జాన్ కీట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రకృతి పౌరాణికతకూ (మిథ్ కు), మిత్ కవిత్వానికీ జన్మనిస్తుందని విశ్వసించిన మహాశయుడు 18వ శతాబ్ది ఆంగ్లేయ కవి జాన్ కీట్స్. 18 -19 వ శతాబ్దాల మధ్య కాలంలో వర్ధిల్లిన అలనాటి కాల్పనికవాద (రొమాంటిక్) కవిత్వపు ఆధునిక కవులలో కీట్స్ ఆఖరి వాడు. సాహిత్య పునరుజ్జీవన (Renaissance) రొమాంటిక్ ఉద్యమంలో వరుసలో ఆఖరివాడే కాని, వాసిలో ఆఖరివాడు కాదు కీట్స్. సాంప్రదాయ కవితా రీతులను మరువ కుండానే, నవ్య సాంప్రదాయ పథాలను విడువ కుండానే క్రమానుగత పరిణతతో అలనాటి ఆంగ్ల కవితాకాశంలో కాల్పనిక కవిత్వ కాంతులు నించి అర్ధాంతరంగా రాలిన నవ నక్షత్రం కీట్స్! అతను మొగ్గల్లో చొరబడిన సౌకుమార్యమై, మబ్బులలో తేలే ప్రణయ సౌందర్యమై, ప్రవహించిన కొండ వాగై, ప్రకృతి గంధమై, సృజన పక్షమై కొత్త గాలులలో రెక్కవిప్పిన నవకవన హృదయం! జన్మరాహిత్య సాఫల్య స్వప్నౌన్నత్య స్తరాలకు భావయానం చేసిన ఆత్మిక చైతన్య చింతనాత్మక కవితాత్మ ! “A great poetic genius”! “The Human Friend Philosopher”! జననం : 31 అక్టోబర్ 1795 ( లండన్ ) మరణం : 23 ఫిబ్రవరి 1821 ( రోమ్ ) కీట్స్ 25 వ ఏటనే ఈ ‘సత్యసౌందర్యాల’ పృథివిని విడిచి పెట్టి ఆతని ఊహలలోని ఊర్ఠ్వ లోకాలకు నిష్క్రమించాడు . అనుకూల పవనాలు ఎన్నడూ వీయలేదు అతని జీవితంలో. 9వ ఏట తండ్రి, 10 వ ఏట తాత, 15వ ఏట తల్లి స్వర్గస్థులయ్యారు. అనివార్య కారణాల వల్ల వారససత్వంగా రావలసిన డబ్బు చేతికందలేదు. ఇష్టంలేని వైద్య వృత్తిని ఎన్నుకోవలసి వచ్చింది. అతనికి సంక్రమించిన క్షయ వ్యాధి కారణంగా కోరుకున్న యువతి ఫానీ భార్య కాలేక పోయింది. ఆనాడు రాజ్యమేలుతున్న కవుల కుపిత రాజకీయ కూటాలు (‘ugly clubs’) అతని కవిత్వాన్నికలసికట్టుగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా ‘బ్లాక్ వుడ్స్ ” పత్రిక పనిగట్టుకొని కీట్స్ ను, కీట్స్ కవిత్వాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండించింది. ప్రసిద్ధ గ్రీకు పౌరాణిక గాథ ‘ఎండీమియన్’కు కీట్స్ రాసిన నాలుగువేల కవితా వాక్యాల బృహత్ కావ్యాన్ని ఒక మారుమూల మాండలిక పేలవ రచనగా (Cockney school poetry) పేర్కొంది! అలనాటి ఛాందస వృద్ధ కవి కూటమి కూడా “Imperturbable driveling ideocy of Endymion” అంటూ నిరసించింది. “I can’t exist without poetry, the eternal poetry!” అని జీవితాంతం తలపోస్తూ వస్తున్న కీట్స్ కవితావైభవ ప్రతిభ ఆతని మరణానంతరం గాని వెలుగులోకి రాలేదు! తన సమాధి మీద చెక్కమని చెప్పిన స్మృతివాక్యం (Epitaph) -“Here lies One Whose Name was writ in Water”-అందుకు సాక్షం!

