జినీ సూచిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ మ్యాపులో దేశాల వారీగా ఆదాయపు జినీ సూచిక (% గా). 1992 - 2020 మధ్య కాలపు ప్రపంచ బ్యాంకు డేటా ఆధారంగా.[1]
  •   Above 50
  •   Between 45 to 50
  •   Between 40 to 45
  •   Between 35 to 40
  •   Between 30 to 35
  •   Below 30
  •   No data
2019కి దేశాల్లోని సంపద జినీ సూచిక‌లను చూపే మ్యాప్ [2]

ఆర్థికశాస్త్రంలో, జినీ సూచిక దేశంలోని లేదా ఏదైనా సామాజిక సమూహం లోని ఆదాయ అసమానతను లేదా సంపద అసమానతను సూచించడానికి ఉద్దేశించిన కొలత. దీన్ని జినీ గుణకం అనీ జినీ నిష్పత్తి అని కూడా పిలుస్తారు. జినీ సూచికను గణాంకవేత్త, సామాజిక శాస్త్రవేత్త అయిన కొరాడో జినీ అభివృద్ధి చేసాడు.

జినీ సూచిక ఆదాయ స్థాయిల వంటి ఫ్రీక్వెన్సీ పంపిణీ విలువల మధ్య అసమానతను కొలుస్తుంది. జినీ సూచిక 0 ఉంటే సంపూర్ణ సమానత్వం ఉన్నట్లు. ఇక్కడ అన్ని విలువలూ ఒకే విధంగా ఉంటాయి. జినీ 1 (లేదా 100%) ఉంటే విలువల మధ్య గరిష్ట అసమానతను ఉన్నట్లు. ఉదాహరణకు, ప్రతి ఒక్కరికీ ఒకే ఆదాయం ఉంటే, జినీ సూచిక 0 అవుతుంది. దీనికి విరుద్ధంగా, పెద్ద సంఖ్యలో ఉన్న వ్యక్తులలో ఒక వ్యక్తి వద్దనే మొత్తం ఆదాయం లేదా వినియోగం అంతా ఉండి, ఇతరులందరికీ ఏమీ లేనట్లయితే, అక్కడ జినీ సూచిక దాదాపు 1 ఉంటుంది. [3] [4]

జినీ సూచికను ఆదాయం లేదా సంపద యొక్క అసమానతను కొలిచేందుకు గాను కొరాడో జినీ ప్రతిపాదించాడు. [5] 20వ శతాబ్దం చివరలో, OECD దేశాలలో పన్నులు, బదిలీ చెల్లింపుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆదాయపు జినీ సూచిక 0.24, 0.49 మధ్య ఉంది. స్లోవేనియాలో అత్యల్పంగాను, మెక్సికోలో అత్యధికంగానూ ఉంది. [6] 2008-2009లో ఆఫ్రికన్ దేశాల్లో అత్యధిక పన్ను-పూర్వపు జినీ సూచిక‌లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ప్రపంచంలోకెల్లా అత్యధికంగా 0.63 నుండి 0.7 వరకు ఉన్నట్లు అంచనా వేసారు. [7] అయితే సామాజిక సహాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ సంఖ్య 0.52కి పడిపోయింది. పన్ను తర్వాత పరిస్థితిని లెక్కిస్తే అది మళ్లీ 0.47కి పడిపోయింది. [8] 2005లో ప్రపంచ ఆదాయపు జినీ సూచిక 0.61, 0.68 మధ్య ఉన్నట్లు వివిధ వర్గాలు అంచనా వేసాయి. [9]

జినీ సూచికను వివరించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి; ఒకే విలువ అనేక విభిన్న పంపిణీ వక్రతలకు కారణం కావచ్చు. జనాభా నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వృద్ధాప్య జనాభా లేదా బేబీ బూమ్ ఉన్న దేశాల్లో పని చేసే పెద్దలకు నిజమైన ఆదాయ పంపిణీ స్థిరంగా ఉన్నప్పటికీ, పన్ను-పూర్వ జినీ సూచిక పెరుగుతోంది. పండితులు జినీ సూచికకు డజనుకు పైగా వైవిధ్యాలను రూపొందించారు. [10] [11] [12]

నిర్వచనం[మార్చు]

జినీ సూచికకు గ్రాఫికల్ రూపం:

జినీ సూచిక అనేది ఆదాయం/సంపద పంపిణీలలో ఉన్న అసమానత స్థాయికి సూచిక. ఒక దేశపు సంపద లేదా ఆదాయ పంపిణీ, సమాన పంపిణీ నుండి ఎంత దూరంగా ఉందో అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.

