Jump to content

గారపాటి ఉమామహేశ్వరరావు

వికీపీడియా నుండి
(జి. ఉమామహేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)
ఆచార్య గారపాటి ఉమా మహేశ్వర రావు
జననంవిజయవాడ
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తిభాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు

గారపాటి ఉమామహేశ్వరరావు, భాషాశాస్త్రవేత్త అనువర్తిత భాషాశాస్త్రం, అనువాద అధ్యయనాల కేంద్రం (సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్ లేషన్ స్టడీస్), హైదరాబాదు విశ్వవిద్యాలయం లో సంచాలకులు గా పనిచేశారు[1] ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పని చేస్తున్నారు . తెలుగు భాషాశాస్త్రం, సమాచార సాంకేతిక రంగంలో చేసిన కృషికి రెండుసార్లు విశిష్ఠ అవార్డును (సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ 2012, విభక్త ఆంధ్ర ప్రదేశ్, 2019) అందుకొన్నారు. తెలుగు పద విశ్లేషిణి (Morphological Analyzer), వాక్యాలను విశ్లేషణ (Parser) చేసే ఉపకరణాలనిర్మాణం, ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం చేసే యంత్రానువాద వ్యవస్థలనూ (Machine Translation Systems), కంప్యూటర్లో‌ రాస్తున్నప్పుడు తప్పు ఒప్పుల్ని దిద్దుకోనే దిద్దరి అనే ఉపకరణం, పదనిష్పాదన చేసే ఉపకరణం (Morphological Generator), సాంఖ్యిక పదనిధి (digital corpora) వంటి ఎన్నో ఉపకరణాలను తెలుగూ తదితర భారతీయ భాషలకు తయారుచేశారు. భారతీయ భాషలకు భాషాతంత్రవ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఉద్దేశించిన సమాఖ్యకు నాయకత్వం వహించారు (Consortium Leader, SPTIL, TDIL, GoI). అంతే కాక గోండీ భాష మాండలికాల తులనాత్మక పరిశోధన చేశారు[2]. ద్రావిడ - మంగోలు భాషల మధ్య ఉన్న సంబంధాన్ని సోపపత్తికంగా వర్ణ, పద, సహజాత పదాల ఆధారంగా నిరూపించారు[3].అనేక సదస్సులలో భాష మీద, సాంకేతికత మీద వందకు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు.మాతృభాష లోనే ప్రాథమిక విద్యాభ్యాసం ఉండాలని, దాని కోసం ఎంతో కృషి చేస్తున్నారు, అవగాహనా సమావేశాలు నిర్వహిస్తు న్నారు.

జీవన  వ్యక్తిగత వివరాలు

[మార్చు]

గారపాటి ఉమామహేశ్వరరావు విజయవాడలో గారపాటి బాలత్రిపుర సుందరీదేవి, లక్ష్మీనరసింహారావులకు జన్మించారు. ప్రాధమిక విద్యాబ్యాసం గుణదల బిషప్ గ్రాసీ హైస్కూల్లో నూ ఆ తర్వాత డిగ్రీలు లయోలా కాలేజీలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం,  ఉస్మానియా విశ్వవిద్యాలయం, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, అ.సం.రా. ) విజ్ఞాన, మానవీయ శాస్త్రాలలో   ఎమ్.ఎస్.సి, ఎమ్.ఏ. చదివి, భాషాశాస్త్రజ్ఞులైన  ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఎఫ.ఆర్.ఎస్.ఈ పర్యవేక్షణలో  చారిత్రక భాషాశాస్త్రంలో  రాసిన పరిశోధనా వ్యాసానికి పి.హెచ్.డి.  పట్టా పొందారు.   

ఉద్యోగానుభవం

2001 నుండి ఇప్పటి వరకు: ప్రొఫెసర్, CALTS, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, భారతదేశం.

1993-2001: రీడర్, కాల్ట్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, భారతదేశం.

1988-93: లెక్చరర్, కాల్ట్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, భారతదేశం.