కీట్స్ ప్రతిభను గుర్తించిన తొలి సాహితీ బంధువు లీహంట్. అతను షెల్లీ, విలియమ్ గాడ్విన్, బాసిల్, హాజ్లిట్, లాంబ్ వంటి కవులకు కీట్స్ ను పరిచయం చేశాడు. కీట్స్ తొలి కవిత “O Solitude”ను తన పత్రిక ‘Examiner’లో ప్రచురించి ప్రోత్సహించాడు. ఆ రోజులలో లండన్ లోని లీహంట్ గృహం కవుల కలివిడి స్థలం; కీట్స్ సాహితీ ఆశ్రయం. అక్కడే కవులు షెల్లీ, వర్డ్స్ వర్త్, లార్డ్ బైరాన్, చిత్రకారుడు జోసెఫ్ సీవేర్న్ వంటి పలు వర్ధమాన కవులూ కళాకారులూ కీట్స్ కు పరిచయమయ్యారు. వాళ్ళ ప్రోత్సాహం తోనే మరో బృహత్తర గ్రీకు పౌరాణిక గ్రంథం ‘హైపీరియన్’ వెలువడి కత్తికోతల విమర్శలకు గురైంది. తాను ఎదుర్కొన్న విమర్శల రాపిడిలో అతను రాటు దేరాడు. షెల్లీ, బైరన్ వంటి కవిమిత్రుల సహవాసంలో అతడు లోతైన సాహిత్య అధ్యయనం చేయ సాగాడు. సిసలైన కవిత్వ స్వరూపం గూర్చిన ప్రయోగాలు, తన కిష్టమైన సానెట్ కు కొత్త రంగులు అద్దే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. అక్కడే ఫానీ బ్రోవే అతనికి చేరువయింది. అతని కవిత్వంలో అనురాగ అంతర్ధార అయింది.

కీట్స్ ప్రేమ జీవనమూ విఫల మైనదే. కీట్స్ ఆరాధ్య ప్రేయసి ఫానీ విడిపోక తప్పని పరిస్థితులలో పన్నెండేళ్ళు వేచిఉన్నా ఫలితం దక్కలేదు. క్షయ వ్యాధి వాళ్ల పాలిటి శాపమయింది! క్షయ వ్యాధితో క్షీణిస్తున్న కీట్స్ ను చికిత్సకై రోమ్ కు తీసుకువెళ్ళిన మిత్రుడు సీవర్న్ చేతులలో కీట్స్ అంతిమశ్వాస వదిలాడు. సేవేర్న్ తన మిత్రులకు, కీట్స్ ప్రేయసి (ఫియాన్సీ) ఫానీ బ్రోవేకు రాసిన ఉత్తరాలే కీట్స్ ఆఖరి రోజులను తెలిపే ఆధారాలు. షెల్లీ, సేవేర్న్, కీట్స్ సమాధులు రోమ్ లోని Protestant Cemetary లో ఇప్పటికీ ఉన్నవి పక్క పక్కనే. ‘ మిత్ ‘ను మించిన మానవ నిజజీవన అనుభవ సారం అతని కవిత్వం. ప్రకృతి సౌందర్యం, ప్రణయ మాధుర్యం కలసి పారిన పాట అతని రమణీయ అభివ్యక్తి ! పూర్వ ఆంగ్ల కవి శేఖరులు వెలుగుతున్న కీర్తి శిఖరాలలో తానూ శాశ్వతంగా నిలిచి పోవాలన్న ఆతని అనంత తృష్ణ అతన్ని నిరంతరం తొందరించింది. కేవలం ఆఖరు రెండేళ్లలోనే ఆతని అంతరాంతరాలలో మాగిన అనంత పరణిత కవిత సృజన సౌందర్యమై ఆవిష్కరించబడింది!