సాధారణంగా జినీ సూచికను గణితశాస్త్రంలో లోరెంజ్ వక్రరేఖ ఆధారంగా నిర్వచిస్తారు. ఇది జనాభాలోని దిగువ x మంది అందరి ఆదాయానికి (y-యాక్సిస్) మొత్తం జనాభా ఆదాయానికీ ఉన్న నిష్పత్తిని ప్లాట్ చేస్తుంది (రేఖాచిత్రం చూడండి). 45 డిగ్రీల వద్ద ఉన్న రేఖ ఆదాయాల్లో కచ్చితమైన, సంపూర్ణమైన సమానత్వాన్ని సూచిస్తుంది. జినీ సూచిక ఈ సమానత్వ రేఖకు, లోరెంజ్ వక్రరేఖకు మధ్య ఉన్న వైశాల్యానికీ (రేఖాచిత్రంలో A అని గుర్తించబడింది), సమానత్వ రేఖకు దిగువన ఉన్న మొత్తం వైశాల్యానికీ (రేఖాచిత్రంలో A, B అని గుర్తించబడినవి) మధ్య ఉన్న నిష్పత్తిగా భావించవచ్చు. అనగా, G = A/(A + B) . ప్రతికూల ఆదాయాలు లేనట్లయితే, ఇది A + B = 0.5 అవుతుంది కాబట్టి, జినీ సూచిక 2A కు, 1 − 2B కి కూడా సమానంగా ఉంటుంది.

ప్రజలందరికీ పాజిటివ్ ఆదాయమే ఉందని అనుకుందాం. ఆ సందర్భంలో, జినీ సూచిక సిద్ధాంతపరంగా 0 (పూర్తి సమానత్వం), 1 (పూర్తి అసమానత) మధ్య ఉంటుంది. కొన్నిసార్లు 0, 100 మధ్య ఉండే శాతంగా కూడా చూపిస్తారు. నెగటివు ఆదాయం ఉంటే (అప్పులు ఉన్న వ్యక్తుల సంపద వంటివి), అప్పుడు జినీ సూచిక సిద్ధాంతపరంగా 1 కంటే ఎక్కువగా ఉండవచ్చు. సాధారణంగా, సగటును (లేదా మొత్తం) పాజిటివుగా ఉన్నట్లే భావిస్తారు. కాబట్టి, సున్నా కంటే తక్కువ ఉన్న జినీ సూచిక ఉండదు.

లెక్కింపు[మార్చు]

ధనవంతులైన జనాభా (ఎరుపు) మొత్తం ఆదాయాన్ని లేదా సంపదను సమానంగా పంచుకుంటే; ఇతరులు (ఆకుపచ్చ) శేషాన్ని సమానంగా పంచుకుంటారు: G = fu . మృదువైన పంపిణీ ఉండే ఒకే u, ఒకే f ఉన్నపుడు (నీలం) ఎల్లప్పుడూ G > fu కలిగి ఉంటుంది.

ఏదైనా నిర్దిష్ట దేశపు ఆదాయ పంపిణీ ఎల్లప్పుడూ సైద్ధాంతిక నమూనాలను అనుసరించదు. అంచేత వాస్తవంలో, ఈ నమూనాలు ఆదాయ పంపిణీపై గుణాత్మక అవగాహనను ఏర్పరుస్తాయి.

ఉదాహరణ: రెండు ఆదాయ స్థాయిలు[మార్చు]

వైపరీత్య కేసులలో - ఒకటి ప్రతి వ్యక్తికీ ఒకే ఆదాయం ఉండే ( G = 0 ) "అత్యంత సమానమైన" సమాజం, రెండవది N వ్యక్తులు ఉన్న సమాజంలో ఒకే వ్యక్తికి 100% ఆదాయం ఉండగా, మిగిలిన N − 1 వ్యక్తులకు సున్నా ఆదాయం ఉండే ( G = 1 − 1/N ) "అత్యంత అసమాన" సమాజం.

సరళీకృతమైన కేసులో ఆదాయం కేవలం రెండే స్థాయిలలో ఉంటుంది -తక్కువ, ఎక్కువ. అధిక ఆదాయ సమూహం జనాభాలో u నిష్పత్తిలో ఉండి, వీరికి మొత్తం ఆదాయంలో f నిష్పత్తి ఉంటే. అప్పుడు జినీ సూచిక fu .

జనాభాలో అత్యంత సంపన్నులైన 20% మందికు మొత్తం ఆదాయంలో 80% ఉన్న సందర్భంలో జినీ సూచిక కనీసం 60% ఉంటుంది.

తరచుగా ఉదహరించబడే - ప్రపంచ జనాభాలో 1% మంది వద్ద, మొత్తం సంపదలో 50% ఉందనే [13] కేసులో, సంపద జినీ సూచిక కనీసం 49% ఉంటుంది.

ప్రాంతీయంగా ఆదాయ జినీ సూచికలు[మార్చు]

UNICEF ప్రకారం, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతంలో 2008లో సగటు ప్రాతిపదికన ప్రపంచంలోనే అత్యధిక నికర ఆదాయ జినీ సూచిక 48.3 ఉంది. మిగిలిన ప్రాంతీయ సగటులు: ఉప-సహారా ఆఫ్రికా (44.2), ఆసియా (40.4), మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా (39.2), తూర్పు యూరప్, మధ్య ఆసియా (35.4), అధిక-ఆదాయ దేశాలు (30.9). అదే పద్ధతిని ఉపయోగించి, అమెరికా జినీ సూచిక 36 గా ఉంది. దక్షిణాఫ్రికాలో అత్యధిక ఆదాయ జినీ సూచిక 67.8ని ఉందని పేర్కొంది. [14]