1987-88: పార్ట్ టైమ్ లెక్చరర్, భాషాశాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం

1984-86: టీచర్-కమ్-రీసెర్చ్ అసిస్టెంట్ (నేషనల్ సైన్స్ ఫౌండేషన్, USA), డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్, SUNY ఎట్ స్టోనీ బ్రూక్, NY, USA.

భాషా శాస్త్రం మీద కృషి

[మార్చు]

భారతీయ భాషల భాషా సాంకేతిక రంగంలో ప్రత్యేకించి యంత్రానువాదంలో  విశేషకృషి చేశారు. ద్రావిడ, మంగోలియన్ - టర్కిక్ భాషా కుటుంబాలకు మూలభాషను జన్యుసంబంధ ప్రక్రియల ద్వారా పునర్నిర్మాణం చేయడంలో చివరి రెండు దశాబ్దాలుగా నిమగ్నులై ఉన్నారు. భారతీయ భాషా సాంకేతిక రంగానికి సంబంధించి  అనేక పత్రాలు, పుస్తకాలను ప్రచురించారు. తెలుగురాష్ట్రాలలో భాషా సంక్షోభం, ద్రావిడ, మంగోలు భాషల జన్యు సంబంధాలపై పరిశోధనా గ్రంథాలను ప్రచురిచారు. నవ్యరుషి సన్మాన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశిష్ట పురస్కారం,  కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగానూ (న్యూఢిల్లీ), ద్రావిడ భాషా సంఘ అధ్యక్షుడుగానూ, భారతీయభాషలలో యంత్రానువాద పథక ప్రధానపరిశోధకుడిగానూ (ప్రసార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం),, భారతీయ భాషల కోసం ఉపకరణాల నిర్మాణ సహవ్యవస్థకు  నాయకత్వం వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, థాయలేండ్, శ్రీలంక, తైవాన్, దక్షిణ కొరియా, మంగోలియా మొదలైన దేశాలలో పర్యటించారు.

భారతీయ  నేపథ్యంలో  ముఖ్యంగా భారతీయ విశ్వవిద్యాలయాలలో, భాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టడం ద్వారా సంగణక భాషాశాస్త్రమనే   కొత్త  రంగంలో  పరిశోధనలు ప్రారంభించారు.  మానవీయశాస్త్ర  పరిశోధనా సంస్కృతిలో కొత్త పోకడలను తీసుకువచ్చారు. కంప్యూటర్ సైన్స్, భాషాశాస్త్రం, మానవీయశాస్త్రాలతో కూడిన ప్రత్యామ్నాయ అనువర్తిత పరిశోధనలతో తెలుగూ తదితర భాషలలో అనేక ఉపకరణాలను రూపొందించి అభివృద్ధి చేశారు.

ప్రయోగశాలలకే పరిమితమైన ప్రాయోగిక  జ్ఞానాన్ని సృష్టించడం ద్వారా కేవలం ఉపయోగకరమైన   పరిశోధనలలో కొత్త ధోరణులను ప్రారంభించటమేకాక  ప్రజోపయోగం కోసం మానవీయ శాస్త్రాల ఉత్పత్తులు / సాంకేతికత  పరంగా ఉపయోగపడే పరిశోధనా ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. భారత, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ప్రజా ప్రయోజన సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి, అనేకమార్లు విడుదల చేశారు.

విజ్ఞాన పరిశోధనా, శిక్షణా   వ్యాప్తిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర   సంస్థలతో విస్తృతంగా కలిసి పనిచేశారు. కంప్యూటర్ సైన్స్, భాషాశాస్త్రం, సాహిత్య రంగాలలో పరిశోధనను   సమన్వయం చేస్తూ విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా  పత్రికలూ  మ్యాగజైన్స్లలో   వందల పరిశోధన పత్రాలూ   గ్రంథాలూ ప్రకటించారు. విజ్ఞాన వ్యాప్తికి వీలు కల్పించేవిధంగా మనదేశమూ   విదేశాలలోనూ  కార్యశాలలనూ  సమావేశాలనూ నిర్వహించారు.