బౌద్ధిక పరిమితులను, సాంఘిక అవరోధాలను అధిగమించగల అతిలోక సామర్థ్యం మనిషికి సహజ సిద్ధంగా లోన ఉంటుందని, అది జ్ఞాన సృజనల ద్వారా బహిర్గతం కావడం సాధ్యమని కీట్స్ ప్రసిద్ధ స్వీయ సిద్ధాంతం (Doctrine of Negative Capability). ఎదుటి వారి సంశయానిశ్చయతలను, దృక్కోణాలను, సానుభూతితో అంగీకరించడం నెగటివ్ కాపబిలిటి కలిగిన సృజనాత్మక భావ హృదయానికే సాధ్యమని అతని నమ్మకం. సౌందర్యమే సత్యమనీ, సత్యమే సౌందర్య మనీ , అంతిమంగా ఈలోకంలో తెలుసుకో వలసిందీ, తెలుసుకో గలిగిందీ ఇంతేననీ అతని దృఢ విశ్వాసం. అతని కవితా వస్తువును పదచిత్రాలతో, భావ ప్రతీకలతో, శ్రావ్యశబ్ద మాధుర్యంతో అందగించాడు. అతని కవితా దృష్టి ప్రత్యేకం. వికసించే ముందు నేల తాలూకు సహజ ప్రకృతిని పూవు ఆస్వాదించక తప్పదంటాడు. మసక బారిన సాగరం మధ్య అలరారుతున్న ద్వీప ఖండాలు తీరం మీద భావ చిత్రాలు అల్లుతున్న కవి హృదయవాంఛా ప్రతీకలే అంటాడు. ‘చెట్టు ఎంత సహజం గా చిగురిస్తుందో అంత సహజంగా రావాలి కవిత్వం ; అలా కాని పక్షంలో అది రాకున్నా పరవాలేదు’ అని అతని అభిప్రాయం. ‘సంద్ర సాగరతీరాల’ సందిగ్ధత (Sea-Shore dichotomy) అతని కవిత్వం నిండా పరచుకున్నది. పరిమిత వాస్తవికత అపరిమిత ఊహాత్మకమై ఎల్లలు దాటింది! ‘ ప్రణయం-విషాదం’, ‘అందం-అల్పజీవనం’, ‘సుఖం-దుఃఖం’, ‘జీవనం-మరణం’, – ఇలా పరస్పర విరుధ్ధమైన జీవిత ద్వంద్వాలు జంటగా ప్రతి ఆనందం అట్టడుగున ఉండి తీరుతాయని విశ్వసించాడు. భావి ఆశకూ వర్తమాన వాస్తవికతకూ కవితా వారధి అయ్యాడు కీట్స్. భౌమ్యాతీత అమర్త్య భవ్య శిఖరాలకులకు చేరవేసే భావ పక్షాలను ఆన్వేషించాడు. బైరన్, టెన్నిసన్ చేరిన ఔన్నత్యాలను మించిన అనంతత్వాలకు ఎగరాలని ఆరాట పడ్డాడు.

సౌందర్యదర్శన సందర్భంలో జారిన నైతికతకూ, తాత్విక విచార ధారతో ముడివడిన నైతికతకూ మధ్య నున్న సూక్ష్మ సంబంధాన్ని నిశితంగా పరిశీలించేవాడు. వైయక్తిక పరిపూర్ణత, ఆత్మనిర్మాణ నైతికత, దైవీయతేజ అస్తిత్వ అనుసంధానత కై అహరహం తపించేవాడు. స్వయంగా కవి అయిన కీట్స్ కు కవితా సౌందర్యం కన్నా తాత్విక సత్యమే మిన్న!

కీట్స్ 19వ ఏట రాసిన మొట్ట మొదటి కవిత “An Imitation of Spencer”. తొలి ప్రచురిత కవిత “O Solitude”. ఆఖరు కవిత “The Bright Star”. అతడు రాసిన ఉత్తరాలు అతని కవిత లంత ప్రసిద్ధం.కీట్స్ రాసిన ముఖ్యమైన ఓడ్స్: Ode to Nightingale, To Autumn, Ode to Grecian Urn, Ode to melancholy, Odeto Apollo, Ode to Psyche. ఓడ్స్ మాత్రేమే కాదు అతడు సానెట్లు, లఘు కవితలు, దీర్ఘ కవితలు, గ్రీకు మిత్ ఆధారిత బృహత్ కావ్యాలూ రాశాడు. ఒక్కొక్కటీ ఒక్క ఆణిముత్యం. మచ్చుకు కొన్ని (నేను అనువదించిన) కవితా పంక్తులు :