1800ల నుండి ప్రపంచ ఆదాయ జినీ సూచిక[మార్చు]

మానవులందరి ఆదాయ పంపిణీని తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఆదాయ అసమానతలు 19వ శతాబ్దం ప్రారంభం నుండి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. 1820 నుండి 2002 వరకు ప్రపంచ ఆదాయ అసమానత జినీ సూచికలో స్థిరమైన పెరుగుదల ఉంది, 1980 2002 మధ్య గణనీయమైన పెరుగుదల ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో, ముఖ్యంగా BRIC దేశాలలోని అధిక జనాభాలో వేగవంతమైన ఆర్థిక వృద్ధితో ఈ ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుని, తిరోగమనాన్ని ప్రారంభించింది. [15]

గత 200 సంవత్సరాలలో మిలనోవిక్ అంచనా వేసిన ప్రపంచ ఆదాయ జినీ సూచికలను దిగువ పట్టికలో చూడవచ్చు. [16]

ప్రపంచ ఆదాయ జినీ సూచిక - 1820–2005
సంవత్సరం ప్రపంచ జినీ సూచికలు [9][14] [17]
1820 0.43
1850 0.53
1870 0.56
1913 0.61
1929 0.62
1950 0.64
1960 0.64
1980 0.66
2002 0.71
2005 0.68

సారూప్య మూలాల నుండి మరింత వివరణాత్మక డేటా 1988 నుండి నిరంతర క్షీణతను సూచిస్తుంది. ప్రపంచీకరణ కారణంగా చైనా, భారతదేశం వంటి దేశాల్లోని కోట్ల మంది పేదలకు ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఆరోగ్య సంరక్షణ, విద్య, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవలను మెరుగుపరిచాయి; చిలీ, మెక్సికో వంటి ఇతర దేశాలు మరింత ప్రగతిశీల పన్ను విధానాలను అమలు చేశాయి. [18]

ప్రపంచ ఆదాయ జినీ సూచిక - 1988–2013
సంవత్సరం ప్రపంచ జినీ సూచికలు [19]
1988 0.80
1993 0.76
1998 0.74
2003 0.72
2008 0.70
2013 0.65

మూలాలు[మార్చు]

  1. "Gini index (World Bank estimate)". data.worldbank.org. Retrieved 2022-04-23.
  2. "Global wealth databook 2019" (PDF). Credit Suisse.
  3. "Current Population Survey (CPS) – Definitions and Explanations". US Census Bureau.
  4. Note: Gini coefficient could be near one only in a large population where a few persons has all the income. In the special case of just two people, where one has no income, and the other has all the income, the Gini coefficient is 0.5. For five people, where four have no income, and the fifth has all the income, the Gini coefficient is 0.8. See: FAO, United Nations – Inequality Analysis, The Gini Index Module Archived 13 జూలై 2017 at the Wayback Machine (PDF format), fao.org.
  5. Gini, Corrado (1936). "On the Measure of Concentration with Special Reference to Income and Statistics", Colorado College Publication, General Series No. 208, 73–79.
  6. "Income distribution – Inequality: Income distribution – Inequality – Country tables". OECD. 2012. Archived from the original on 9 November 2014.
  7. "Gini Coefficient". United Nations Development Program. 2012. Archived from the original on 12 July 2014.
  8. Schüssler, Mike (16 July 2014). "The Gini is still in the bottle". Money Web. Retrieved 24 November 2014.
  9. 9.0 9.1 Hillebrand, Evan (జూన్ 2009). "Poverty, Growth, and Inequality over the Next 50 Years" (PDF). FAO, United Nations – Economic and Social Development Department. Archived from the original (PDF) on 20 అక్టోబరు 2017.
  10. . "More than a Dozen Alternative Ways of Spelling Gini".
  11. . "Population Aging, Mobility of Quarterly Incomes, and Annual Income Inequality: Theoretical Discussion and Empirical Findings".
  12. . "A comparison of distributions of annual and lifetime income: Sweden around 1970".
  13. Treanor, Jill (2015-10-13). "Half of world's wealth now in hands of 1% of population". The Guardian.
  14. 14.0 14.1 Ortiz, Isabel; Cummins, Matthew (April 2011). "Global Inequality: Beyond the Bottom Billion" (PDF). UNICEF. p. 26. Archived from the original (PDF) on 12 August 2012. Retrieved 30 July 2012.
  15. Milanovic, Branko (September 2011). "More or Less".
  16. Milanovic, Branko (2009). "Global Inequality and the Global Inequality Extraction Ratio" (PDF). World Bank.
  17. Berry, Albert; Serieux, John (September 2006). "Riding the Elephants: The Evolution of World Economic Growth and Income Distribution at the End of the Twentieth Century (1980–2000)" (PDF). United Nations (DESA Working Paper No. 27).
  18. Gharib, Malaka (25 January 2017). "What The Stat About The 8 Richest Men Doesn't Tell Us About Inequality". NPR.
  19. World Bank. "Poverty and Prosperity 2016 / Taking on Inequality" (PDF).. Figure O.10 Global Inequality, 1988–2013