ప్రజల వినియోగానికి పనికివచ్చే పలు ఆవిష్కరణలతో పరిశోధనలను విస్తరించారు. భాషాశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, సంగణక భాషాశాస్త్రం, చారిత్రక భాషాశాస్త్రం వంటి అనేక రంగాల్లో  సరికొత్త   ఆవిష్కరణలకు తెరతీశారు.

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో మాతృభాషలను విద్యామాధ్యమంగా పక్కనపెట్టడాన్ని నిరసిస్తూ బడిభాషగా మాతృభాషల అవసరాన్నీ అవి మన సమాజాల ఆర్థిక   అభివృద్ధికి ఎంతగా దోహదపడుతున్నాయో  గణాంకాలద్వారా పరిశోధించి చూపించారు. భాష, ఆర్థిక వ్యవస్థ, తులనాత్మక భాషాశాస్త్రం, మాతృభాష మాధ్యమంగా బోధన, భాషా జన్యుశాస్త్రం, అనుసరణ వ్యాకరణం పద్ధతిలో ఆంగ్ల భాషా అభ్యాసం, బోధన; "కోరా" వంటి సోషల్ మీడియాలలో భాషా సంబంధిత వివిధ ఇతివృత్తాలపై 550 కి పైగా వ్యాసాలను ప్రచురించారు.

తెలుగు భాష మీద కృషి

[మార్చు]

తెలుగు రాష్ట్రాల్లో భాషా సంక్షోభం అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో ప్రపంచీకరణ అంటే ఆంగ్లీకరణ ద్వారా కాకుండా స్థానికీకరణ జరగాలని, ఇదంతా భాషావైవిధ్యం ద్వారానే సాధ్యం అవుతుందని, పాఠశాల స్థాయిలో ఇంగ్లీషు మాధ్యమం ఈ వైవిధ్యాన్ని నాశనం చేస్తుందని, వందలాది స్థానీయ సాంప్రదాయ వృత్తివ్యాపారాలను ఆధునికీకరించి వేలాదిమందికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచటం మాతృభాషలద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని, స్థానిక భాషలలో విద్యాబోధన, వృత్తివ్యాపారాలూ వాణిజ్యం, పరిశ్రమలను చవకగానూ, సులువుగానూ ఎక్కువమందిని కలుపుకుంటూ నిర్వహించే వీలు కలుగుతుందని, భాషావైవిధ్యాన్ని కాపాడుకుంటేనే విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి సొదాహరణంగా చర్చించారు. మాతృభాషా మాధ్యమంతో వ్యవహార నైపుణ్యాలనూ ఇంగ్లీషూ ఇతర భాషలలో నైపుణ్యాన్నీ సంపాదించటం సులువు అవుతుంది అనేది గారపాటి ఉమామహేశ్వరరావు అభిప్రాయం. విద్య, వైద్యం, పాలన రంగాల్లో తెలుగు మరింత విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందరి తెలుగూ, అన్ని చోట్ల ఉన్న తెలుగూ అన్ని రకాల తెలుగూ మనకి కావాలి వీటన్నిటితోనే తెలుగు పరిపుష్టమౌతుంది. అమ్మనుడి చదువులపై జనాలకు ఉన్న అపోహలను తొలగించి, మన భాషపై మమకారాన్ని కల్పించాలని, యువతకీ చేరువ కావాలని తెలుగు బలగం[4] అనే ఉద్యమం ప్రారంభించారు.

మూలాలు

[మార్చు]
  1. Mar 1; 2013. "Vishishta Puraskar for Prof. Uma Maheswara Rao |" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-29. Retrieved 2020-08-06. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "Uma Maheshwar Rao Garapati | University of Hyderabad - Academia.edu". uohyd.academia.edu. Retrieved 2020-08-06.
  3. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2021-04-22. Retrieved 2020-08-06.
  4. "తెలుగు బలగం". తెలుగు బలగం. Retrieved 2020-08-06.