చిట్టి అడవుల హరిత పత్ర ఛత్రాలు, / మధుశీథువు చిలకరించే కస్తురి రోజాలు
మన అవిశ్రాంత మనసుకు ఆటవిడుపులు.
నిరంతర అమృత ధార వంపుతున్నది / స్వర్గం మన మీద. - (A Thing of Beauty).
తాకు తున్నవి ఋతుశీల స్పర్శలై / తమసు పులుముకున్న పొదల మృదుల తావులు,
మధు శీధువు నిండిన వనకస్తురి రోజా పరిమళాలు, / రెల్లు గరికల, రేగు పళ్ళ, రేతిరి పూల
సుగంధాలు. -Ode to Nightingale
మలిసంజలో వికసిస్తున్నవి మేఘ మాలికలు / పశ్చిమాకాశంలో పూస్తున్నవి గులాబీలు
ఏటి గట్టున చిమ్మటల చిరు బృందగానం! / కొండ కొమ్మున గొర్రెపోతుల కోలాహలం !
గుబురు పొదలలో గొల్లభామల గీతం! / ఈల వేస్తున్నది పాటకోకిలం
అవును, నీకూ ఉన్నది నీ హేమంత గీతం . – Ode to Autumn .
ఓ వైణవికా! ఆపకు నీ పిల్లనగ్రోవి పాటను, / సుస్వరాలకు అందని నీ నిశ్శబ్ద ఆత్మ గీతాలను;
వినిపించే శ్రవణ సంగీతం కన్నా శ్రావ్యం / వినిపించని నీ నిశ్చల హృదయ రాగం!
-Ode to Grecian Urn.
ఈ పుడమి కవిత్వం ఆగదు ; / శీతల హేమంతాల ఒంటరి సాయంత్రాలు
మంచు పూల మౌనాన్ని చెక్కుతున్న వేళ / గొంతు విప్పుతుంటుంది పొదరిండ్ల మాటున
గొల్లభామ కీచు స్వరాల వెచ్చని గీతిక. -To the Grasshopper and the cricket .
వచ్చేయి నాతో నే నధిరోహించే ప్రకృతి శిఖరాలకు / పూల వాలులోయల పర్వత సానువులకు
స్పటిక స్వచ్ఛ నదీ జల తరంగాల చేరువకు / చెంగలించే లేడి పరుగులకు చెదరుతున్న
తేనీగల తిరిగే పుప్పొడి దొన్నెల పూల తావులకు / భ్రమరాల పొదరిండ్ల రహః స్థావరాలకు .
– ( To solitude )
ఇటలీ లోని మంచు మైదానాలలో కరుగుతున్న / ఆర్నో నది స్వప్నసౌందర్యంలా
ఎప్పటికీ ఆమె / నా చిర స్మృతుల తేజోచక్రమే! – (Fill for Me a Brimming Bowl)
ఈ మనోహర వనస్థలిలోనే కదా కవనావేశంతో కవి / భౌమ్యాతీత ప్రకృతి కృతులను గానం
చేసింది! ఆ అదృశ్య లోకాలనుండి నక్షత్రాకృతులను తెంపి తెచ్చుకొని /
పూల పొదల ఆత్మగీతాల దృశ్యమాలిక లల్లింది! – I stood tip-toe upon a little hill.
నా ఎడద ప్రణయ పక్షాలను తొడుక్కున్నప్పుడు/ దివ్య మైనది
నా పంచ రంగుల పరవశభావం!
అనంత సాగర కెరటాల మీద ఎద రెక్కవిప్పినప్పుడు
కలసి ఎగసే అద్వైత హృదయం నా భావావేశం! – Lines To Fanny .
అతడు వర్డ్స్ వర్త్ వంటి ప్రకృతి కవి! ప్రణయ రాగాల గీతకోకిలం! ఆంగ్లేయ కవితాకాశంలో ఆచంద్రార్కం వెలిగే అసదృశ జ్వలిత నక్షత్రం కీట్స్!

కీట్స్ అంతటి గొప్ప కవి పాతిక సంవత్సరాలకే మృత్యువాత పడడం దురదృష్టకరం! ఆశించిన ఖ్యాతి జీవితకాలంలో రాక నైరాశ్యంలో కీట్స్ క్రుంగి పోవడం, ఇంత గొప్ప ఖ్యాతి మరణానంతరం వస్తుందని అతనికి తెలిసిరాకపోవడం బాధాకరం!

బాల్యం[మార్చు]

చదువు[మార్చు]

==రచనలు==ode to autumn

వ్యక్తిగత జీవితం[మార్చు]

మరణం[మార్చు]

మూలాలు[మార్చు]

సారంగ వెబ్ పత్రిక