ స్థలాలుగా గ్రంథాలయాలను ప్రోత్సహించడం.[12][13]

ఇతర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 August 2013). "ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (12 August 2019). "పుస్తకాన్ని ప్రేమించు.. విజ్ఞానాన్ని సంపాదించు!". www.andhrajyothy.com. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  3. డైలీహంట్, ప్రజాశక్తి (12 August 2018). "జ్ఞాన బడి.. గ్రంథాలయ ఒడి". www.dailyhunt.in (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  4. "Library/E-Resources - National library week - National library week". TELANGANA TRIBAL WELFARE RESIDENTIAL DEGREE COLLEGE (GIRLS). Retrieved 2025-08-16.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  5. Shanthi (2024-11-14). "ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు." Visalaandhra. Retrieved 2025-08-16.
  6. "57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.. ఈనెల 14 నుండి 20 వ తేదీ వరకు". District Administration, Eluru District, Ministry of Electronics & Information Technology, Government of India. 2024-11-12. Retrieved 2025-08-16.
  7. "జ్ఞాన భాండాగారం..గ్రంథాలయం". ABN ఆంధ్ర జ్యోతి. 2024-11-13. Retrieved 2025-08-16.
  8. "National Librarian Day on April 16, 2026". Archived from the original on 2025-06-13. Retrieved 2025-08-14.
  9. ETV Bharat English Team (2024-08-12). "What Is Librarians Day? Here's What You Need To Know". ETV Bharat. Retrieved 2025-08-14.
  10. Page, Benedicte (February 4, 2011). "Protests across the UK expected for Save Our Libraries Day - The Guardian". London. Retrieved February 2, 2012.
  11. Goring, Rosemary (2012-01-30). "Support your library while you still can". The Herald. Retrieved 2025-08-14.
  12. "South African Librarians Day, 10 Jul | South African Government". www.gov.za. Retrieved 2025-07-09.
  13. Todres, Philip (2024-07-10). "National Librarian's Day 10 July - Librarians, take a bow!". Cape Town Green Map (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2025-07-09.